ఎక్కువ ప్రాజెక్టులు నావే..అయినా!

కాలేజ్‌లో నేనే టాపర్‌. ఓ అబ్బాయితో నాకు అన్ని అంశాల్లో పోటీ ఉండేది. చివరకి ఒకే సంస్థలో ఉద్యోగంలో చేరాం. ఇక్కడా అదే పోటీ.

Updated : 12 Jul 2023 00:54 IST

కాలేజ్‌లో నేనే టాపర్‌. ఓ అబ్బాయితో నాకు అన్ని అంశాల్లో పోటీ ఉండేది. చివరకి ఒకే సంస్థలో ఉద్యోగంలో చేరాం. ఇక్కడా అదే పోటీ. మొదటి హైక్‌ కోసం ఎంతో ఆనందంగా ఎదురుచూస్తే.. అతని కంటే నాకు తగ్గింది. అదేమని బాస్‌ని అడిగితే ‘అతను అబ్బాయి కదా’ అన్నారు. పనిలో తేడా లేదు. ఎక్కువ ప్రాజెక్టులు పూర్తి చేసిందీ నేనే.. జీతం పెరుగుదలలో మాత్రం ఎందుకు తేడా? ఎవరిని అడగాలి?

- ఆఫ్రిన్‌, హైదరాబాద్‌

తొలి ఉద్యోగంలోనే లింగవివక్ష ఎదుర్కోవడం బాధాకరం. కానీ ఇది ఎక్కడైనా, ఎవరికైనా సాధారణమే! ఆశ్చర్యంగా ఉంది కదూ.. మీ ఆఫీసులోని సగానికిపైగా ఆడవాళ్లు ఏదో రూపంలో ఈ వివక్ష ఎదుర్కొనే ఉంటారు. జీతమొక్కటే కాదు.. ‘ప్రాజెక్టు గురించి మాట్లాడాలి.. డిన్నర్‌ చేస్తూ చర్చిద్దామా?’ అనే బాస్‌ ఇంటర్వ్యూలో అర్హతల మీద కాకుండా ‘పిల్లలు పుడితే ఎలా’ వంటి ప్రశ్నలు ‘ఒకే అర్హతలున్నా మగవారు లీడ్‌గా ఉంటే నయం. నువ్వు మీటింగ్‌కి కావాల్సిన టీ, స్నాక్స్‌ విషయాలు చూసుకోగలవా?’ లాంటి బాధ్యతలు ఉన్నత హోదాలు, శిక్షణ కార్యక్రమాలకు సిఫారసు చేయకపోవడం.. వంటివన్నీ వివిధ దశల్లో వివక్షకు ప్రతి రూపాలే! అలాగని ఊరుకోనక్కర్లేదు. ముందు మీ విషయంలో ఎక్కడ, ఎలా, ఎవరివల్ల అన్యాయం జరిగిందో వివరంగా రాయండి. విషయాన్ని ధ్రువపరిచే సాక్షులనూ చేర్చొచ్చు. వాటిని చూపిస్తూ మీ పై అధికారితో మాట్లాడండి. ఫలితం లేదనుకుంటే అతని పైవాళ్లు లేదా హెచ్‌ఆర్‌ అధికారులను కలిసి ఏం చేయాలన్న దానిపై చర్చించండి. ముఖ్యంగా బాధ, నిరాశలను దరిచేరనీయొద్దు. చాలామంది ఇలాంటి పరిస్థితుల్లో నోరు మెదపరు. కానీ మీ హక్కులపై మీరు పోరాడినప్పుడే ‘సహజం’ అని భావించే ఈ పరిస్థితిలో మార్పు సాధ్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని