సమానంగా చూడాలంటే...

ఆర్థిక సమస్యల కారణంగా రెండో భార్యగా వెళ్లాను. ఆయనకు పదేళ్ల కొడుకున్నాడు. మాకో పాప. తనతో సమానంగా బాబును చూడలేకపోతున్నాను. అబ్బాయి తండ్రిని వదిలి ఉండడు.

Published : 15 May 2023 00:38 IST

ఆర్థిక సమస్యల కారణంగా రెండో భార్యగా వెళ్లాను. ఆయనకు పదేళ్ల కొడుకున్నాడు. మాకో పాప. తనతో సమానంగా బాబును చూడలేకపోతున్నాను. అబ్బాయి తండ్రిని వదిలి ఉండడు. వాళ్ల అమ్మమ్మ, మావయ్యలు వచ్చేయమన్నా వెళ్లడు. నేను చేస్తున్నది తప్పని తెలిసినా మారలేకపోతున్నా.

  - ఓ సోదరి

ఇందులో రెండు అంశాలున్నాయి. అతను రెండో పెళ్లి చేసుకున్నాడంటే.. పిల్లవాడికి తల్లి లేని లోటు ఉండొద్దు, మెరుగైన జీవితం ఇవ్వాలనే ఉద్దేశమే. బాబుది సున్నితమైన మనస్తత్వం అని అర్థమవుతోంది. తండ్రి పట్ల మమకారంతో తల్లివైపు బంధువులు పిలిచినా వెళ్లడంలేదు. చిన్నవాడు కనుక అతడికి ఆలంబన కావాలి. మీరు ఆర్థిక అవసరాలతో పెళ్లి చేసుకున్నప్పటికీ అతనికి భార్యగానే కాదు.. బాబుకి తల్లిగానూ న్యాయం చేయాలి. పిల్లాడి సంగతి తెలిసే పెళ్లికి సిద్ధమయ్యారు కదా! ఇక్కడే ఉంటాను- అంటున్నాడంటే తండ్రంటే బాబుకి ఎంత ఆపేక్ష ఉందో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పిల్లాడు నిస్సహాయుడు కనుక మీరు లక్ష్యపెట్టడంలేదు. కానీ ఈరోజే శాశ్వతం కాదు. రేపటి గురించీ ఆలోచించండి. మీరు ఇప్పుడు తల్లిలా ఆదరిస్తే రేపు అతనూ మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటాడు. మీరు పిల్లాడిని ప్రేమగా చూసుకుంటే బాబుకి తల్లి లేని లోటు తీరడమే కాకుండా మీవారికి మీపట్ల మరింత ఇష్టం కలుగుతుంది. కూతురు మాత్రమే అనే స్వార్థం వద్దు. ఆమె పెళ్లై వెళ్లాక ఒంటరితనం రాకూడదంటే కొడుకునూ సమానంగా ఆదరించండి. అతడికి ఆ కృతజ్ఞతాభావం ఉంటుంది. ఆర్థిక అవసరం కోసం పెళ్లి చేసుకున్నట్టే పిల్లాడు రేపు ఉపయోగ పడతాడని ముందుచూపుతో ఆలోచించండి. బంధుమిత్రులు, సహోద్యోగులు, ఇరుగు పొరుగింటి వారికే ఎంతో సాయం చేస్తాం.. మీ అబ్బాయిని ఆదరించలేరా? ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుందని గుర్తుంచుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్