..అయినా జుట్టు ఊడుతోంది!
ఏదైనా అనారోగ్యం తర్వాత జుట్టు ఊడటం మామూలని విన్నా. కానీ నాకు ఈ మధ్యకాలంలో అలాంటిదేమీ లేదు. అయినా విపరీతంగా ఊడుతోంది. ఎన్ని ఉత్పత్తులు వాడినా ప్రయోజనం లేదు.
ఏదైనా అనారోగ్యం తర్వాత జుట్టు ఊడటం మామూలని విన్నా. కానీ నాకు ఈ మధ్యకాలంలో అలాంటిదేమీ లేదు. అయినా విపరీతంగా ఊడుతోంది. ఎన్ని ఉత్పత్తులు వాడినా ప్రయోజనం లేదు. తగ్గించుకునే మార్గం చెప్పండి.
- ఓ సోదరి
అనారోగ్యాలే కాదు.. హార్మోనుల్లో తేడా, పీసీఓడీ, థైరాయిడ్, ఐరన్, హిమోగ్లోబిన్ తక్కువున్నా జుట్టు ఊడుతుంది. సంబంధిత పరీక్షలు చేయించుకోండి. డైటింగ్ చేస్తున్నారా? విటమిన్లు, మినరల్స్ సరిగా అందకపోయినా సమస్యే! 50-100 కంటే ఎక్కువ ఊడుతుంటేనే ఇబ్బంది. ఆలోపు అయితే పట్టించుకోవద్దు. ఎనాజిన్, కెటాజిన్, టెలోజిన్ అని వెంట్రుకల పెరుగుదల విషయంలో మూడు దశలుంటాయి. ఇది ఒక సైకిల్. ఇప్పుడు వెంట్రుకలు రాలే దశలో ఉండొచ్చు. ఇంకా.. గర్భధారణకు సంబంధించిన మందులు వాడుతున్నా, ఇటీవలే ప్రసవం అయినా, మెనోపాజ్‌లోకి అడుగుపెట్టినా ఇలా జరుగుతుంది. ముందు సమస్యకు కారణం కనుక్కోండి. లాగినట్టుగా దువ్వడం, బిగుతుగా జడ వేయడం, రసాయనాలతో కూడిన ఉత్పత్తులు వాడటం చేయొద్దు. న్యూట్రిషన్ లోపం ఉంటే వైద్యుల సలహాతో బయోటిన్‌తోపాటు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు వాడండి. ప్రొటీన్, విటమిన్లు ఎ, బి, సి, డి ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా అందే నట్స్, ఆకుకూరలు, రెడ్ మీట్, గుమ్మడి, చిలగడ దుంప, పాలు, గుడ్డు, పప్పుధాన్యాలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఒత్తిడి ఉంటే తగ్గించుకోండి. గోరువెచ్చని నీటితోనే తలస్నానం, ఆపై కండిషనింగ్ అలవాటు చేసుకోండి. కొబ్బరినూనెకు బాదం నూనె కలిపి గోరువెచ్చగా చేసి, తలకు పట్టించి, షవర్ క్యాప్ పెట్టాలి. అరగంటయ్యాక తలస్నానం చేయండి. గుడ్డు తెల్లసొనకు కొన్నిపాలు, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ కలిపిగానీ కలబంద గుజ్జుకు ఆలివ్ నూనె కలిపి వారానికోసారి ప్యాక్‌లా వేసినా మంచిదే. వీటితోనూ సమస్య తగ్గకపోతే పీఆర్‌పీ ట్రీట్‌మెంట్ సూచిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.