నూనె తాగాలా.. నువ్వులు తినాలా?

మా పాప రజస్వల అయ్యింది. కొందరు బెల్లం తినిపించాలనీ, మరికొందరు నూనె తాగించాలనీ...ఇంకొందరు నువ్వులు పెట్టాలనీ చెబుతున్నారు. వీటికి తోడు తినకూడనివి అంటూ పెద్ద జాబితానే ఇచ్చారు. ఇవన్నీ చూసి పాప భయపడిపోతోంది.

Updated : 22 Jun 2023 02:56 IST

మా పాప రజస్వల అయ్యింది. కొందరు బెల్లం తినిపించాలనీ, మరికొందరు నూనె తాగించాలనీ...ఇంకొందరు నువ్వులు పెట్టాలనీ చెబుతున్నారు. వీటికి తోడు తినకూడనివి అంటూ పెద్ద జాబితానే ఇచ్చారు. ఇవన్నీ చూసి పాప భయపడిపోతోంది. అసలు తనేం తీసుకోవాలో చెప్పగలరు.

- శ్రీలత, హైదరాబాద్‌

పూర్వం ఆడపిల్ల రజస్వల అయినప్పుడు... బెల్లం, నువ్వులతో చేసిన పదార్థాలు తినిపించేవారు. నువ్వుల నూనె తాగించేవారు. వేడి పుట్టించే ఆహారాన్ని పెట్టడం, చలువ చేసే వాటిని దూరంగా ఉంచడం చేసేవారు.  ఈ విషయాన్ని శాస్త్రీయ దృక్పథంలో చూస్తే అప్పట్లో అమ్మాయిలు ఎక్కువ శారీరక శ్రమ చేసేవారు. తగినన్ని పోషకాలున్న ఆహారం తీసుకునే పరిస్థితులు అందరికీ ఉండేవి కావు. అందుకే, ఈ సమయంలో ఎక్కువ శక్తి, హార్మోన్ల తయారీకి అవసరమయ్యే కొవ్వులు, రక్తహీనత నివారణకు కావాల్సిన ఇనుము వంటి పోషకాలు అందించడానికి ఇవన్నీ ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి చూస్తే... సమతులహారం తీసుకోగలుగుతున్నారు. మోతాదులోనూ ఎక్కువగానే తింటున్నారు. కాబట్టి...అందరికీ వీటి అవసరం ఉండకపోవచ్చు. బలహీనంగా ఉన్నవారు విటమిన్‌ డి, ఇ, క్యాల్షియం, ఒమేగా2 కొవ్వులు పుష్కలంగా లభించే అవిసె, నువ్వులు, పొద్దుతిరుగుడు, గుమ్మడి వంటి గింజలూ లేదా నూనెల్ని 20 గ్రా. మించకుండా తీసుకోవచ్చు. అయితే, ఏం తిన్నా మోతాదు మించకూడదనే విషయం మరిచిపోవద్దు. ఏదైనాసరే బలవంతంగా తినిపించాలనుకోవడం సరికాదు. అలానే, తినొచ్చు కదా అని చలిమిడి, వేరుసెనగ, నువ్వుల ఉండలు.. వంటివాటిని అతిగా తింటే అజీర్తి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నిజానికి రుతుక్రమం మొదలవడంతోనే పోషకాల అవసరం పెరుగుతుంది. ముఖ్యంగా ప్రతినెలా జరిగే రక్తస్రావంతో ఇనుము కొరత ఏర్పడే అవకాశం ఉంది. దీనికి తోడు హార్మోన్ల ప్రభావంతో కడుపు నొప్పి, ఇతరత్రా చికాకులూ ఎదురుకావొచ్చు. వీటిని అధిగమించడానికి సమతులాహారాన్ని తీసుకోవాలి. ఆకుకూరలూ, పొట్టుతో ఉన్న సెనగలు, మాంసాహారం, గుడ్డు, నువ్వులు, బెల్లం, వేరుసెనగతో చేసిన పదార్థాలు ఈ సమస్యను నివారిస్తాయి. వీలైనంతవరకూ ఈ సమయంలో తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని తినడం మేలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని