Updated : 08/12/2022 19:42 IST

మా పాప మాట్లాడాలంటే...?

మా పాపకి మూడేళ్లు. ఇంకా మాటలు రావట్లేదు. మేం మాట్లాడితే మాత్రం పలుకుతుంది. తనంతట తాను మాట్లాడలేకపోతోందని  మాకు భయమేస్తోంది. అసలు పిల్లలు ఎన్ని సంవత్సరాలకు పూర్తిగా మాట్లాడతారు.  మా పాప మాటలు నేర్చుకుని స్పష్టంగా మాట్లాడాలంటే ఏం చేయాలి?

- ఓ సోదరి

మీ ఉత్తరాన్ని బట్టి చూస్తోంటే... పాప మీరు మాట్లాడింది యథాతథంగా మాట్లాడుతుంది. కానీ తనంతట తానుగా మాట్లాడలేకపోతుందని అర్థమవుతోంది. సాధారణంగా పిల్లలు నాలుగు నుంచి ఆరు నెలల వయసులోనే రకరకాల శబ్దాలు చేయడం మొదలుపెడతారు. ఆ తరువాత తల్లిదండ్రులు, మిగతా కుటుంబ సభ్యుల మాటలను ఆలకిస్తుంటారు. వ్యక్తుల్ని గుర్తుపడుతుంటారు. దీన్నే నాన్‌ వెర్బల్‌ కమ్యూనికేషన్‌ అంటారు.

ఇక, పిల్లలకు ఏడాది వచ్చేసరికి  అత్తా.. తాతా.. అమ్మా.. అంటూ చిన్న చిన్న పదాలు పలకడం నేర్చుకుంటారు. ఏడాదిన్నరలో వారి ఇష్టాయిష్టాలను హావభావాల ద్వారా, చిన్న చిన్న పదాలను పలుకుతూ వ్యక్తం చేస్తుంటారు. ఇది ప్రైమరీ కమ్యూనికేషన్‌. రెండేళ్లకు ‘నాకు ఇవ్వు.. నాకు వద్దు..’ అంటూ వారికి కావల్సింది అడుగుతారు. మూడేళ్లు వచ్చేసరికి మూడేసి పదాలతో చిన్న వాక్యాలు చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు. ఇదే సమయంలో శరీర భాగాలు, వాడే వస్తువులు, చుట్టుపక్కల వ్యక్తుల గురించి కొంత అవగాహన వస్తుంది.
మీ పాపకి మూడేళ్లంటున్నారు. తన విషయానికి వస్తే ఆలోచించాల్సిందే! ఇక మీదట పాప మీద శ్రద్ధ పెట్టి ఎక్కువ సేపు మాట్లాడుతూ మాట్లాడించే ప్రయత్నం చేయండి. మీరు ఏం చెప్పినా అందుకు సంబంధించిన వస్తువును చూపిస్తూ వివరాలు చెప్పాలి. ఆ తరువాత ఆమెకు ఏం అర్థమైందో అడిగి తెలుసుకోవాలి. మీరు చెప్పింది యథాతథంగా చెబుతుందా? లేదా ఊహాజనితంగా, తనకు తోచినట్టు చెబుతుందా అన్నది గమనించాలి. ఒకవేళ చెప్పిందే తిరిగి చెబుతుంటే మాత్రం తనలో ఎక్స్‌ప్రెసివ్‌ లాంగ్వేజ్‌ డిలే సమస్య ఉందేమో గమనించాలి. ఇది ఉన్నప్పుడు మాటలు వచ్చినా వాటిని ఎలా వ్యక్తపరచాలో వారికి తెలియదు. అదే ఆటిజంలో కూడా భాష వ్యక్తీకరణ సమస్య ఉంటుంది. ఇక కొందరు చిన్నారులు అసందర్భంగా, ఆపకుండా అవసరం కంటే ఎక్కువ మాట్లాడుతుంటారు. ఇవన్నీ కూడా సమస్యలే. అందుకే మీరు మొదట మానసిక నిపుణుల సాయం తీసుకోవాలి. వారు పరీక్షలు చేసి ఆటిజం, న్యూరో డెవలప్‌మెంట్‌ (స్పీచ్‌)సమస్య, భాషాపరమైన డిజార్డర్‌.. ఇలా మీ పాపకు ఏ సమస్య ఉందో కనుక్కుంటారు. వాటితో పాటు గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ డిలే ఉందేమో కూడా పరీక్షిస్తారు. మానసిక ఎదుగుదల లేకపోవడంతోపాటు.. నడవడం, కూర్చోవడం కూడా ఆలస్యం అయితే దాన్ని గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ డిలే అంటారు. అవసరమైతే స్పీచ్‌ థెరపీలనూ చేయించాల్సి ఉంటుంది. ఆటిజం అయితే సామాజిక భావవ్యక్తీకరణ నైపుణ్యాలు నేర్పిస్తారు. ఇలా సమస్యను బట్టి మీకో మార్గం ఉంటుంది. దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు.

- మీ సందేహాలను ‌vasukid@eenadu.net కు పంపించగలరు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్