అలా కోరుకోవడం తప్పా?

అయిదేళ్లలో మూడు ఉద్యోగాలు మారా. ఒక్కోదానికి ఒక్కో కారణముంది. ఇబ్బందులున్నా కొందరు అదే కొలువులో కొనసాగుతుంటారు. అదెలాగో నాకిప్పటికీ అర్థం కాదు. పైగా నాతోనే ఏదో సమస్య, అందుకే సరైన ఉద్యోగాన్ని వెతుక్కోలేకపోతున్నా అంటున్నారు. పని ఆనందాన్ని ఇవ్వాలని కోరుకోవడం తప్పా? ఆఫీసులో నచ్చనివేంటో నాకు తెలుసు. ఉద్యోగంలో ఆనందాన్నిచ్చే అంశమేదో మాత్రం తెలీడం లేదు.

Updated : 14 Sep 2022 02:47 IST

అయిదేళ్లలో మూడు ఉద్యోగాలు మారా. ఒక్కోదానికి ఒక్కో కారణముంది. ఇబ్బందులున్నా కొందరు అదే కొలువులో కొనసాగుతుంటారు. అదెలాగో నాకిప్పటికీ అర్థం కాదు. పైగా నాతోనే ఏదో సమస్య, అందుకే సరైన ఉద్యోగాన్ని వెతుక్కోలేకపోతున్నా అంటున్నారు. పని ఆనందాన్ని ఇవ్వాలని కోరుకోవడం తప్పా? ఆఫీసులో నచ్చనివేంటో నాకు తెలుసు. ఉద్యోగంలో ఆనందాన్నిచ్చే అంశమేదో మాత్రం తెలీడం లేదు. అది తెలుసుకునే మార్గముందా?

- అవిక, ముంబయి

నందాన్నిచ్చే ఉద్యోగాన్ని వెదుకుతున్నవారు చాలామందే ఉన్నారు. ప్రతిదాన్నీ మానేస్తూ వెళ్లక కొంచెం హోంవర్క్‌ చేయండి. మీకు సంతోషాన్నిచ్చే అంశాలేంటో పేపరుపై రాయండి. ఒంటరిగా ఉండటం ఇష్టమా? నలుగురితో కలిసి చేయడం నచ్చుతుందా? ఆఫీసు వాతావరణమెలా ఉండాలి? జీతం ఎక్కువుండాలా? తక్కువైనా ఫర్లేదా? అలాగే మీకు తెలిసినవారు, స్నేహితులకీ చేరబోయే సంస్థ నుంచి మీరేం కోరుకుంటున్నారో తెలియజేయండి. నైపుణ్యాలను తరచూ మెరుగుపరచుకోవడం ఇష్టమా? చెప్పేయండి. దీనికి సంబంధించి సాయం అవసరమైనా అడగడానికి వెనకాడొద్దు. ఎంతటివారికైనా మార్గనిర్దేశం.. ముఖ్యంగా ఇలాంటి ఉద్యోగాలవేటలో చాలా అవసరం. ఆనందంగా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. ఆ క్షణంలో జీవించడం, సంతోషమైనా బాధైనా స్వీకరించడానికి మించిన అద్భుతమైన భావన మరోటి లేదు. కానీ కొన్నిసార్లు పనిలో పడి విలువైన క్షణాలను మిస్‌ అవుతున్నట్లు అనిపిస్తుంది. అందుకే చాలామంది ఒత్తిడిని పక్కనపెట్టి హుషారుగా ఎలా పనిచేయొచ్చని అడుగుతుంటారు. సంతోషాన్నిచ్చే పర్‌ఫెక్ట్‌ జాబ్‌ సాధించడం కష్టమేమో కానీ మీకు ఆనందాన్నిచ్చేవాటిని కెరియర్‌గా ఎంచుకుంటే మాత్రం ఆనందంగా సాగడం సాధ్యమే.

రోగులకు బాధ తగ్గించి, వారి ముఖాల్లో చిరునవ్వు నింపుతారు కాబట్టి, డాక్టర్లు, నర్సులు చాలా సంతృప్తిగా ఉంటారు. అదే చెఫ్‌ అయితే రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం ద్వారా దాన్ని సాధిస్తారు. సృజనాత్మకతకు పెద్దపీట వేసే వెబ్‌డిజైనర్లు, కంటెంట్‌ క్రియేటర్లు తమ ఊహాశక్తితో అద్భుతాలు సృష్టించి దానిలో ఆనందం వెతుక్కుంటారు. రేపటి తరాల భవిష్యత్‌లో భాగమయ్యామన్న సంతృప్తి టీచర్లలో కనిపిస్తుంది. సంతోషకరమైన ఉద్యోగం.. గుర్తింపు, సంతృప్తి, సౌకర్యంపైనే ఆధారపడి ఉంటాయి. అవి మీకు దేనిలో దొరుకుతాయో గ్రహించగలిగితే మీరు కోరుకున్న ఉద్యోగమేదో తెలుస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని