అరగడం లేదా.. ఆహారం సరిపోవడం లేదా?
వయసు 35. నేనో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని. ఎత్తు 5.3. బరువు 70కేజీలు. శాకాహారిని. ఉదయం ఎనిమిదికి టిఫిన్ చేస్తే మిగిలిన రెండు పూటలూ అన్నం కూరలు తినడమే నా డైట్. మధ్యలో మంచినీళ్లు తాగడం మినహా పెద్దగా ఏమీ తినను.
వయసు 35. నేనో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని. ఎత్తు 5.3. బరువు 70కేజీలు. శాకాహారిని. ఉదయం ఎనిమిదికి టిఫిన్ చేస్తే మిగిలిన రెండు పూటలూ అన్నం కూరలు తినడమే నా డైట్. మధ్యలో మంచినీళ్లు తాగడం మినహా పెద్దగా ఏమీ తినను. అయితే, ఎక్కువ సమయం కూర్చోవడం వల్లో, మరే ఇతర కారణాలతోనో గ్యాస్ బాగా పట్టేస్తోంది. అరగట్లేదో, ఆహారం సరిపోవట్లేదో తెలియడం లేదు.
- రమాదేవి, హైదరాబాద్
గ్యాస్, త్రేన్పులు రకరకాల కారణాల వల్ల రావొచ్చు. జీర్ణాశయం సరిగ్గా పనిచేయడానికి కొంత శారీరక శ్రమ అవసరం. మీరు చెప్పిన దాని ప్రకారం మీ జీవనశైలి అందుకు దూరంగా ఉన్నట్లు అనిపిస్తోంది. తీసుకునే ఆహారం ఆరోగ్యకరమైనదే అయినా అది అరుగుతుందో లేదో చూసుకోవడమూ ముఖ్యమే. వీటన్నిటిని పరిగణనలోకి తీసుకుని మీరు డైట్ ప్రణాళిక వేసుకోవాలి. మీ ఎత్తుకు దాదాపు 10 కేజీల బరువు ఎక్కువగా ఉన్నారు. తగ్గడానికి ప్రయత్నించండి. నడుము కొలత 80 సెం.మీ మాత్రమే ఉండాలి. అనవసర కొవ్వు పేరుకుపోతే దాన్నీ తగ్గించుకోవాలి. రోజులో 45 నిమిషాలు నడక, వ్యాయామం ఉండేలా చూసుకోండి. అంత సమయం లేకపోతే తిన్నాక కనీసం 10 నిమిషాలు నడవండి. దీనివల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. మీ డైట్‌లో రెండు పూటలా అన్నం తింటున్నట్లు ఉంది. దాని పరిమాణం తగ్గించాలి. అన్నంలో ఉండే కార్బొహైడ్రేట్స్ లివర్ దగ్గర కొవ్వు శాతాన్ని పెంచి, అజీర్తికి కారణమవుతాయి. ఒకపూట తృణధాన్యాలను మీ డైట్‌లో చేర్చుకోండి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే రాగులు, జొన్నలు లాంటివి తింటే జీర్ణప్రక్రియ సాఫీగా సాగిపోతుంది. రాత్రిపూట పుల్కా లేదా చపాతి తీసుకోండి. మీ టిఫిన్, లంచ్, డిన్నర్‌కు మధ్య చాలా సమయ వ్యత్యాసం కనిపిస్తోంది. దాన్నీ తగ్గించుకోండి. నిద్రపోడానికి కనీసం రెండు మూడు గంటల ముందు భోజనం చేయడానికి ప్రయత్నించండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.