అమ్మానాన్న గొడవలు పడి..

అమ్మానాన్నలు రోజూ దెబ్బలాడుకుంటూనే ఉంటారు. నాన్నకున్న దురలవాట్లే అందుకు కారణం. దీంతో మేం చదువు మీద దృష్టి నిలపలేకపోతున్నాం.

Published : 12 Dec 2022 00:01 IST

అమ్మానాన్నలు రోజూ దెబ్బలాడుకుంటూనే ఉంటారు. నాన్నకున్న దురలవాట్లే అందుకు కారణం. దీంతో మేం చదువు మీద దృష్టి నిలపలేకపోతున్నాం. చెల్లెలు ఒకసారి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసింది. అయినా పరిస్థితిలో మార్పు లేదు.

- ఓ సోదరి

మీ నాన్న దుర్గుణాలే గొడవలకు కారణమని తెలుసు కదా! భరించడమే తప్ప ఏమీ చేయలేని నిస్సహాయత మీ అమ్మది. అది వాళ్లిద్దరూ అనుభవించాల్సిన పరిస్థితి. ఆవిడ ఇన్నేళ్లుగా భరిస్తోందంటే.. దాని గురించి మీరు చేయగలిగింది లేదు. అలాగని వదిలేయాలని కాదు. ఇలాంటి వాతావరణంలో ఉండాల్సిరావడం మీ సమస్య. దీన్ని అధిగమించి బయటపడటం గురించి ఆలోచించాలే తప్ప స్థైర్యాన్ని కోల్పోవద్దు. మానసికంగా, ఆర్థికంగా స్థిరపడటానికి ప్రయత్నించాలి. సమాజంలో నిలబడగలిగేందుకు గట్టితనాన్ని అలవరచుకోవాలి. అమ్మా నాన్నల గొడవలు మిమ్మల్ని కుంగదీయకుండా మనసు గట్టి చేసుకోవాలి. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళ్లండి. మీ కంటూ ఒక దృక్పథం, ధ్యేయం ఉన్నప్పుడు వీటి గురించి ఎక్కువ ఆలోచించరు. మీ మాటలూ చేతలతో అమ్మకి మానసిక స్థైర్యాన్నివ్వండి. చిన్నది కనుక చెల్లిని కూడా మీరే నడిపించాలి. లక్ష్య సాధనకు మీరెలాంటి ప్రయత్నాలు చేశారో చెబుతూ, దీన్నుంచి బయట పడాలంటే దృఢంగా ఉండాలని చెప్పండి. సలహాలూ సూచనలూ ఇస్తూ మీతోబాటు నడిపించండి. ఆమెనీ కొన్ని లక్ష్యాలు ఏర్పరచుకోమనండి. చదువు, ఉద్యోగ విషయాల్లో స్వతంత్రంగా ఉండేట్లు చూడండి. అప్పుడామె గాడి తప్పకుండా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని అనుసరిస్తుంది. డిప్రెషన్‌ నుంచి బయటపడి నిలదొక్కుకుంటుంది. ఒకవేళ మీరు చెల్లెలికి ధైర్యం చెప్పలేకపోతే, ఆమె ఇంకా ఆందోళనలోనే ఉంటే సైకియాట్రిస్టును సంప్రదించండి. మందులు, కౌన్సెలింగ్‌లతో మార్పొస్తుంది. అవసరమైతే అమ్మని కూడా మానసిక వైద్యునికి చూపండి. నాన్నను ఎటూ మార్చలేరు. అలాంటప్పుడు ఆ సంగతులే ఆలోచించి, విఫల ప్రయత్నాలు చేస్తూ నిరాశ చెందే బదులు మీ ముగ్గురూ ఏం చేయగలరో ఆలోచించండి. మీరూ, చెల్లెలూ స్థిరపడితే.. అమ్మకు ఆసరా అందించగలుగుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్