Updated : 28/03/2021 00:46 IST

నేనిక బతకననే అనుకున్నారు!

కోటి కలలతో పుట్టింటికొచ్చిందామె... పురుడు పోసుకోవడానికని! కానీ.. ఎన్నో సంతోషాలని మిగల్చాల్సిన ఆ సమయం ఆమె జీవితంలో విషాదాన్ని నింపింది. అప్పుడు జరిగిన ఓ ఘోరప్రమాదం ఆమెని 22 ఏళ్లుగా మంచానికే పరిమితం చేసింది. ఆ చేదుగతాన్ని చెరిపేసి సంతోషపు వర్తమానాన్ని రాసుకోవడానికి ఛాయాదేవి చేసిన ప్రయత్నాలు తక్కువేం కాదు. వైకల్యాన్ని పక్కకు నెట్టి తన కుటుంబానికి అండగా నిలిచిన ఆమె కథ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం...
హైదరాబాద్‌లోని బోరబండ దగ్గరున్న కబీర్‌నగర్‌లో నివాసం ఉంటారు వాస ఛాయాదేవి. వాళ్లింట్లో అడుగుపెట్టాలంటే అందమైన కుండీల్లోని పచ్చని మొక్కలని దాటుకుని వెళ్లాల్సిందే. ‘అబ్బ!... ఎవరో ఇంత ఓపిగ్గా పెంచారు’ అని మన మదిలో ఓ ప్రశ్న ఉదయించకమానదు. ఆ ప్రశ్నకు సమాధానం 22 ఏళ్లుగా మంచానికే అతుక్కుపోయిన ఛాయాదేవి అని తెలిసినప్పుడు మనసు చెరువవుతుంది. ఇదెలా సాధ్యం అనిపిస్తుంది. దానికి ఆమే గలాగలా మాట్లాడుతూ సమాధానమిస్తారు.
అనుకోని ప్రమాదం...
‘1999 ఏప్రిల్‌ 5వ తేదీ.. మియాపూర్‌ జాతీయ రహదారి నుంచి ఇంద్రారెడ్డికాలనీకి వెళ్లే బైపాస్‌ రోడ్డు రహదారి మూలమలుపునకు  దిగువన అమ్మవాళ్ల ఇల్లు. అప్పుడు నేను ఏడునెలలు గర్భవతిని. ప్రసవం కోసం వెళ్లా. అమ్మ, నాన్న, చెల్లి వీళ్లతో సంతోషంగా గడిచిపోతున్న రోజులవి. ఓ రోజు మధ్యాహ్నం ఇంట్లో మంచంపై పడుకున్నా. ఆ సమయంలో ఎలా వచ్చిందో తెలియదు కానీ.. 14 చక్రాల లారీ, 2000 సిమెంటు బస్తాలతో గోడలను బద్దలు కొట్టుకుంటూ ఇంట్లోకి దూసుకువచ్చింది. నేను మంచంతో సహా లారీ కింద ఇరుక్కుపోయా. అమ్మకు కాలు విరిగింది. చెల్లికి కంటిపై భాగంలో లోతుగా గాయాలయ్యాయి. నాన్న ఇంట్లో లేరు. దాంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. నేనిక బతకననే అనుకున్నారంతా. అతి కష్టంమ్మీద నన్ను ఆసుపత్రిలో చేర్చారు. ఆ ప్రమాదంలో నా వెన్నెముక దెబ్బతింది. కాళ్లు చచ్చుబడి పోయాయి. ఏడో నెలలోనే సర్జరీ చేసి డెలివరీ చేశారు. బాబు పుట్టాడు. అప్పట్నుంచే నా కష్టాలు మొదలయ్యాయి. అత్తింటివారు స్వాగతించలేకపోయారు నన్ను. అప్పుడు తాతయ్య ఇచ్చిన చిన్న స్థలమే నన్ను ఆదుకుంది’ అనే ఛాయాదేవి..  22 ఏళ్లుగా మంచానికే పరిమితమైనా తల్లి, చెల్లి, తండ్రి, కొడుకు బాధ్యతలని తీసుకున్నారు. చేతితో నడిపే కుట్టుమిషన్‌ తీసుకుని దాంతోనే చుట్టుపక్కల వారికి కుట్టుపని నేర్పిస్తూ వచ్చిన ఆదాయంతో ఆమె కుటుంబానికి ఆసరాగా నిలిచారు. బీమా కంపెనీలకు ఏజెంటుగా పనిచేసి కుటుంబాన్ని మెల్లగా గట్టెక్కించారు. దూరమైన భర్త తిరిగొస్తే ట్రావెల్స్‌ వ్యాపారం కోసం కారుని కొనిపెట్టారు. కానీ ఆ సంతోషమూ ఆమెకు ఎన్నాళ్లో నిలవలేదు. ఇటీవల భర్త మరణిస్తే...కొడుకుని చదివించే బాధ్యతని తలకెత్తుకున్నారు.

కష్టాలు, కన్నీళ్లు ముప్పేట దాడిచేస్తున్నా ముఖంలో చిరునవ్వుని చెరగనివ్వరు ఛాయాదేవి. అందుకు కారణం తన చుట్టూఉన్న పచ్చని మొక్కలేనంటారు. ‘నాన్న సాయంతో మంచంపై కూర్చునే కుండీలకు పెయింట్‌ వేయడం, ఎరువులు తయారుచేయడం, అంట్లు కట్టడం, కత్తిరింపులు వంటివి చేస్తాను. మా టెెర్రస్‌పైన సుమారు 300 రకాల మొక్కలను పెంచాను.’ అనే ఛాయాదేవి ఎందరికో స్ఫూర్తిదాయకం.

- గాదిరాజు వెంకటేష్‌, హైదరాబాద్‌.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి