కొనసాగాలా.. మారాలా?

ఇంజినీరింగ్‌ చదివి వేరే రంగంలో ఉద్యోగం చేస్తున్నా. సాఫ్ట్‌వేర్‌లోకి వచ్చెయ్‌.. భవిష్యత్తు బాగుంటుందంటున్నారు స్నేహితులు. జీతం తక్కువైనా ఇప్పుడు చేస్తున్న రంగం నాకు చాలా నచ్చింది. సంపాదన బాగుంటుందని ప్రయత్నిద్దామంటే సాఫ్ట్‌వేర్‌లో అనుభవం, ఆసక్తి రెండూ లేవు.

Published : 31 May 2023 00:48 IST

ఇంజినీరింగ్‌ చదివి వేరే రంగంలో ఉద్యోగం చేస్తున్నా. సాఫ్ట్‌వేర్‌లోకి వచ్చెయ్‌.. భవిష్యత్తు బాగుంటుందంటున్నారు స్నేహితులు. జీతం తక్కువైనా ఇప్పుడు చేస్తున్న రంగం నాకు చాలా నచ్చింది. సంపాదన బాగుంటుందని ప్రయత్నిద్దామంటే సాఫ్ట్‌వేర్‌లో అనుభవం, ఆసక్తి రెండూ లేవు. వాళ్లేమో మేమున్నాం కదా.. పర్లేదు అంటున్నారు. నచ్చిన దానిలో కొనసాగనా? మారనా?

- రమాదేవి, గుంటూరు

కెరియర్‌ కాలవ్యవధి 35-40 ఏళ్లు అనుకుంటే.. దానిలో ఎన్నో ఉద్యోగాలుండొచ్చు. ఇంత కాలమంటే.. చేసే పని నచ్చడంతోపాటు ప్రావీణ్యమూ కావాలి. కొన్ని దశాబ్దాలు సాగే కెరియర్‌లో నిలదొక్కుకోవాలన్నా ఈ రెండూ తప్పనిసరే. ఏది ఎంచుకోవాలి అని నిర్ణయించుకునే ముందు మీ దృష్టిలో విజయం, ఆనందం, ఉద్యోగ సంతృప్తి అంటే ఏమిటి? వీటి సమాధానాలు ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటాయి.

లోన్‌ ఈఎంఐలు, పిల్లల బాధ్యతలు లేవనుకోండి. మంచి జీతం వచ్చే ఉద్యోగం కోసం ఎక్కువ గంటలు కష్టపడగలుగుతారు. అదే పెళ్లి అయ్యి, పిల్లలూ కలిగితే ఖర్చులకు తగ్గ సంపాదనే కాదు.. కుటుంబంతో సమయమూ కావాలనిపిస్తుంది.

జీవితకాలంలో మూడోవంతు మనం గడిపేది ఆఫీసులోనే. కాబట్టి, అక్కడి వాతావరణం ఆనందంగా ఉండాలనుకోవడం సహజమే! మంచం మీద నుంచి లేవడానికీ ఓపిక లేనంత పని ఒత్తిడి ఉంటే కెరియర్‌లో మాత్రం ముందుకు ఎలా కొనసాగగలుగుతాం?

ఇక్కడ వయసునీ పరిగణనలోకి తీసుకోవాలి. చిన్నవయసైతే తక్కువ జీతమైనా ఎక్కువ గంటల పని పర్లేదనిపిస్తుంది. ఇప్పుడు కష్టపడితే భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయన్న భావనే కారణం. అదే.. వయసు, ఖర్చులు పెరిగే కొద్దీ ఈ ఆలోచనా మారుతుంది.
పనిచేసే ప్రదేశం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటే ఏ పనైనా సులువనిపిస్తుంది. భావోద్వేగపరంగా కష్టంగా ఉండి, ఎంత సంపాదించినా అది ఆనందాన్నివ్వదు. పైగా డబ్బుతో సౌకర్యాలు దొరకొచ్చు.. ఆనందం కాదు. కాబట్టి, ఈ అంశాలన్నీ గమనించుకొని మీకు తగినదేదో నిర్ణయించుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని