సపోటా, సీతాఫలం... ఎప్పటికీ తినలేనా?

చిన్నప్పటి నుంచీ నాకు సపోటా పండ్ల వాసన చూస్తే తినాలనిపిస్తుంది. కానీ, తింటే... నాలుక, మూతి చుట్టూ దురద. గొంతూ పట్టేసినట్లు ఉంటుంది. దీంతో వాటని తినలేకపోతున్నా. అలానే, సీతాఫలం తిన్నప్పుడు దగ్గు వేధిస్తుంది.

Updated : 20 Jun 2024 04:57 IST

చిన్నప్పటి నుంచీ నాకు సపోటా పండ్ల వాసన చూస్తే తినాలనిపిస్తుంది. కానీ, తింటే... నాలుక, మూతి చుట్టూ దురద. గొంతూ పట్టేసినట్లు ఉంటుంది. దీంతో వాటని తినలేకపోతున్నా. అలానే, సీతాఫలం తిన్నప్పుడు దగ్గు వేధిస్తుంది. ఇవేమైనా అలర్జీ కలిగిస్తున్నాయా? అసలు నాకెలాంటి ఆహారం పడదో తెలుసుకోవచ్చా?

శ్వేత, తణుకు

హారం ద్వారా రకరకాల అలర్జీలు వస్తాయి. ఏవి పడట్లేదో, అవి ఎంత మేర మీకు అలర్జీని కలిగిస్తున్నాయో ఐజీఈ, ఐజీజీ అనే రక్త పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. ఐజీఈ పరీక్ష తీసుకున్న ఆహారం ఏ స్థాయిలో మనకు అలర్జీని కలిగిస్తుందో చెబుతుంది. ఐజీజీ ద్వారా శరీరం యాంటీబాడీస్‌ ఏమైనా తయారు చేసుకుంటోందేమో తెలుసుకోవచ్చు. సాధారణంగా దేనివల్లైనా అలర్జీ వస్తే... దురద, చర్మం మీద మచ్చలు, నాలుకపైన దద్దుర్లు-దురద, గొంతు పట్టేయడం, దగ్గు వంటి సూచనలు కనిపిస్తాయి. అది తీవ్రమైతే ఊపిరితిత్తులు, శ్వాసనాళాలు ఉబ్బి ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. మరిన్ని అనర్థాలకూ దారితీయొచ్చు. సాధారణంగా కొంతమంది పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. వేరుశనగ, బాదంతో పాటు మరికొన్ని రకాల నట్స్‌ వారికి పడవు. అందుకే, ఈ పరిస్థితి ఎదురైతే అదుపు చేయడానికి అందుబాటులో యాంటీ అలర్జీ ట్యాబ్లెట్లు పెట్టుకుంటారు పెద్దలు. అలాంటి పదార్థాలు దూరంగా ఉంచుతారు. ఇక, మీ విషయానికి వస్తే సపోటా వల్ల దురద, గొంతు పట్టేయడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి అంటున్నారు. మీకే కాదు...చాలామందికి ఇలాంటి అనుభవం ఎదురుకావొచ్చు. సపోటా పండులో కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువ. వీటికి జిగట లక్షణాలు ఉండటం వల్ల కాయ పూర్తిగా పండకుండా తింటే నోటికి రబ్బర్‌లాంటి పదార్థం అతుక్కుంటుంది. ఇదే దురదకు కారణం. ఇదేకాదు, ఈ తరహా అలర్జీలు గత కుటుంబ చరిత్రలో ఎవరికైనా ఉన్నా, చిన్నవయసులో వాటిని రుచి చూడకుండా ఆ తరవాత ఎప్పుడో తినడం వల్ల కూడా ఈ పరిస్థితి ఎదురవుతుంది. మీకు సీతాఫలంతో దగ్గు వస్తోందని చెబుతున్నారు కాబట్టి పైన చెప్పిన రెండు అలర్జీ టెస్ట్‌లు చేయించండి. అప్పుడు ఇందుకు కారణమైన పదార్థాలు ఏంటో, వాటి తీవ్రత ఎంతో అర్థమవుతుంది. ఆ నివేదిక ఆధారంగా ఏవి తక్కువ తినాలి? వేటిని పూర్తిగా మానేయాలి అనేది తెలుస్తుంది. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్