మాంసాహారం మాననంటోంది!
మా అమ్మ వయసు 52. బీపీ, షుగర్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కిడ్నీలకు ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇది మరింత పెరిగితే డయాలసిస్‌కి వెళ్లాల్సి వస్తుందని చెప్పారు.
మా అమ్మ వయసు 52. బీపీ, షుగర్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కిడ్నీలకు ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇది మరింత పెరిగితే డయాలసిస్‌కి వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. తను ఆహార నియంత్రణ పాటించడం లేదు. ముఖ్యంగా మాంసాహారం తీసుకోకుండా ఉండలేకపోతోంది. ఈ సమయంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి. ఏవి తీసుకోకూడదు?
- ఓ సోదరి
హైపర్ టెన్షన్, డయాబెటిస్ ఉన్న వ్యక్తుల్లో కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు రక్తంలో చక్కెర శాతం నియంత్రణలో ఉందా? క్రియాటిన్ స్థాయిలు ఎలా ఉన్నాయి? ఎలక్ట్రోలైట్స్ అవసరం ఎంత? మూత్రం సరిగా వస్తుందా? ఎత్తుకి తగిన బరువున్నారా.. వంటివన్నీ పరిగణనలోకి తీసుకుని... ఆహార ప్రణాళికను నిర్ణయించాల్సి ఉంటుంది. అందుకే ఆయా వ్యక్తుల ఆరోగ్య పరిస్థితులను బట్టి మాంసకృత్తులు, కొవ్వు, ఉప్పు, నీళ్లు...ఇలా శరీరానికి కావలసిన ప్రతీదీ లెక్కేసి పోషకాహార నిపుణులు చెబుతారు. అయితే, కిడ్నీ ఇన్‌ఫెక్షన్ వచ్చినంత మాత్రాన మాంసాహారం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. ఎంత మోతాదులో తింటున్నారు? ఎలా వండుతున్నారు అనేదాని మీద ఆధారపడి దాన్ని తినాలా వద్దా అన్నది పరిగణిస్తారు. ఉడకబెట్టిన గుడ్డు, తాజా చేపలు, చికెన్ వంటివి 100 గ్రాముల వరకూ తీసుకోవచ్చు. ఎక్కువ గ్రేవీ లేకుండా, తక్కువ నూనె, మసాలాలు, ఉప్పుతో తయారు చేయాలి. సోయా నగ్గెట్స్, పాలతో చేసిన పనీర్...వంటి వాటినీ ఇలా చేసుకుని తినొచ్చు. మాంసాన్ని కూరగాయలతో కలిపి వండితే మరీ మంచిది. సాధారణంగా మాంసాహారం నుంచి అందే ప్రొటీన్ కాకుండా మొక్కల నుంచి లభించినది శరీరానికి అందితే మేలు. ఇందుకోసం రోజూ 100 గ్రా. కూరగాయల్ని సలాడ్ రూపంలో, 200 గ్రాముల్ని కూరల్లా తీసుకోవాలి. ఉప్పు చేపలూ, చైనీస్ ఫుడ్స్, అప్పడాలు, పచ్చళ్లూ, కారప్పొడులు వంటివి తగ్గించేయాలి. సమయానికి తినడం అలవాటు చేసుకోవాలి. అలాగని ఒకేసారి పెద్ద మొత్తంలో తినేయకుండా కొద్దికొద్దిగా ఎక్కువ సార్లు తినాలి. రోజూ కనీసం 150 గ్రా. ఎక్కువ పీచు, తక్కువ చక్కెర్లు ఉండే...అల్ల నేరేడు, అంజీర, దానిమ్మ, బత్తాయి, జామ, బొప్పాయి వంటివి తీసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.