ఆఫీసులో అసభ్య వీడియోలు.. ఓ మహిళగా దీన్ని ఎలా పరిష్కరించాలి?

ఓ ఫార్మా సంస్థలో హెచ్‌ఆర్‌ అధికారిగా చేస్తున్నా. సంస్థలో కొన్ని పనులు ఇబ్బందికరంగా ఉన్నాయి. కొందరు మగవారు ఫోన్లలో ఒక్కోసారి ఆఫీసు సిస్టమ్‌లో కూడా అసభ్య వీడియోలు చూస్తున్నారు.

Updated : 16 Dec 2022 11:21 IST

ఓ ఫార్మా సంస్థలో హెచ్‌ఆర్‌ అధికారిగా చేస్తున్నా. సంస్థలో కొన్ని పనులు ఇబ్బందికరంగా ఉన్నాయి. కొందరు మగవారు ఫోన్లలో ఒక్కోసారి ఆఫీసు సిస్టమ్‌లో కూడా అసభ్య వీడియోలు చూస్తున్నారు. సహోద్యోగినులూ ఇబ్బంది పడుతున్నారు. ఓ మహిళగా ఈ సున్నిత సమస్యను పరిష్కరించేదెలా?

- ఓ సోదరి

పని ప్రదేశంలో ఇలాంటి చర్యలు కచ్చితంగా తప్పే! చాలావరకూ సంస్థలు వాటి నిబంధన నియమావళిలో వీటి గురించి ప్రస్తావిస్తాయి కూడా. ముందు సంస్థ పాలసీలో వీటి ప్రస్తావన ఉందో లేదో చెక్‌ చేయండి. కొన్నిసార్లు సంస్థలు తమ ఉద్యోగులకు విరామ సమయాల్లో వ్యక్తిగత విషయాలకు ఆఫీసు సిస్టమ్‌ను ఉపయోగించుకునే వీలు కల్పిస్తాయి. ఈమెయిల్స్‌, సోషల్‌ మీడియా అకౌంట్లు, వార్తల వెబ్‌సైట్లు వంటివి చూసుకోవచ్చు. అలాగని అశ్లీల వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకోమని వాళ్ల ఉద్దేశం కాదు. కాబట్టి, ఇది దుష్ప్రవర్తన కిందకే వస్తుంది. ఆఫీసు మెయిల్‌ను వ్యక్తిగత మెసేజ్‌లు, ఈ వీడియోలు పంపించడానికి ఉపయోగించడమూ నిబంధనలకు విరుద్ధమే. వాళ్ల చర్యలు మీ దృష్టికి వస్తున్నాయన్న విషయాన్ని అర్థమయ్యేలా చేయండి. ఆఫీసు మెయిల్‌, ఇంటర్నెట్‌, సిస్టమ్స్‌ అన్నీ సంస్థ పర్యవేక్షణలో ఉన్నాయనీ, వాళ్లు చేసే ప్రతి పనీ గోప్యమేమీ కాదని తెలిసేలా చేయండి. ఉద్యోగులూ దీనిపై అభ్యంతరం చెప్పలేరు. ఎందుకంటే వచ్చే, పంపే ఈమెయిల్స్‌, కస్టమర్ల స్పందన వంటివి తెలుసుకునే హక్కు సంస్థకు ఉంటుంది. ముందు అలాంటి చర్యలకు పాల్పడుతున్న వారెవరో కనిపెట్టండి. పిలిచి నేరుగా మాట్లాడండి. తిరిగి ఇలాంటివి జరగవన్న హామీ వాళ్ల నుంచి తీసుకోండి. అయితే తగిన ఆధారాలను సేకరించడం మాత్రం ప్రధానం. అలాగే అవతలి వాళ్ల వాదననీ తప్పక వినండి. సిస్టమ్‌ వాళ్లదైనంత మాత్రాన వాళ్లే చేశారనేం లేదు. ఇప్పుడెలాగూ సాంకేతికత బాగా అభివృద్ధి చెందుతోంది. ఇలాంటి వెబ్‌సైట్లు తెరవడానికీ వీలు లేకుండా ఫిల్టర్స్‌ పెట్టొచ్చు. అలాగే ఇలాంటి చర్యలకు పాల్పడితే తీసుకునే చర్యలనూ రూపొందించి అందరికీ తెలియజేస్తే.. వాటికి అడ్డుకట్ట వేయొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్