అబార్షన్‌ చేయించుకోకపోతే విడాకులిమ్మంటున్నారు

నాకు పెళ్తై నాలుగు నెలలు. ఇప్పుడు మూడు నెలల గర్భవతిని. అత్తమామలు అబార్షన్‌ చేయించుకో లేకపోతే విడాకులు ఇవ్వు అని నన్ను పుట్టింటికి పంపేశారు. నాకు నా బిడ్డ, భర్త కావాలి. విడాకులు ఇష్టంలేదు.

Published : 13 Jun 2023 04:55 IST

నాకు పెళ్తై నాలుగు నెలలు. ఇప్పుడు మూడు నెలల గర్భవతిని. అత్తమామలు అబార్షన్‌ చేయించుకో లేకపోతే విడాకులు ఇవ్వు అని నన్ను పుట్టింటికి పంపేశారు. నాకు నా బిడ్డ, భర్త కావాలి. విడాకులు ఇష్టంలేదు. నా మీద లేని పోని ఆరోపణలు చేస్తూ, విడాకుల నోటీసు పంపించారు. విడాకులే కావాలని బలవంతం చేస్తే నాకు ఏం హక్కులు ఉన్నాయి?

 ఒక సోదరి

మీ అత్తగారు వాళ్లు ఎందుకు అబార్షన్‌ చేయించుకోమంటున్నారు? మీకు స్కానింగ్‌ ఏమైనా చేయించారా. ఆడపిల్ల అని అబార్షన్‌ చేయించుకోమనడం నేరం. గర్భస్థ శిశువు ఆరోగ్య పరీక్షల (నియంత్రణ, దుర్వినియోగం నివారణ) చట్టం 2002  (పీఎన్‌డీటీ) ప్రకారం గర్భంలో ఉన్నది ఆడా, మగా అని నిర్ధారణ, వెల్లడించడం నేరం. ఈ పరీక్షలు కేవలం ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలు మాత్రమే చేయాలి. అదీ శిశువు ఆరోగ్య పరిస్థితి, తల్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి మాత్రమే చేయాలి. పరీక్షకు ముందు గర్భవతి అంగీకారం రాతపూర్వకంగా తీసుకోవాలి. గర్భంలో ఉన్న శిశువు ఆడ, మగ అనేది మాటల ద్వారాగాని, సైగల ద్వారాగాని, రాత ద్వారా గాని బహిర్గతం చేయకూడదు. అలా చేస్తే నేరం. అలా చేసిన వైద్యులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తారు. రెండోసారి అదే తప్పు చేస్తే ఐదు సంవత్సరాల జైలుశిక్ష, రూ.50 వేల జరిమానా కూడా విధిస్తారు. వారి గుర్తింపు కూడా రద్దు చేస్తారు. మీ విషయంలో ఏం జరిగిందో తెలియదు. దగ్గరలోని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చి ఉండాల్సింది. పెళ్లి అయిన సంవత్సరంలోపల విడాకులకు దరఖాస్తు చేసుకోవడానికి లేదు. అలా చేసినా, కనీసం కేసు నంబరు కూడా అవ్వదు. కేవలం లాయర్‌ నోటీసుల్ని పంపి ఉంటే మీకు అవకాశం ఉంటే సమాధానం ఇప్పించండి. గృహహింస చట్టం కింద కేసు ఫైల్‌ చెయ్యండి. ఆ చట్టంలో విడాకుల ప్రసక్తిలేదు కాబట్టి ముందుగా మధ్యవర్తి దగ్గర కూర్చోబెట్టండి. మీ సమస్య మధ్యవర్తికి వివరించి సయోధ్య చేసుకోడానికి ప్రయత్నించండి. ఒకవేళ బిడ్డ ఆరోగ్యపరిస్థితి బాగాలేకుంటే వైద్యులే చెబుతారు అబార్షన్‌ చేయించుకోమని. మీ అత్తగారు వాళ్లు బలవంతం పెట్టడం గృహహింస కిందకే వస్తుంది. అతను విడాకులు వరకు వెళ్లితే మీ మీద పెట్టిన ఆరోపణలు నిజాలు కాదని నిరూపించుకోండి. మీ గర్భాన్ని కాపాడుకోవడానికి మీకు సంపూర్ణ హక్కులు ఉన్నాయి.  ధైర్యంగా ముందుకు వెళ్లండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని