మావారితో కలిసి ఉండలేనా?

సొంత అక్క మరిదితో పెద్దల సమక్షంలో 2021 అక్టోబరులో నాకు పెళ్లైంది. 2022 జనవరిలో ఒకామె మా ఇంటికొచ్చి మావారితో నాలుగేళ్ల కిందటే తనకు పెళ్లైందని చెప్పి, మా పెళ్లి చెల్లదంది. ఆమె విదేశాల్లో ఉంటోంది. తనకీ వేరే వ్యక్తితో పెళ్లయింది

Published : 09 Aug 2022 01:38 IST

సొంత అక్క మరిదితో పెద్దల సమక్షంలో 2021 అక్టోబరులో నాకు పెళ్లైంది. 2022 జనవరిలో ఒకామె మా ఇంటికొచ్చి మావారితో నాలుగేళ్ల కిందటే తనకు పెళ్లైందని చెప్పి, మా పెళ్లి చెల్లదంది. ఆమె విదేశాల్లో ఉంటోంది. తనకీ వేరే వ్యక్తితో పెళ్లయింది కూడా. అప్పటికి నేను గర్భం దాల్చా. ఇంకెప్పుడూ ఆమె వచ్చే పరిస్థితి ఉండదని మావారు భరోసా ఇచ్చారు. పాపకి జన్మనిచ్చాక మావారి తీరు మారిపోయింది. నేను పలు రకాలుగా వేధిస్తున్నానని విడాకులకు దరఖాస్తు చేశారు. పోలీసుల్ని సంప్రదిస్తే కౌన్సెలింగ్‌ చేశారు. అయినా ఆయనలో మార్పులేదు. నాకు కలిసి ఉండాలని ఉంది. పరిష్కారం ఏంటి?

- ఓ సోదరి

మీతో పెళ్లికి ముందర అతనికి వేరొకరితో పెళ్లి అయితే దాన్ని చెప్పకుండా, లీగల్‌గా విడాకులు తీసుకోకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే మీ పెళ్లి చెల్లదు. కానీ మీ పిల్లలకూ, మీకూ పోషణ బాధ్యత అతనే వహించాలి. విడాకులకు దరఖాస్తు చేశారంటే మొదటి భార్యకు ఇప్పటికే విడాకులు ఇచ్చినట్లు అనుకోవాలా? పోలీసుల్ని సంప్రదించినా అతను మారలేదంటే అతని మొండి వైఖరి అర్థమవుతోంది. మీరు కూడా విడాకుల కేసులో మీ భర్తతో కలిసి ఉండాలనుకుంటున్నారని కౌంటర్‌ వేయండి. లేదంటే మీ భర్తను తిరిగి ఫ్యామిలీ సొసైటీలో చేర్చమని హిందూ వివాహ చట్టం సెక్షన్‌-9 ప్రకారం కౌంటర్‌ క్లెయిమ్‌ వేయండి. మీ భర్తతో కలిసి ఉండాలని మీరు మాత్రమే అనుకుంటే పరిష్కారం దొరకదు. తను కూడా అనుకోవాలి. అతని మీద క్రిమినల్‌ కేసుల్లాంటివి పెట్టకండి. ఆ కారణం చూపి విడాకులు తీసుకోవడానికి ప్రయత్నించవచ్చు. చాలా జాగ్రత్తగా కేసును నడిపించండి. మీరు అతనితో ఎందుకు కలిసి ఉండాలనుకుంటున్నారో కోర్టుకు చెప్పగలగాలి. మీ తప్పేమీ లేకుండా విడాకులు కోరుకుంటున్నారని కోర్టుకి స్పష్టత వస్తే అతని విడాకుల కేసు కొట్టేస్తారు. మీరు వేసిన కౌంటర్‌ కేసు.. అంటే కలిసి ఉండాలనుకునే పిటిషన్‌ను ఖరారుచేసే అవకాశం ఉంటుంది. అతనికి విడాకులు మంజూరు కాకపోయినా, మీతో కలిసి ఉండాలని కోర్టు తీర్పు ఇచ్చినా కలిసి ఉంటాడా లేదా అన్నదానికి పరిష్కారం చెప్పలేం. ఎందుకంటే కోర్టు తీర్పులు కలిపి కాపురాలు చేయించలేకపోతున్నాయి. నెలసరి భత్యం కోసం ప్రయత్నించవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని