ఈ కాలంలో పిల్లలకు పండ్లు ఇవ్వొచ్చా?

వర్షాకాలంలో, చలికాలంలో మా పిల్లలకి జలుబు ఎక్కువగా చేస్తుంది. ఈ సమయంలో వాళ్లకి పండ్లు పెట్టొచ్చా? ఇవ్వొచ్చంటే ఏయే రకాలు ఇవ్వొచ్చో చెప్పగలరు.

Published : 04 Aug 2022 18:19 IST

వర్షాకాలంలో, చలికాలంలో మా పిల్లలకి జలుబు ఎక్కువగా చేస్తుంది. ఈ సమయంలో వాళ్లకి పండ్లు పెట్టొచ్చా? ఇవ్వొచ్చంటే ఏయే రకాలు ఇవ్వొచ్చో చెప్పగలరు.

- ప్రియ, హైదరాబాద్‌

వరైనా తమ ఆహారంలో పండ్లను విరివిగా తీసుకోవచ్చు. తీసుకోవాలి కూడా. తక్కువ పరిమాణంలో తీసుకున్నా శరీరానికి ఎక్కువ మోతాదులో విటమిన్లూ, ఖనిజాలూ, యాంటిఆక్సిడెంట్లు, ఎంజైమ్‌లు, ఫైటో కెమికల్స్‌.. అందేది పండ్ల నుంచే. వేగంగా అందడమే కాదు, ఒంటబడతాయి కూడా. అందుకే అనారోగ్యంతో ఉన్న వారికి పండ్లూ, పండ్ల రసాలని అందిస్తుంటారు. అయితే, కొద్ది మంది పిల్లలకు అలర్జీ ఉంటుంది. ముఖ్యంగా నిమ్మజాతి పండ్లతో ఇది ఎక్కువ. దానివల్ల ముక్కులోంచి నీరు కారుతుంటుంది. అయితే పండ్ల నుంచి వచ్చే అలర్జీ లక్షలో ఒకరికి మాత్రమే ఉంటుంది. ఇది కూడా రాకూడదనుకుంటే చిన్నప్పట్నుంచీ పిల్లలకి అన్ని రకాల పండ్లనీ అలవాటు చేయాలి. అయితే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే.. ఒకే రకం పండ్లని అధిక పరిమాణంలో తెచ్చి వాటినే వారం పొడుగునా తినడం. అలా కాకుండా తరచూ వేర్వేరు రకాల పండ్లను తీసుకోవాలి. వర్షాకాలం, చలికాలంలో శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. పండ్లని బాగా కడిగాకే తినాలి. ఇవి సుదూరాల నుంచి రవాణా అవుతాయి. వాటి ప్యాకింగ్‌, నిల్వ కోసం రసాయనాలు వాడుతుంటారు. వాటి వల్ల సమస్యలు రావొచ్చు. పైన తొక్క తినం కదా, అనుకోకుండా బొప్పాయి, పుచ్చకాయ ముక్కల్ని సైతం కడుక్కోవడం మేలు. అలాగే పచ్చిగా, మరీ ఎక్కువగా మగ్గిన వాటిని కాకుండా పక్వానికి వచ్చిన వాటిని తీసుకోవాలి. ప్యాకేజ్డ్‌ పండ్ల రసాల్లో ఫ్లేవర్డ్‌ అని ఉంటుంది. అవి నిజమైన పండ్ల గుజ్జుతో చేసినవి కావు. ఇంట్లో చేసే పండ్ల రసాల్లోనూ చక్కెర, పులుపు తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఫ్రిజ్‌లో పెట్టినవి గది ఉష్ణోగ్రతకు వచ్చాకే తినాలి. ఎక్కువ కాలం నిల్వ ఉన్నవీ తినకూడదు. నిజానికి ఈ సీజన్లలోనే వ్యాధుల ముప్పు ఎక్కువ. వాటిని ఎదుర్కోవడానికి అవసరమైన పోషకాలు పండ్లనుంచే అందుతాయి. అలాగే అలర్జీలను గమనించుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని