పాత ప్రేమ తెలిసి... విడాకులడుగుతున్నాడు!

నాకు పెళ్లై మూడేళ్లు. మాకో బాబు. పెళ్లికి ముందు ఓ అబ్బాయిని ప్రేమించా. ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో విడిపోయాం.

Published : 22 Nov 2022 00:16 IST

నాకు పెళ్లై మూడేళ్లు. మాకో బాబు. పెళ్లికి ముందు ఓ అబ్బాయిని ప్రేమించా. ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో విడిపోయాం. ఇప్పుడు సమస్య ఏంటంటే... ఎనిమిది నెలల క్రితం అతడు నా సెల్‌కి ఫోన్‌ చేశాడు. నేను ఎత్తలేదు. దాన్ని గమనించిన నా భర్త పదే పదే అడుగుతుండటంతో నిజం చెప్పేశా. అది మొదలు సూటి పోటీలతో నరకం చూపడం మొదలు పెట్టాడు. ప్రసవానికి కూడా పుట్టింటికి పంపనన్నాడు. పెద్ద మనుషులు నచ్చచెబితే పంపాడు. తిరిగొచ్చాక మళ్లీ అదే పరిస్థితి. వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వచ్చేశా. ఇప్పుడు విడాకుల నోటీసు పంపాడు. భవిష్యత్తు భయంగా ఉంది. చట్టం నాకే విధంగా సాయం చేస్తుంది?

- ఓ సోదరి, హైదరాబాద్‌

వైవాహిక బంధం పరస్పర ప్రేమ, నమ్మకం, విశ్వాసం, సర్దుబాటుల మీద ఆధారపడి ఉంటుంది. మీ భర్త ఒక్క ఫోన్‌ కాల్‌తోనే నమ్మకాన్ని కోల్పోవడం సమంజసం కాదు. కానీ, ఎప్పుడైతే ఇష్టం పోతుందో అప్పుడు చిన్న విషయాన్ని కూడా రాద్ధాంతం చేస్తుంటారు. మీ భర్త విడాకుల నోటీసు పంపడానికి కారణంగా ఏది చూపించారో తెలియలేదు. ముందు అది తెలుసుకోండి. ఎందుకంటే, పెళ్లికి ముందటి మీ ప్రేమను కారణంగా చూపించి ఇప్పుడు విడాకులు తీసుకోలేరు. ఆ బంధాన్ని మీరు కొనసాగిస్తున్నారని ఆరోపిస్తే... అందుకు రుజువులు చూపించగలగాలి. విడాకుల నోటీసు వచ్చినంత మాత్రాన భయ పడక్కర్లేదు. ముందు కోర్టులో కౌన్సెలింగ్‌కి కూర్చోపెడతారు. మీకు విడాకులు ఇష్టం లేదని చెప్పండి. కౌన్సెలర్స్‌ అతని మనసు మార్చడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు మనసు మారొచ్చు. లేదంటే కోర్టులో ప్రొసీడింగ్స్‌ నడిచినప్పుడు... అతడు చెప్పిన కారణాలు... హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 13 ప్రకారం లేకపోయినా, వాటిని బలంగా నిరూపించ లేకపోయినా కోర్టు వాటిని కొట్టేస్తుంది. ముందు మంచి లాయర్‌ని పెట్టుకుని కేసు నడిపించండి. కచ్చితంగా న్యాయమే గెలుస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని