తెల్ల కాగితాల మీద సంతకాలు చేయించి..

నా వయసు 22. మా నాన్న మాకు తెలియకుండా మరో పెళ్లి చేసుకున్నాడు. అమ్మ అమాయకురాలు. తనకి మాయ మాటలు చెప్పి ఖాళీ కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నాడు. వాటిని ఆధారంగా చూపిస్తూ... ఆవిడ ఒప్పుకొన్నాకే పెళ్లి చేసుకున్నానంటూ దబాయిస్తున్నాడు. వాళ్లకి ఒక పాప.

Published : 25 Apr 2023 00:25 IST

నా వయసు 22. మా నాన్న మాకు తెలియకుండా మరో పెళ్లి చేసుకున్నాడు. అమ్మ అమాయకురాలు. తనకి మాయ మాటలు చెప్పి ఖాళీ కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నాడు. వాటిని ఆధారంగా చూపిస్తూ... ఆవిడ ఒప్పుకొన్నాకే పెళ్లి చేసుకున్నానంటూ దబాయిస్తున్నాడు. వాళ్లకి ఒక పాప. కొత్తగా కొంటున్న ఆస్తులను ఆ అమ్మాయి పేరు మీద పెడుతున్నాడు. మమ్మల్ని మోసం చేసినందుకు ఆయనమీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? 

ఓ సోదరి

మానవ సంబంధాలు అన్నాక నైతిక విలువలకు కట్టుబడి ఉండాలి. హిందూ వివాహ చట్ట ప్రకారం ఒక పెళ్లి జరిగి ఉంటే రెండో పెళ్లికి అర్హత లేదు. విడాకులు తీసుకున్నాక మాత్రమే రెండో పెళ్లి చేసుకోవాలి. మీ అమ్మగారి చేత కాగితాల మీద సంతకాలు చేయించుకున్నా అది రెండో పెళ్లికి అర్హత పత్రం కాదు. కాబట్టి అది చెల్లదు. ఆవిడ న్యాయపరంగా భార్య కాలేదు. కానీ సంతానానికి మాత్రం పూర్తి అర్హతలు ఉంటాయి. ఆస్తిలో భాగాలకు సంబంధించిన వరకూ అతని పిల్లలు గానే పరిగణిస్తారు. స్వార్జిత ఆస్తిని ఎవరి పేరు మీదైనా రాసుకోవచ్చు. మీ నాన్న మీకు అన్యాయం చేయడం సరికాదు. ఆ రెండో భార్య మొదటి పెళ్లి గురించి కప్పిపుచ్చి నన్ను పెళ్లి చేసుకున్నాడని కేసు పెట్టొచ్చు. కానీ ఇతని వల్ల లాభపడుతోంది.. కాబట్టి ఆవిడ అలా చేయదు. మీ అమ్మగారు కేసు పెట్టడం మూలంగా మిమ్మల్ని ఆయన పూర్తిగా దూరం చేసుకొని వాళ్లతోనే ఉండే ప్రయత్నం చేస్తారు. దానివల్ల మీ అమ్మగారికి మరింత అన్యాయం జరిగే అవకాశముంది. కాబట్టి  ముందుగా మధ్యవర్తుల ద్వారా సమస్యను పరిష్కరించుకోండి. మీ అమ్మగారికీ, మీకు సరైన విధంగా న్యాయం జరిగేలా ఆస్తి వ్యవహారాన్ని తేల్చమని చెప్పండి. ఒక వేళ ఒప్పుకోకపోతే గృహ హింస చట్టం కింద కేసువేసి సెక్షన్‌ 19 కింద రెసిడెన్స్‌ ఆర్డర్స్‌, సెక్షన్‌ 20 కింద ఆర్థికసహాయం, సెక్షన్‌ 22 కింద నష్టపరిహారం అడగొచ్చు. ముందుగా సమస్యను పెద్దవాళ్ల ద్వారా, కౌన్సెలింగ్‌ ద్వారా పరిష్కారానికి ప్రయత్నించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్