స్వేచ్ఛ ఇవ్వడం తప్పా?

అమ్మాయిలు స్వేచ్ఛగా ఉండాలనే ఉద్దేశంతో పన్నెండేళ్ల మా అమ్మాయికి అలాంటి వాతావరణాన్ని కల్పించాను. అయితే ఈమధ్య మొండిగా ప్రవర్తిస్తోంది. ఒకబ్బాయీ, తనూ ముద్దులు పెట్టుకుని

Updated : 26 Sep 2022 10:40 IST

అమ్మాయిలు స్వేచ్ఛగా ఉండాలనే ఉద్దేశంతో పన్నెండేళ్ల మా అమ్మాయికి అలాంటి వాతావరణాన్ని కల్పించాను. అయితే ఈమధ్య మొండిగా ప్రవర్తిస్తోంది. ఒకబ్బాయీ, తనూ ముద్దులు పెట్టుకుని కౌగిలించుకున్నారని చెబుతోంది. తనకెలా చెబితే అర్థమౌతుందో చెప్పండి!

- ఓ సోదరి, హైదరాబాద్‌

మీరిచ్చే స్వేచ్ఛను మీ అమ్మాయి అర్థంచేసుకుని పాటిస్తోందా లేక ఉల్లంఘిస్తోందా- అనేది తెలుసుకోలేకపోయారు. స్వేచ్చతోబాటు బాధ్యతలను కూడా నేర్పాలి. ముఖ్యంగా టీనేజ్‌ పిల్లలకు ఏ విషయాల్లో స్వేచ్ఛ ఇస్తున్నారు, ఎందుకిస్తున్నారు లాంటివన్నీ స్పష్టంగా చెప్పాలి. అలాగే స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడితనం వైపు వెళ్లకుండా ముందుగానే హెచ్చరించాలి. ఒక్కోసారి తల్లిదండ్రులిచ్చే స్వేచ్ఛను చేతకానితనమని, తమను అదుపులో పెట్టలేక వదిలేశారని అనుకుంటారు. కనుక అమ్మాయితో మనసువిప్పి మాట్లాడండి. ఆమె ఎదుగుదల కోసం స్వేచ్ఛనిచ్చామని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని, యుక్తవయసులో ఎదురయ్యే సమస్యల గురించీ వివరంగా చెప్పండి. స్నేహంగా ఉండొచ్చు కానీ కౌగిలింతలూ, ముద్దులూ సరికాదని.. ఎక్కడ ముట్టుకోకూడదు, ఎంత దూరంలో ఉండాలి, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి లాంటి సేఫ్‌టచ్‌ అంశాలు సున్నితంగా నేర్పండి. ఆడ, మగ చేరువగా ఉంటే ఉద్వేగాలు పెరిగి, నిగ్రహం కోల్పోయే అవకాశముంది. దాని మూలంగా అదే ఆలోచనల్లో ఉండి చదువులో వెనకపడటం, దేనిమీదా మనసు లగ్నం చేయలేకపోవడం, కెరియర్‌లో అనుకున్నది సాధించలేకపోవడం ఇవన్నీ అడ్డంకులుగా మారే అవకాశం ఉంటుందని అమ్మాయికి చెప్పండి. ఒకవేళ మీ మాట వినదనుకుంటే ఆమెకి ఇష్టమైన గురువు లేదా ఆదర్శంగా తీసుకునే బంధువులతో మీరు ముందు మాట్లాడి వారితో చెప్పించండి. అలాంటి అవకాశం లేకపోతే సైకాలజిస్టును కలిసి కౌన్సెలింగ్‌ ఇప్పించండి. ఆమె లక్ష్యాలు ఏమిటి, వాటిని చేరడానికి ప్రస్తుత వయసులో చేయాల్సినవి, చేయకూడనివి, సమాజ కట్టుబాట్లు ఎందుకు పాటించాలి అనే అంశాలన్నీ చెప్పి, ఆమెలో మార్పు వచ్చేలా చేస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని