మూడేళ్ల పాప ఏడు దోశలు తింటోంది...?

మా పాప వయసు మూడేళ్లు. తన వయసుకు మించి తింటోందేమో అనిపిస్తోంది. కనీసం ఆరేడు దోశలు లేనిదే టిఫిన్‌ పూర్తి చేయదు. ఇడ్లీ, అయినా మరొకటైనా అంతే.

Published : 08 Dec 2022 00:15 IST

మా పాప వయసు మూడేళ్లు. తన వయసుకు మించి తింటోందేమో అనిపిస్తోంది. కనీసం ఆరేడు దోశలు లేనిదే టిఫిన్‌ పూర్తి చేయదు. ఇడ్లీ, అయినా మరొకటైనా అంతే. చికెన్‌ కనిపిస్తే... ఎంత పెద్ద ముక్కలైనా వదిలిపెట్టదు. పండ్లూ బాగానే తింటుంది. అన్నంలోకి మాత్రం పప్పు, పెరుగు తప్ప మరేదీ కలపనివ్వదు. అలాగని బరువూ పెరగడం లేదు. ఇదేమైనా సమస్యా. తనకి మంచి ఆహారపుటలవాట్లు చేయాలంటే ఏం చేయాలి?

- గీతిక, హైదరాబాద్‌

మీ పాప వయసుకి మించిన ఆహారమే తీసుకుంటోంది. అయినా బరువు ఏ మాత్రం పెరగడం లేదంటే నులి పురుగుల సమస్య ఉందేమో గమనించండి. పిల్లలకి ప్రతి ఆరు నెలలకి ఓ సారి డీ వార్మింగ్‌ చేయించాలి. అతి చురుగ్గా ఆటల్లో మునిగి తేలే చిన్నారులకూ ఆకలి కాస్త ఎక్కువే ఉంటుంది. ఇవి రెండూ కాకపోతే... పాపనోసారి పిల్లల వైద్యులకు చూపించండి. హార్మోన్ల హెచ్చు తగ్గులున్నాయా అన్నది పరీక్షిస్తారు. సాధారణంగా పిల్లలు పెద్దలు తినే మోతాదులో సగం, దాని కంటే తక్కువ ఆహారం మాత్రమే తీసుకోగలరు. మితిమీరి తింటుంటే... ఇంట్లో వాళ్ల ఆహారపుటలవాట్లూ కారణం కావొచ్చు. లేదా ఇతరులెవరైనా అలా తింటుంటే చూసి అలవాటు చేసుకునీ ఉండి ఉండొచ్చు. అది గమనించండి. అదే కారణం అయితే... మీరూ ఆరోగ్యకరంగా, ఆహారాన్ని మితంగా తినడం అలవాటు చేసుకోండి. ముఖ్యంగా విటమిన్లూ, మినరళ్లూ, ఇతరత్రా పోషకాలన్నీ మిళితమైన కూరగాయలు, పప్పులూ, గింజలూ, గుడ్లూ, ఆకుకూరలూ, పాలూ, పెరుగూ వంటివన్నీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. అప్పుడే పిల్లలు ఆరోగ్యంగా ఉండగలరు. ఇక, తనకు ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా, కొద్దికొద్దిగా ఇవ్వండి. వాటితో పాటు కొద్ది మోతాదులో నెమ్మదిగా జీర్ణమయ్యే పదార్థాలనూ ఇవ్వాలి. ఇలా చేస్తే ఆకలిని అదుపులో ఉంచవచ్చు. ఉదాహరణకు 2, 3 ఇడ్లీలు తిన్నాక... రెండు జామ ముక్కలో, క్యారెట్టో ఇస్తే నమిలి తినడానికీ, అది అరగడానికీ కాస్త సమయం పడుతుంది. ఇది క్రమంగా అలవాటుగానూ మారుతుంది. ఇక,  ఆకుకూరలూ, కాయగూరలు సరిగా తినకపోతే... వాటినే మరో రూపంలో ఇవ్వొచ్చు. పాలకూర తినకపోతే... దాంతో సూపో, చపాతీనో చేసివ్వండి. క్యారెట్‌, బీట్‌రూట్‌ రైస్‌లూ ఈ తరహానే. ఎప్పుడూ ఒకేలా కాకుండా... కొత్త ప్రయోగాలతో వారిని మెప్పించొచ్చు. ఇందుకోసం వారి ప్లేట్‌ని కలర్‌ఫుల్‌గా ఉండేలా చూడండి. అప్పుడు వారి శరీరానికి అవసరమైన పోషకాలన్నీ అందుతాయి. ఆరోగ్యంగానూ ఉంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్