‘సారీ’తోనూ సమస్యేనా?
గత అక్టోబరులో ఉద్యోగంలో చేరా. మా మేనేజర్ నాకు మెంటార్ కూడా. ప్రతి వారం లక్ష్యాలు, పనిలో సమస్యల గురించి చర్చించుకుంటాం. గత మీటింగ్‌లో ‘నీకో ఫీడ్‌బ్యాక్. ఉద్యోగపరంగా బాగా చేస్తున్నావు. ఆ విషయంలో సంతోషంగా ఉన్నాను
గత అక్టోబరులో ఉద్యోగంలో చేరా. మా మేనేజర్ నాకు మెంటార్ కూడా. ప్రతి వారం లక్ష్యాలు, పనిలో సమస్యల గురించి చర్చించుకుంటాం. గత మీటింగ్‌లో ‘నీకో ఫీడ్‌బ్యాక్. ఉద్యోగపరంగా బాగా చేస్తున్నావు. ఆ విషయంలో సంతోషంగా ఉన్నాను. అయితే నువ్వో అంశంపై దృష్టిపెట్టాలి. నేనూ సాయం చేస్తా. నీకు త్వరగా క్షమాపణ చెప్పే అలవాటుంది. విషయం చిన్నదైనా పెద్దదైనా సారీ చెప్పేస్తావు. ఒక్కోసారి అవసరం లేకపోయినా అలా చెబుతోంటే.. వినే వాళ్లూ ఎందుకు చెప్పావోనని తికమకపడుతుంటారు. ఈ అలవాటు నీ విశ్వసనీయతపై ప్రభావం చూపుతోంది’ అన్నారు. ఇన్నిసార్లు సారీ చెబుతున్నానన్న విషయాన్నే నేను గమనించలేదు. దీంతో ఇంత ఇబ్బందని తెలిసి ఆశ్చర్యపోయా. సహోద్యోగినడిగితే అవునంది. ఈ అలవాటు ఎలా వచ్చిందో కూడా తెలీదు. మార్చుకోవాలంటే ఏం చేయాలి?
- శ్రీజ, ముంబయి
మీరే కాదు.. చాలామంది అమ్మాయిల్లో ఈ అలవాటు ఉంటుంది. తెలియకుండానే ఊరికూరికే క్షమాపణ చెప్పేస్తుంటారు. మీకులాగే వాళ్లకీ అలా ఉపయోగిస్తున్నారన్న విషయం తెలియదు. దీన్ని పోగొట్టుకోవాలంటే ఈ పద్ధతుల్ని పాటించండి.
* సారీని ఎప్పుడు, ఏ సందర్భాల్లో ఎక్కువగా చెబుతున్నారో పరిశీలించుకోండి. స్నేహితుల్నీ గమనిస్తూ ఉండమనండి. అనవసరంగా చెబుతున్నప్పుడు మీకు గుర్తు చేయమండి.
* ఈ విషయంలో మీకు స్పష్టత వచ్చాక ఆ సందర్భాలకి ముందుగానే సిద్ధమవ్వండి. ఉదాహరణకి- మీటింగ్‌లో ‘ఈ శుక్రవారం నాటికి రిపోర్ట్ సిద్ధమవుతుందా?’ అని అడుగుతారనుకుందాం. దానికి ‘సారీ’ లేకుండా సమాధానం ఎలా చెప్పాలో నాలుగైదు రకాలుగా సిద్ధం చేసుకోండి. రోజువారీ సంభాషణల్లోనూ మాట్లాడే ప్రతి విషయాన్నీ గమనించుకుంటూ ఉండండి.
* ఏరోజైనా ‘సారీ’ని తక్కువగా, లేదా అసలు ఉపయోగించకపోయినా మిమ్మల్ని మీరు అభినందించుకోండి. ప్రతి మాటా ఆలోచించుకొని మాట్లాడటమూ ఒత్తిడే. అందుకే కొద్ది రోజులు మాటల్లో సారీ దొర్లినా నిరుత్సాహ పడకండి. మార్పు రావడానికి కొంత సమయం పడుతుంది.
ఇంకా.. ఇచ్చిన సూచనను సీరియస్‌గా తీసుకున్నాననీ, మారడానికి ప్రయత్నిస్తున్నాననీ మీ మేనేజర్‌కి తెలియజేయండి. తన సాయానికి కృతజ్ఞతలు చెప్పడమూ మర్చిపోవద్దు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.