చీర చుట్టే చోట.. ఏమిటలా?
రోజూ చీరకట్టడం అలవాటు. చీర చుట్టే చోట నడుము దగ్గర చర్మం తెగి, నల్లగా మారుతోంది. అలా అవ్వకూడదంటే ఏం చేయాలి?
రోజూ చీరకట్టడం అలవాటు. చీర చుట్టే చోట నడుము దగ్గర చర్మం తెగి, నల్లగా మారుతోంది. అలా అవ్వకూడదంటే ఏం చేయాలి?
- ఓ సోదరి
చీర చుట్టడం వల్ల ఇలా అవుతోంది.. మామూలే అనుకుంటారు చాలామంది. దీన్ని వెయిస్ట్ డెర్మటైటిస్ అని అంటాం. చీర, పెట్టీకోట్ గట్టిగా కట్టడం వల్ల ఎర్రబడి, దురద వస్తుంది. ఆపై నల్లగా మచ్చలా ఏర్పడుతుంది. కొందరిలో నొప్పీ ఉంటుంది. ఎక్కువమందిలో డార్క్ పిగ్మెంటేషన్‌లా మారితే మిగతావారిలో పొట్టులా ఊడటం లాంటివి కనిపిస్తాయి. ఆపై తెల్లగా మచ్చగానూ ఏర్పడుతుంది. దీన్ని సహజమే అని కొట్టిపారేయొద్దు. కొందరిలో పుండులానూ పడుతుంది. బిగుతుగా లాగి కట్టడం వల్ల నడుము వద్ద గుంటలా పడి, శరీరాకృతిలోనూ మార్పు వస్తుంది. చెమట కారణంగానూ అలర్జీ ఏర్పడొచ్చు. ఒక్కోసారి అది పక్క ప్రదేశానికి విస్తరించడం, ఇన్‌ఫ్లమేటరీ డిజార్డర్లకి కారణమవుతుంది. నిర్లక్ష్యం చేసుకుంటూ వస్తే కొన్నిసార్లు క్యాన్సర్‌గానూ మారే ప్రమాదముంది. ఒబెసిటీ, మధుమేహం, ఎపోటిక్ డెర్మటైటిస్ ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్లలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు, పుండ్లు త్వరగా తగ్గవు కూడా. కాబట్టి, మిగతా వస్త్ర రకాలతో పోలిస్తే కాటన్ పెట్టీకోట్లకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి. అలాగే తాడు రకాలు కాకుండా బెల్ట్ ఉన్నవి ఎంచుకుంటే సమస్య తగ్గుతుంది. తరచూ మాయిశ్చరైజర్ రాస్తుండాలి. పుండ్లలా కనిపిస్తోంటే ఆయింట్‌మెంట్‌నీ వాడాలి. అయినా తగ్గకపోతే వైద్యులను సంప్రదించి ఓరల్ యాంటీ బయాటిక్స్‌ని తీసుకోండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.