పెళ్లయ్యాక సహజీవనం చేస్తున్నాడు...

నాకు పదేళ్ల క్రితం పెళ్లయ్యింది. అప్పటి నుంచీ అన్యోన్యంగానే ఉంటున్నాం. అయితే, గత ఐదేళ్లుగా మావారు మరో అమ్మాయితో సహజీవనం చేస్తున్నారన్న విషయం ఈ మధ్యే తెలిసింది.

Published : 15 Nov 2022 00:47 IST

నాకు పదేళ్ల క్రితం పెళ్లయ్యింది. అప్పటి నుంచీ అన్యోన్యంగానే ఉంటున్నాం. అయితే, గత ఐదేళ్లుగా మావారు మరో అమ్మాయితో సహజీవనం చేస్తున్నారన్న విషయం ఈ మధ్యే తెలిసింది. గొడవపడితే... కోర్టులు సైతం సహజీవనాన్ని ఆమోదించాయి. సర్దుకుపో లేదంటే విడాకులు ఇస్తా... అప్పుడు తననే పెళ్లి చేసుకుంటా అని చెబుతున్నాడు... ఇది నిజమేనా? ఇప్పుడు నేనేం చేయాలి.

- ఓ సోదరి

సహజీవనానికి విపరీత అర్థాలు తీస్తున్నారు. కోర్టులో సహజీవనానికి ఆమోదం లభించడానికి కారణం... పెళ్లిపేరుతో కాపురం చేసి ఆడపిల్లలకు అన్యాయం చేయకూడదనే ఆలోచనే.  1978లో సుప్రీంకోర్టు... ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకుందామనే ఉద్దేశంతో లేదా పెళ్లి చేసుకున్నామనే భావనతో దండలు మార్చుకుని కలిసి జీవించడం చట్టవ్యతిరేకం కాదు అని మొదటిసారి చెప్పింది. తర్వాత  2010లో ఖుష్బూ వర్సెస్‌ కన్నియమ్మాల్‌ కేసులో సహజీవనం సమాజానికి వ్యతిరేకమయినా... నేరం మాత్రం కాదని చెప్పింది. అలానే, 2013లో కూడా పెళ్లి చేసుకోకుండా సహజీవనం నేరం కాదు అని తీర్పునిచ్చింది. కానీ, పైన చెప్పిన తీర్పులన్నీ పెళ్లికాని వారికి వర్తిస్తాయి. పెళ్లయి సంసారాలు చేస్తున్న వారికి కాదు. 2021లో సుప్రీంకోర్టు గుల్జా కుమారీ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేసులో వివాహేతర సంబంధం నీతిబద్ధం కాదు. సంప్రదాయ బద్ధం అసలే కాదు అని కూడా చెప్పింది. 2022లో రోహిత్‌ కుమార్‌ కేసులో సహజీవనం విషయంలో లీగల్‌ నియమావళిని రూపొందించమని చెప్పింది. తెలిసీ తెలియక మేజర్‌ కాకముందే, రిలేషన్‌షిప్స్‌ల వల్ల తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతోన్న యువతకీ, దీని ద్వారా వారికి పుట్టిన పిల్లలకు చట్టబద్ధత ఇవ్వడం కోసం జరిగిన ప్రయత్నాలే ఇవన్నీ. మీ భర్త సహ జీవనానికి చట్టబద్ధత లేదు. సంప్రదాయమూ కాదు. ఆమెతో  ఆయన సంబంధాన్ని వదులుకోకపోతే విడాకులకు ప్రయత్నించండి. సెక్షన్‌ 13(1) ప్రకారం పెళ్లయిన తరువాత వేరొక మహిళ/పురుషుడితో లైంగిక సంబంధం పెట్టుకుంటే విడాకులు తీసుకునే హక్కు మీకు ఉంది.  బాగా ఆలోచించి మంచి లాయర్ని కలవండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని