ఆ వాతావరణంలో ఇమడలేకపోతున్నా..!

కొన్ని నెలల క్రితమే కొత్త సంస్థకి మారా. ఇప్పటివరకూ ఎదురుదెబ్బలు, చిన్నచూపు లాంటివే ఎరుగను. కానీ ఇక్కడి పరిస్థితి భిన్నం. ఏదైనా ప్రాజెక్టు పూర్తిచేస్తే ఏంటి నువ్వే చేశావా అనడం, ఆలోచన చెబితే ఆడవాళ్లకేం తెలుస్తుందంటూ మాట్లాడతారు.

Published : 19 Jun 2024 01:47 IST

కొన్ని నెలల క్రితమే కొత్త సంస్థకి మారా. ఇప్పటివరకూ ఎదురుదెబ్బలు, చిన్నచూపు లాంటివే ఎరుగను. కానీ ఇక్కడి పరిస్థితి భిన్నం. ఏదైనా ప్రాజెక్టు పూర్తిచేస్తే ఏంటి నువ్వే చేశావా అనడం, ఆలోచన చెబితే ఆడవాళ్లకేం తెలుస్తుందంటూ మాట్లాడతారు. అదే ఆలోచన మగవాళ్లు చెబితే మెచ్చుకుంటున్నారు. ఏ పొరపాటు జరిగినా ముందు నావైపే చూస్తున్నారు. ఈ వాతావరణంలో ఇమడలేకపోతున్నా. ఉద్యోగం మారడమే మార్గమా?

ఓ సోదరి

పనిప్రదేశంలో ఇటువంటి పరిస్థితి మనల్ని మరింత నిరుత్సాహ పరుస్తుంది. దీని వల్ల ఉత్పాదకతా తగ్గుతుంది. ఇలాంటి విషయాలు చాలామంది పైవాళ్లకు తెలియజేయకుండా, మనసులోనే మదనపడుతుంటారు. నిజంగానే నన్ను అలా చూస్తున్నారా? లేదా నేనే కొంచెం సెన్సెటివ్‌గా ఉన్నానా? పైవాళ్లతో చెబితే నా గురించి ఏమైనా అనుకుంటారేమో! అనీ సంకోచిస్తారు. కానీ, అది అన్నిసార్లూ మంచిది కాదు. ఏదిఏమైనా ఉద్యోగం మానేయడమే దీనికి పరిష్కారం కాదు. ముందు మీ బలాలపై దృష్టి పెట్టండి. మీరు పెట్టుకున్న విలువలు, నమ్మకాలను పాటిస్తూ మీ పని మీరు చేసుకుంటూపోండి. దానివల్ల సమస్యలను అధిగమించడంతోపాటు భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కోగల శక్తీ వస్తుంది. దాంతోపాటు ఆఫీసులో మీ స్నేహితులూ, శ్రేయోభిలాషులూ చెప్పే మాటలు వినండి. ఎందుకంటే వాళ్లు మీ విలువేంటో, మీ బలమేంటో మీకు గుర్తు చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితులు వాళ్లు ఎలా ఎదుర్కొన్నారో అడిగి తెలుసుకోండి. ఇలా ఉన్నా కూడా పరిస్థితి అదుపులోకి రాకపోతే అప్పుడు ఉద్యోగం మానేయడం గురించి ఆలోచించండి. ఎందుకంటే మీ చేతిలో మరేదైనా ఉద్యోగ అవకాశం లేకపోతే, మీకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తొచ్చు. కాబట్టి అన్నీ ఆలోచించుకుని ఒక ప్రణాళికతో ముందడుగు వేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్