అతనికి ఆ అలవాట్లున్నాయి

సహోద్యోగిని రెండేళ్లుగా ప్రేమిస్తున్నాను. త్వరలో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం. అతనికి తాగుడు, సిగరెట్ల అలవాటుంది.

Published : 05 Jun 2023 00:09 IST

సహోద్యోగిని రెండేళ్లుగా ప్రేమిస్తున్నాను. త్వరలో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం. అతనికి తాగుడు, సిగరెట్ల అలవాటుంది. ఇవేమీ నా దగ్గర దాచలేదు. పెళ్లయ్యాకా ఇలాగే ఉంటానంటున్నాడు. ఆరోగ్యం అంటే అంత నిర్లక్ష్యంగా ఉన్నవాడిని చేసుకుని ఇబ్బందిపడతానేమో అనిపిస్తోంది. మిగతా విషయాల్లో పేచీ లేదు. ఎటూ తేల్చుకోలేకపోతున్నాను.

- ఓ సోదరి

భార్యాభర్తలు లేదా ప్రేమికులు ఒకరి ఆలోచనను రెండోవారు గౌరవించాలి. ఎందులోనైనా ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చేట్లుండాలి. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఇద్దరూ కృషి చేయాలి. మీ విషయంలో అతను తన దురలవాట్ల గురించి దాచకపోయినప్పటికీ అవి క్రానిక్‌ సైకలాజికల్‌ డిసీజెస్‌ కిందికి వస్తాయి. చాలాకాలం ఆ అలవాట్లు మానకపోతే శారీరక, మానసిక వ్యాధులకు దారితీస్తాయి. కనుక పెళ్లికి ముందే వాటివల్ల వచ్చే పర్యవసానాలను చెప్పి మారమనండి, అతని వల్ల కాకపోతే సైకియాట్రిస్టును కలిస్తే ఫలితం ఉంటుంది. అవి అనారోగ్యం కలిగించడమే కాదు, జీవితకాలాన్నీ తగ్గిస్తాయి. ఆ వ్యసనాలవల్ల బాధ్యతారాహిత్యం పెరుగుతుంది, డబ్బు చాలా ఖర్చవుతుంది,  హింసించే అవకాశమూ ఉంది. అతని ప్రవర్తనతో నలుగురిలో ఇబ్బందిగా ఉంటుంది. వాటితో ఆరోగ్యం పాడైతే చికిత్సకూ డబ్బు వెచ్చించాలి. ఇన్ని సమస్యలున్నాగానీ పెళ్లయ్యాక వదిలేయాలంటే అపరాధభావన వేధిస్తుంది. వదిలేస్తే చనిపోతామంటారు కూడా. వదల్లేక, కలిసుండలేక నానా యాతనా పడాల్సి ఉంటుంది. బాగున్నాడు, మంచివాడు, ఉద్యోగం బాగుంది, ఇష్టపడుతున్నాడు అని చేసుకుంటే ఇన్ని అనర్థాలుంటాయి. అందుకని ముందే ఆలోచించుకోండి. అంత్య నిష్టూరం కంటే ఆదినిష్టూరం మేలు. మారకపోతే కష్టం, స్నేహితులుగా విడిపోదామని తేల్చిచెప్పండి. లేదూ అతనంటే చాలా ఇష్టం, ఆరోగ్య, ఆర్థిక, సామాజిక సమస్యలెదురైనా అతను కావాలి అనుకుంటే అన్నిటికీ సిద్ధమై చేసుకోండి. ‘ముందే చెప్పాను, నేనిలాగే ఉంటాను, నువ్వు భరించాలి’- తరహాలో మాట్లాడితే మీ భవిష్యత్తు ప్రమాదంలో పడకుండా గట్టిగా ఉండండి. ప్రేమ ఒక్కటే కాదు, ముందున్న జీవితం చాలా ముఖ్యమని, సంతోషకర జీవనానికి వ్యసనాలు అడ్డంకి అని అర్థం చేసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని