ఎండు చేపలు.. తినకూడదా?

వయసు 49. మాంసాహారిని. డయాబెటిస్‌ ఉంది. మూడేళ్లుగా మందులు వాడుతున్నా. రక్తంలో చక్కెరస్థాయుల్లో హెచ్చుతగ్గుల వల్ల ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ వస్తోంది. ఆయింట్‌మెంట్‌ వాడితే తగ్గుతోంది. ఆహారంలో మార్పు వల్లనే ఇలా జరుగుతోంది అంటున్నారు.

Published : 24 Aug 2023 01:59 IST

వయసు 49. మాంసాహారిని. డయాబెటిస్‌ ఉంది. మూడేళ్లుగా మందులు వాడుతున్నా. రక్తంలో చక్కెరస్థాయుల్లో హెచ్చుతగ్గుల వల్ల ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ వస్తోంది. ఆయింట్‌మెంట్‌ వాడితే తగ్గుతోంది. ఆహారంలో మార్పు వల్లనే ఇలా జరుగుతోంది అంటున్నారు. వంకాయ, రొయ్యలు, ఎండుచేపలు లాంటివి తినొద్దని చెబుతున్నారు. ఇది నిజమేనా? ఈ సమస్య నుంచి బయటపడటానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

   - రామలక్ష్మి, కరీంనగర్‌

డయాబెటిస్‌ ఉన్నవాళ్లకు రక్తంలో చక్కెరశాతం నియంత్రణలో లేనప్పుడు ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. ఇవి మందులు వాడినప్పుడు తగ్గినప్పటికీ మళ్లీ చక్కెర స్థాయులు పెరిగితే వచ్చేస్తాయి. అంత త్వరగా పోవు. ఇన్‌ఫెక్షన్లు ఎదుర్కొని చర్మాన్ని రీఫిల్‌ చేసే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అందుకోసం, తీసుకునే ఆహారంలో తగినన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి. చర్మం అనారోగ్యం పాలుకాకుండా కాపాడాలంటే.. మాంసకృత్తులు ఎక్కువగా ఉండే పదార్థాలను తినాలి. పప్పు దినుసులు, ఆకుకూరలు, మీల్‌మేకర్‌ వంటివాటిల్లో మేలైన మాంసకృత్తులు ఉంటాయి. వీటిని మీ ఆహారంలో భాగం చేసుకోవాలి. సోయాబీన్‌, ఆవనూనెలను వాడితే మేలు. విటమిన్‌ సి అధికంగా ఉండే ఉసిరి, బత్తాయిలు, విటమిన్‌ ఎ, ఫోలిక్‌ యాసిడ్లు ఎక్కువగా ఉండే అవిసె, గుమ్మడి, గింజల్ని రోజువారి డైట్‌లో చేర్చుకోవాలి. వీటితో పాటు జననాంగాలు, బాహుమూలలు లాంటి చెమట ఎక్కువగా పట్టే భాగాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. పొడిగా ఉండేట్లు చూసుకోవాలి. బిగుతుగా ఉండే వస్త్రాలను ధరించడం మానేయాలి. వ్యాయామం, నడక, కొన్ని స్ట్రెచింగ్స్‌, యోగా లాంటివి రోజూ తప్పకుండా చేయండి. అప్పుడే రక్తప్రసరణ బాగా జరిగి ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు. అంతేకానీ, వంకాయ, ఉప్పుచేపలు తింటే ఇవి వస్తాయి అన్నది అపోహే. ఇలా మూడు నుంచి ఆరు నెలల పాటు ఈ నియమాలు పాటించి హెచ్‌బీఎ1సీ పరీక్షను చేయించుకోవాలి. ఇది 5.6- 6 శాతం లోపు ఉండేట్లు చూసుకుంటే ఎలాంటి సమస్యలూ రావు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని