అతని కోసం.. చెయ్యి కోసుకుంది!
మా అమ్మాయి ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇంటర్ ఫెయిలైన కుర్రాడితో రిలేషన్‌లో ఉంది. అతను లేకపోతే బతకలేనంటూ చెయ్యి కోసుకుంది. అతడూ అంతే. ఫోన్‌లో చాట్
మా అమ్మాయి ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇంటర్ ఫెయిలైన కుర్రాడితో రిలేషన్‌లో ఉంది. అతను లేకపోతే బతకలేనంటూ చెయ్యి కోసుకుంది. అతడూ అంతే. ఫోన్‌లో చాట్ చేస్తుంటుంది. ఇంట్లోంచి వెళ్లిపోతుందేమోనని భయంగా ఉంది. ఫోన్ లాగేసుకోవడం, వేరే ఊరు పంపడం, పిల్లాణ్ణి కంట్రోల్లో పెట్టుకోమని అతడి అమ్మానాన్నలకు చెప్పడం... ఏం చేస్తే బాగుంటుందో చెప్పండి!
- ఒక సోదరి
పిల్లలు బాధపడతారు, వాళ్లకన్నీ తెలుసు, అర్థం చేసుకుంటారు లెమ్మని కుటుంబ సంప్రదాయాలూ కట్టుబాట్ల గురించి చెప్పకపోతే ఇలాంటి చిక్కులొస్తాయి. టీనేజ్‌లో ఏది మంచో ఏది చెడో గ్రహించలేక తప్పుదారి పడతారు. ఇప్పుడు మీ అమ్మాయి పెళ్లి చేసుకోవడం పట్ల వ్యతిరేకత చూపొద్దు. ‘ముందు చదువుకో! ఇద్దరూ ఆర్థికంగా స్థిరపడండి. పరిపక్వత లేని వయసులో చేసుకుంటే వ్యక్తిగతంగా, వివాహపరంగా, కుటుంబపరంగా వచ్చే సమస్యలను తట్టుకోలేవు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిలదొక్కుకోవాలంటే పరిపక్వత, ఆర్థిక స్థిరత్వం ఉండాలి. కనుక చదువు ముఖ్యం. ఆవేశంలో చెయ్యి కోసుకోవడం కాదు, బాధ్యతలు మీద పడిన తర్వాత ఎలా జీవనం సాగించాలో ఆలోచించు. వాస్తవికతను అర్థం చేసుకో! రాబోయే పరిణామాలను ఎదుర్కోవాల్సింది నువ్వే కనుక ఆచితూచి అడుగేయకపోతే ఆనక దుఃఖించాలి. మొదట చదివి ఉద్యోగం తెచ్చుకో! అతడికీ అదే చెప్పు. అప్పుడు లక్షణంగా చేసుకోవచ్చు. పెద్ద వాళ్లమని నీతులు చెప్పడం లేదు. మేమూ ఈ వయసు దాటొచ్చినవాళ్లమే. ఆకర్షణలకు లొంగితే తర్వాత ఇబ్బంది రావచ్చు. పైగా ఈ కుర్రాడు లేదా అతని పెద్దలు ‘పెళ్లికి ముందే కలిసి తిరిగావు, నైతికత లేదు’ అంటే ఎంత కష్టమో ఆలోచించు...’ తరహాలో బుజ్జగిస్తూ చెప్పండి. మీ మాట వినదనుకుంటే బంధుమిత్రుల్లో ఎవరితోనైనా చెప్పించండి, అమ్మాయిలో మార్పు వస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.