Published : 09/04/2021 00:56 IST

ఏడు నెలల పాపకు ఏం తినిపించాలి? 

మా పాపకు ఏడో నెల. తనకు నా పాలు కాకుండా ఎలాంటి ఆహారం పెట్టాలి? అలాగే ఎంత మోతాదులో పెట్టాలి? - నవ్య, హైదరాబాద్‌
పాపాయి ఎదుగుదలలో ఆరు నెలల నుంచి ఏడాది వరకు చాలా కీలకదశ. మింగడం, చప్పరించడం, నమలడం... లాంటివన్నీ ఇప్పుడే చేసేది. క్రమంగా కొద్దిమొత్తంలో ఘనాహారం ఇప్పటి నుంచే పెట్టండి. రకరకాల రుచులూ, పోషకాలున్న పలు రకాల ఆహార పదార్థాలనూ ఈ ఆరు నెలల్లోనే పిల్లలకు పరిచయం చేయాలి.
దశల వారీగా...  బిడ్డకు ఏడెనిమిది నెలల వయసు వచ్చేప్పటికి తల్లిపాల నుంచి వచ్చే విటమిన్‌-సి సరిపోదు. కాబట్టి ఈ పోషకం ఉండే పుచ్చకాయ, ద్రాక్ష, దానిమ్మ లాంటి పండ్లరసాలను పలుచగా చేసి ఇవ్వొచ్చు. లేదా గుజ్జులా చేసి తినిపించొచ్చు. రాగులు, పెసర్లు, గోధుమలతో చేసిన మాల్ట్‌ (గింజలను మొలకెత్తించి, ఆరబెట్టి, వేయించి పొడిచేసుకోవాలి)ను పెట్టొచ్చు. మూడొంతుల ధాన్యాలకు ఒక వంతు పప్పులను కలిపి తయారుచేసుకోవాలి. దీన్ని ఉడికించి కాస్త నెయ్యి, బెల్లం వేసి తినిపించాలి. ఆరునెలలు దాటిన చిన్నారికి కాచి చల్లార్చిన నీళ్లు తాగిస్తూ ఉండాలి. లేదంటే మలబద్ధకం, కడుపుబ్బరం లాంటి సమస్యలు రావొచ్చు. తొమ్మిదినెలలు వచ్చేసరికి నమలగలుగుతారు. కాబట్టి మూడొంతుల ధాన్యం (బియ్యం, రాగులు), ఒక వంతు పప్పును వేసి కాస్త వేయించి బరకగా మిక్సీ పట్టాలి. దీన్ని ఉడికించినప్పుడు నెయ్యి, క్యారెట్‌/ఆలు వంటి కూరగాయ ముక్కలు, ఉప్పు కలపాలి. తర్వాత దీన్ని మెత్తగా మెదిపి తినిపించొచ్చు. బాగా ఉడికిన పచ్చసొన, వెజిటెబుల్‌ సూప్స్‌ వంటివీ పెట్టొచ్చు. పదో మాసం వచ్చాక ఇడ్లీ, ఉప్మా, మెత్తగా ఉడికించిన మటన్‌ ఖీమా, చికెన్‌, లివర్‌ వంటివన్నీ కొద్దికొద్దిగా తినిపించొచ్చు. చిన్నప్పటి నుంచే చక్కెర, ఉప్పు వంటివి తక్కువ మోతాదులో తీసుకునేలా చూడండి. పదకొండు, పన్నెండు నెలల్లో...మనం తీసుకునే ఆహారాన్నే మెత్తగా చేసి పెట్టొచ్చు. దగ్గరుండి వారంతట వారుగా తినే అలవాటు చేయండి. తినడానికి ఆహార వేళలు పాటించేలా చూసుకోండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి