అతడి ఆస్తి రాయించుకుని... నాపై కేసులు పెడుతోంది!

నేనొక ప్రభుత్వ ఉద్యోగిని. ప్రేమించి పెళ్లి చేసుకున్నా. మాకో పాప. అప్పటికే తనకి పెళ్లయి ఇద్దరు కూతుళ్లు ఉన్నారన్న విషయం తెలియదు. అతని మొదటి భార్య పెద్ద మనుషుల్లో పంచాయితీ పెడితే ఆవేశంలో అతడితో ఏ సంబంధం లేదంటూ రాసిచ్చి వచ్చేశా. కానీ, కొన్నాళ్లకే నువ్వే కావాలంటూ మళ్లీ అతడు రావడం, పాప తండ్రిని వదులుకోలేకపోవడంతో ఆ బంధాన్ని కొనసాగించా.

Published : 16 May 2023 00:37 IST

నేనొక ప్రభుత్వ ఉద్యోగిని. ప్రేమించి పెళ్లి చేసుకున్నా. మాకో పాప. అప్పటికే తనకి పెళ్లయి ఇద్దరు కూతుళ్లు ఉన్నారన్న విషయం తెలియదు. అతని మొదటి భార్య పెద్ద మనుషుల్లో పంచాయితీ పెడితే ఆవేశంలో అతడితో ఏ సంబంధం లేదంటూ రాసిచ్చి వచ్చేశా. కానీ, కొన్నాళ్లకే నువ్వే కావాలంటూ మళ్లీ అతడు రావడం, పాప తండ్రిని వదులుకోలేకపోవడంతో ఆ బంధాన్ని కొనసాగించా. ఇప్పుడు ఆ కాగితాల్ని చూపిస్తూ ఇంటికీ, ఆఫీసుకీ వచ్చి గొడవచేస్తోంది. ఇప్పటికే అతడి ఆస్తులన్నీ తను రాయించుకుంది. పైగా నా మీదే పోలీస్‌ కేసు పెట్టింది. ప్రస్తుతం బెయిల్‌ మీద ఉన్నా. నాకు శిక్ష పడితే ఉద్యోగాన్నీ కోల్పోతానేమో అనిపిస్తోంది. నిత్యం నా ఆనుపానులు తెలుసుకుంటూ, పాప స్కూలుకి వెళ్లినా వెంబడిస్తున్నారు. ఇవన్నీ చూసి ఆత్మహత్య చేసుకుందామనుకున్నా. మనమేమీ తప్పు చేయలేదని నా కూతురు చెప్పిన ధైర్యంతో పోరాడాలనుకుంటు న్నా. చట్టం నాకేవిధంగా సాయం చేస్తుంది.

- ఓ సోదరి

మీ లేఖ చదువుతుంటే... దారుణంగా వంచనకు గురయ్యారనిపిస్తోంది. మొదటిపెళ్లి దాచిపెట్టి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం, ఇద్దరితోనూ సంసారం చేయాలనుకోవడం రెండూ నేరాలే. ఈ తప్పులు చేసిన వ్యక్తిని వదిలిపెట్టి అతడి మొదటి భార్య మిమ్మల్ని సాధించాలనుకోవడంలో తన అక్కసు కనిపిస్తోంది. అతడు మీ దగ్గరికి వచ్చినంత కాలం ఈ గొడవలు కొనసాగుతూనే ఉంటాయి. ముందు ఇద్దరిలో ఎవరితో బంధాన్ని కొనసాగించాలనుకుంటున్నాడో తెలుసుకోండి. హిందూ వివాహ చట్టం సెక్షన్‌ 12 ప్రకారం.. మీకు మీ వివాహాన్ని రద్దు చేసుకునే హక్కు ఉంది.

అయితే, ఇందుకు దరఖాస్తు చేసుకోవడానికి ముందే... మొదటి భార్య మీ మీద పెట్టిన కేసులు విత్‌డ్రా చేసుకునేలా మధ్యవర్తుల సాయంతో ఒప్పందం చేసుకోండి. పాప భవిష్యత్తు, సంరక్షణకోసం మీ వారి ఆస్తిలో వాటా అడగండి. నిజానికి అతడి తత్వం తెలిసిన మీరు ముందే జాగ్రత్త పడాల్సింది. ఆస్తులన్నీ ఆవిడ రాయించుకుని మీ మీద కేసులు వేసే వరకూ వేచి చూడటం పొరపాటు. ఇది సర్దుబాటు కాకపోయినా, ఇబ్బందులు ఇలానే కొనసాగుతున్నా... మీ తల్లీ కూతుళ్ల రక్షణ కోసం మీ భర్త, అతడి మొదటి భార్య మీద గృహహింస చట్టం కింద కేసు వేయండి. అలానే మీ భద్రతకోసం పోలీస్‌స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేయండి. ఇందులో మీకు అనుమానమున్న వారందరి పేర్లూ చేర్చండి. రాష్ట్ర మహిళా కమిషన్‌, మానవహక్కుల కమిషన్లకు ఫిర్యాదు చేయొచ్చు. ముందు దీనంతటికీ బాధ్యుడైన మీ భర్త మీద చీటింగ్‌, గృహహింస, వేధింపుల కేసులు వేయండి. ఆత్మహత్య ఆలోచనలు మాని ఏ నిర్ణయమైనా త్వరగా తీసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్