కనుబొమలు పలుచన!

వయసు 48. కనుబొమలు పలుచబడుతున్నాయి. దగ్గరగా చూస్తే కానీ కనిపించనంతగా ఊడిపోయాయి. సమస్యేంటి? పరిష్కారం చెప్పండి.

Published : 11 Sep 2022 00:40 IST

వయసు 48. కనుబొమలు పలుచబడుతున్నాయి. దగ్గరగా చూస్తే కానీ కనిపించనంతగా ఊడిపోయాయి. సమస్యేంటి? పరిష్కారం చెప్పండి.

- ఓ సోదరి

కొన్నిరకాల ఇన్ఫెక్షన్లు, చర్మతీరు, హార్మోనుల్లో అసమతుల్యత, ఓవరాక్టివ్‌ ఇమ్యూన్‌ సిస్టమ్‌, పోషకాల కొరత, భావోద్వేగ ఒత్తిడి.. కనుబొమలు పలుచబడటానికి ఇలా కారణాలెన్నో! రెండిట్లో ఒకదానికే సమస్య ఎదురైతే ఇన్ఫెక్షన్‌, చర్మసమస్యలు కారణమై ఉండొచ్చు. రెండింటికీ ఉంటే మాత్రం మిగతా సమస్యలేమైనా ఉన్నాయేమో చెక్‌ చేయించుకోవాలి. అలోపేషియా ఏరియేటా.. ఇదో ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌. మన రోగనిరోధకత మన శరీరంపైనే దాడి చేస్తుంది. దీనిలో కనుబొమల వద్ద వెంట్రుకలు గుండ్రంగా ప్యాచ్‌లుగా ఊడుతుంటాయి. పూర్తిగా పోతే.. అలోపేషియా యూనివర్సాలిస్‌ కావొచ్చు. శరీరానికి కార్బోహైడ్రేట్స్‌, ప్రొటీన్స్‌, కొవ్వులు, అమైనో యాసిడ్స్‌, ఫ్యాటీయాసిడ్లు, విటమిన్లు, మినరల్స్‌ వంటి పోషకాలు కావాలి. వీటిలో ఏది కొరవడినా ఈ సమస్య ఎదురవుతుంది. ఎగ్జిమా అయితే ఎర్రబడటం, దురద వంటివి ఉంటాయి. సొరియాసిస్‌లో చర్మరంధ్రాలు హెయిర్‌ ఫాలికల్స్‌కి అడ్డుపడి వెంట్రుకలు రాలిపోవడానికీ, కొత్తవి రాకుండా చేయడానికీ కారణమవుతాయి. ఏవైనా రసాయనాలు పడకపోతే కాంటాక్ట్‌ డెర్మటైటిస్‌, నూనెలు ఎక్కువగా విడుదలై ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌కి కారణమవుతోంటే సెబారిక్‌ డెర్మటైటిస్‌గా నిర్థరిస్తాం. థైరాయిడ్‌, అతిగా ఐబ్రోస్‌ చేయించుకోవడం, ఐబ్రో పెన్సిల్‌ వాడటం వల్లా కనుబొమలు పలచబడతాయి.

పరిష్కారానికి.. మినాక్సిడల్‌ సొల్యూషన్‌ రోజూ రాత్రి రాయాలి. టాపికల్‌ కార్టికో స్టెరాయిడ్స్‌ వాడాలి. అలోపేషియా ఏరియేటా ఉంటే ఇంజెక్షన్లతో సమస్య అదుపులోకి వస్తుంది. వీటితోపాటు ఒమెగా 3, 6 ఫ్యాటీ యాసిడ్లు, బయోటిన్‌ సప్లిమెంట్లూ తీసుకోవాల్సి ఉంటుంది. లీన్‌ మీట్‌, తాజా పండ్లు, కూరగాయల్ని ఎక్కువగా తినాలి. ఒత్తిడితోపాటు త్రెడింగ్‌, మేకప్‌లకు దూరంగా ఉండాలి. ఇప్పటికే కనుబొమలు బాగా తగ్గిపోతే బై మెటోప్రాస్ట్‌, ఐబ్రో ట్రాన్స్‌ప్లాంట్‌, మైక్రోపిగ్మెంటేషన్‌లనీ చేయించుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్