గోళ్లరంగు తప్పనిసరి అవుతోంది!
నెయిల్ పాలిష్ తరచూ వేసుకుంటాను. కానీ గోరు పక్కన చర్మమంతా లాగేసినట్లుగా అవుతోంది. గోళ్లు కూడా జీవం కోల్పోయినట్లుగా తయారవుతున్నాయి. దీంతో రంగు వేసుకోవడం తప్పనిసరి అవుతోంది.పరిష్కారం చెప్పండి.
నెయిల్ పాలిష్ తరచూ వేసుకుంటాను. కానీ గోరు పక్కన చర్మమంతా లాగేసినట్లుగా అవుతోంది. గోళ్లు కూడా జీవం కోల్పోయినట్లుగా తయారవుతున్నాయి. దీంతో రంగు వేసుకోవడం తప్పనిసరి అవుతోంది. పరిష్కారం చెప్పండి.
- ఓ సోదరి
గోళ్లరంగులు రసాయనాలతో నిండి ఉంటాయి. వీటిల్లో ఉండే టాల్యూన్, ఫార్మాల్డిహైడ్, ఎసిటోన్ వంటి కెమికల్స్ చర్మాన్ని పొడిగా చేయడం, తల, కళ్లు, గొంతు నొప్పి, అలర్జీలు, గోళ్లు, దాని పక్కన చర్మం పొడి బారడం వంటివాటికి కారణమవుతాయి. కొందరిలో కడుపులో తిప్పడం, నరాలపై ప్రభావం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది, క్యాన్సర్ వంటివాటికీ దారితీయొచ్చు. కాబట్టి, ఏవిపడితే అవి వాడొద్దు. లేత రంగు చర్మం ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. తిరిగి బాగవ్వడానికి 4-6 నెలలు పడుతుంది. అందుకని సురక్షితమైనవి ఎంచుకోవాలి. పైన చెప్పిన రసాయనాలతోపాటు పారాబెన్‌లు లేనివి ఎంచుకోవాలి. సహజ నూనెలు, విటమిన్ ఇ, వృక్షసంబంధిత పదార్థాలున్నవి తీసుకోవాలి. వీటినీ తరచూ వాడొద్దు. నెయిల్ పాలిష్ తొలగించడానికి ఆల్కహాల్ లేని రిమూవర్‌ని వాడండి. రంగుల్ని వేయడానికి మధ్య కనీసం 3 వారాల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. చలిగా ఉన్నప్పుడూ వేయొద్దు. గోరు రంగు, ఆకారం మారడం, పక్కన వాయడం, దానిపై పగుళ్లు వంటివి వస్తే నెయిల్ పాలిష్ వేయొద్దనడానికి సంకేతం. గిన్నెలు కడిగేప్పుడు గ్లౌజ్‌లు వాడండి. మానిక్యూర్, పెడిక్యూర్‌లకు దూరంగా ఉండండి. గోళ్లు కొరక్కుండా నెయిల్ కటర్‌తో కట్ చేయాలి. క్యూటికల్స్‌నీ తరచూ కత్తిరించుకోవాలి. నీళ్లలో పనిచేసినప్పుడు వేళ్లను వెంటనే వస్త్రంతో తుడవడం, ఆరబెట్టడం లాంటివి చేయాలి. రోజూ గోళ్లు, వాటి పక్క చర్మాన్ని నూనెతో మర్దనా చేయాలి. ఎస్‌పీఎఫ్ 30 ఉన్న హ్యాండ్ క్రీమ్‌ను రాస్తుండాలి. తగినంత నీరూ తాగాలి. వైద్యుల సలహాతో బయోటిన్, బీకాంప్లెక్స్ వంటివి వాడొచ్చు. బయోటిన్ ఎక్కువగా ఉండే ఆహారాన్నీ తీసుకోవాలి. వీటితో సమస్య దూరమవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.