close
Published : 18/03/2021 00:49 IST

అమ్మా.. నాన్న... జమీల్యా!

సంకల్ప కళాగ్రామం...  పల్లెతనం పల్లవించే ఈ గ్రామంలో రసాయనాల్లేని స్వచ్ఛమైన ఆహారం దొరుకుతుంది... నాటుకోళ్లు... మేకలు... గానుగ నూనెలు.. చేనేత వస్త్రాలు ఏం కావాలన్నా ఉంటాయి. 30 ఎకరాల్లో విస్తరించిన ఈ గ్రామానికి ఏడాది పొడవునా సందర్శకుల తాకిడి ఉంటుంది. నిఫ్ట్‌వంటి జాతీయ సంస్థల విద్యార్థులు సైతం ఇక్కడ పాఠాలు నేర్చుకుని వెళుతుంటారు. ఇంతకీ ఈ గ్రామం ఎక్కడ ఉంది? ఈ గ్రామాన్ని ఎన్నో ప్రయోగాలకు వేదికగా మార్చిన జమీల్యా ఆకుల ఎవరు? తెలుసుకోవాలంటే చదివేయండి మరి...  

స్కూల్‌ ఆఫ్‌ డిజైనింగ్‌లో ప్రొడక్ట్‌ డిజైనింగ్‌ కోర్సు చదివింది జమీల్యా. దిల్లీలోని టాటా లైఫ్‌ సైన్సెస్‌లో పని చేసింది. ఆ అనుభవం ఆ అమ్మాయికి విదేశాల్లో లక్షల్లో జీతాన్నిచ్చే ఉద్యోగాల్ని తెచ్చిపెట్టింది. కానీ వాటిని వదులుకొని తల్లిదండ్రుల ఆశయాన్నే ముందుకు తీసుకువెళ్లాలనుకుందీ విశాఖపట్నం అమ్మాయి. ఇందుకోసం వాళ్లు స్థాపించిన ‘సంకల్ప కళాగ్రామాన్ని’ వేదికగా చేసుకుని ప్రజలకు నిత్యజీవితంలో అవసరం అయ్యే ఆహారం మొదలుకుని దుస్తుల వరకూ ప్రతి వస్తువునీ రసాయన రహితంగా అందించాలని తపన పడుతోంది. చిన్నప్పుడు సెలవుల్లో  అమ్మానాన్నలతో కలిసి సేంద్రియ వ్యవసాయం చేసిన అనుభవమే తననీ దిశగా అడుగులు వేసేలా చేసిందంటోందామె. పాతికేళ్ల క్రితం రాజమహేంద్రవరంలో జమీల్యా అమ్మానాన్నలైన  ఆకుల చలపతి, పార్వతి ఒక చిన్న నర్సరీని మొదలుపెట్టారు. ఆ తర్వాత విశాఖకు వచ్చి రెండెకరాల్లో కళాగ్రామాన్ని ప్రారంభించారు. ఆపై స్థానిక రైతుల నుంచి కొంత భూమిని లీజుకు తీసుకుని.. ఈ గ్రామాన్ని విస్తరించారు. ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకొని... జమీల్యా ఆ భూమిలో ప్రకృతి జీవనంపై ఆసక్తిని పెంచే ఎన్నో ప్రయోగాలు మొదలుపెట్టింది. సేంద్రియ ఎరువులని ఉపయోగించి కూరగాయలు పండించడం, ఔషధ, సుగంధద్రవ్య మొక్కలు పెంచడం వంటివి చేసింది. ఔషధ మొక్కల నుంచి పొడులు, సహజ రంగులు తయారుచేస్తోంది. ఇక్కడే నాటు కోళ్లు, మేకలు పెంచుతోంది. వేరుసెనగ, కొబ్బరినూనె, నువ్వుల నూనె వంటివి గానుగల్లో ఆడించి తీయిస్తోంది. ప్లాస్టిక్‌తో సంబంధం లేకుండా ప్రాకృతిక విధానంలో ఇంట్లో ఉపయోగించే అన్ని రకాల వస్తువులు చేయించడం ఈ కళాగ్రామం ప్రత్యేకత. వంద ఎకరాల్లో సేంద్రియ సాగు చేసే రైతుల నుంచి పప్పులు, బియ్యం వంటివి సేకరించి వాటికి మార్కెట్‌ సౌకర్యం కల్పిస్తోంది జమీల్యా.    
కళాగ్రామంలో సహజ రంగులతో తయారుచేసిన చేనేత వస్త్రాలు.. వాటితో తీర్చిదిద్దిన చీరలు, దోతీలు, ప్యాంట్లు లభ్యమవుతాయి. వీటిల్లో ఎక్కువ భాగం అమెరికాకు ఎగుమతి అవుతుంటాయి. దిల్లీ, ముంబయిల నుంచి ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ సంస్థలు తమకు కావాల్సిన ఆర్గానిక్‌ దుస్తుల కోసం ఆర్డర్లు ఇస్తుంటాయి. ఇందుకోసం ‘సజీవ’ అనే వెబ్‌సైట్‌ని ప్రారంభించింది జమీల్యా. అన్నట్టు ఈ సైట్‌లో నాటుకోళ్లు, మేక మాంసం వంటివి కూడా కొనుగోలు చేయొచ్చు. ఈ కళా గ్రామంలో 60 మందికిపైగా మహిళలు ఉపాధి పొందుతున్నారు.

నెలకు 5 లక్షల మొక్కలు..
బొన్సాయ్‌ మొదలుకుని ఎన్నో అరుదైన మొక్కలు కూడా కళాగ్రామంలో దొరుకుతాయి. ప్రతి నెలా అయిదు లక్షల కొత్త మొక్కల్ని రైతులకి ఇక్కడ నుంచే సరఫరా చేస్తారు. వాటికి కావాల్సిన మట్టి కుండీలని సైతం ఇక్కడే తయారుచేస్తారు. ఈ నర్సరీ వ్యవహారమంతా జమీల్యా తల్లి పార్వతి చూస్తారు. అవసరమైన వారికి మొక్కల్ని సైతం అద్దెకు ఇస్తారు.
విశాఖ నగర శివారు అయిన పినగాడి గ్రామంలో ఉందీ సంకల్ప కళాగ్రామం. ఇక్కడి సేంద్రియ ఉత్పత్తుల తయారీ, సాగు విధానాలను దగ్గరుండి పరిశీలించేందుకు వారంలో కనీసం 20 నుంచి 30 కుటుంబాలైనా వస్తుంటాయి. వివిధ పాఠశాలల నుంచి వందల మంది విద్యార్థులు స్టడీ టూర్లకు వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తుంటారు. వీళ్లే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి ఫార్మసీ, డిజైనింగ్‌ కోర్సులు చేసే విద్యార్థులు సహజరంగుల ఉత్పత్తి, నేతపని, కుట్టుపని, కాగితం తయారీ, ఉడ్‌ కార్వింగ్‌ వంటి విషయాల్లో ఇంటర్న్‌షిప్‌ చేసేందుకు వస్తుంటారు. నిఫ్ట్‌ వంటి జాతీయ సంస్థల నుంచి ఏటా వందమంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి వివిధ విషయాలు నేర్చుకుంటారు. ఇలా వచ్చిన వారికి ప్రాకృతిక జీవన విధానంపై ఉచితంగా అవగాహన కల్పిస్తుంటారు జమీల్యా.

-రావివలస సురేశ్‌, విశాఖపట్నం


Advertisement

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి