అమ్మవారు పోసి.. మచ్చలు
వయసు 21. అయిదు నెలల క్రితం అమ్మవారు (చికెన్‌పాక్స్) పోసింది. ముఖం, శరీరం మీద బాగా మచ్చలు ఏర్పడి పోవడం లేదు. జుట్టూ బాగా ఊడుతోంది. పరిష్కారం చూపండి.
వయసు 21. అయిదు నెలల క్రితం అమ్మవారు (చికెన్‌పాక్స్) పోసింది. ముఖం, శరీరం మీద బాగా మచ్చలు ఏర్పడి పోవడం లేదు. జుట్టూ బాగా ఊడుతోంది. పరిష్కారం చూపండి.
- ఓ సోదరి
ఇదో వైరల్ ఇన్ఫెక్షన్. పిల్లలతో పోలిస్తే పెద్దవాళ్లలో దీని ప్రభావం ఎక్కువ. దురద, నీటితో కూడిన బొబ్బలతోపాటు జ్వరం, ఆకలి మందగించడం, తల, ఒళ్లు నొప్పులు ఉంటాయి. మొదట గులాబీ రంగులో పొక్కుల్లా వచ్చి బొబ్బల్లా మారతాయి. తర్వాత అవి పగిలి వాటిలో ఉన్న నీరంతా బయటికి పోతుంది. చివరగా వాటిపై నల్లగా పెచ్చులు ఏర్పడతాయి. అవి రాలాక మచ్చల్లా కనిపిస్తాయి. మామూలుగానే ఇవి తగ్గడానికి కొంత సమయం పడుతుంది. గీరడం, గిల్లడం చేసినవారిలో ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటప్పుడు ఆ మచ్చలు పోవడానికి ఏళ్లు పడుతుంది. కొందరిలో గుంటలూ ఏర్పడతాయి. ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారిలో అదనపు సమస్యలూ తలెత్తుతాయి. ఇప్పుడు మీకున్న మచ్చల్ని పోస్ట్ ఇన్‌ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్‌గా చెబుతాం. విటమిన్ ఇ, సి, అలోవెరా, కోకో బటర్ ఉన్న క్రీములను వాడండి. పగలు సన్‌స్క్రీన్ తప్పక రాయాలి. రాత్రుళ్లు రెటినాల్ క్రీమ్‌లను వాడండి. ఇవి మచ్చల్ని తగ్గిస్తాయి. తగ్గకపోతే స్క్రబ్స్, కెమికల్ పీల్స్ చేయించుకోండి. లోతైన మచ్చలున్న వారికి ఎక్సెషన్, పంచ్ ఎక్సెషన్, ఫిల్లర్స్, మైక్రోనీడ్లింగ్, మైక్రోడర్మాబ్రేషన్ చేయాల్సి వస్తుంది. వెంట్రుకలు రాలడమూ సాధారణమే. ఇది చికెన్‌పాక్స్ తగ్గిన రెండు నెలలకు మొదలై.. 6-8 నెలల వరకూ ఉంటుంది. ఎక్కువ విశ్రాంతి, ఆరోగ్యకరమైన ఆహారం, ద్రవపదార్థాలు తీసుకోవడంపై దృష్టిపెట్టండి. బయోటిన్ సప్లిమెంట్స్‌నీ తీసుకోవాలి. బాదం, వాల్‌నట్స్ రోజూ గుప్పెడు తీసుకోండి. ధ్యానం వంటివీ చేస్తే ఈ సమస్యా తగ్గుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.