Published : 12/04/2021 00:38 IST

జీవితాన్ని గెలిచిన ఫైటర్‌

అసలే పేదరికం... పుట్టుకతోనే అంధత్వం... అయినా జీవితంతో పోరాడి జూడో ఫైటర్‌ అయ్యిందామె. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటింది. తాను నిరూపించుకుంది. ఇప్పుడు తనలాంటి మరికొందరికి శిక్షణనిస్తూ స్ఫూర్తినందిస్తోంది. ఆమే  22 ఏళ్ల సరితా ఛారే.
‘అసాధ్యం అన్న భావన... మనసులో నుంచి తొలగిపోవడమే విజయపథంలో తొలి అడుగు’ అనే సరితది మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌. నిరుపేద కుటుంబం. తండ్రి లఖన్‌లాల్‌ ఛారే వాచ్‌మెన్‌, తల్లి శ్రీకష్ణ గృహిణి. వీరి ఆరుగురు సంతానంలో ముగ్గురాడపిల్లలు పుట్టుకతోనే అంధులు. వారిలో సరిత ఒకరు. చూపు లేని ఆ పిల్లలకు చదువే దారి చూపుతుందని భావించి హాస్టల్‌ సౌకర్యం ఉన్న ఇండోర్‌లోని అంధుల ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు అమ్మానాన్నలు. జీవితం బాగుండాలంటే బాగా చదువుకోవాలని తరచూ చెప్పే నాన్న మాటలు సరితలో పట్టుదల పెంచాయి. ప్రతి తరగతిలోనూ మంచి మార్కులు తెచ్చుకుంటూ ఇంటర్‌లో రాష్ట్ర స్థాయి (అంధులవిభాగం)లో మొదటి ర్యాంకు సాధించింది.
ఆత్మవిశ్వాసం అండగా...
సెలవుల్లో ఇంటికొచ్చిన సరితకు ఓ స్వచ్ఛంద సంస్థ అంధులకు జూడో శిక్షణనిస్తోందని తెలిసింది. స్వీయ రక్షణకు ఉపయోగపడే ఆ విద్యను నేర్చుకోవాలనుకుంది. ‘‘జూడో శిక్షణ ఇస్తున్న సైట్‌ సేవర్స్‌ ఇండియా’  నిర్వాహకులను కలుసుకున్నా. నేర్చుకునే అవకాశం కల్పించమని అడిగా. వారు సరే అన్నారు. కోచ్‌ శ్రీభగవాన్‌దాస్‌ వద్ద సాధన ప్రారంభించా. జూడో కష్టమైన విద్య. చూపున్న వారు ఎదుటి వ్యక్తుల్ని చూసి పోరాడవచ్చు. చూపులేని మాకిది అసాధ్యం. మా ముందు ఉన్న వ్యక్తి ఏదైనా శబ్దం చేస్తేనే ఉనికిని గుర్తించగలం. అయితే మాపై దాడికి పాల్పడే వ్యక్తులు ఎలాంటి చప్పుడూ చేయరు. ఆ సందర్భంలో శత్రువును గుర్తించగలిగే శక్తిని మానసికంగా తెచ్చుకోవాలి. శత్రువుకు ఆలోచించే సమయం ఇవ్వకూడదనేది ప్రాథమిక అంశంగా జూడో నేర్చుకున్నా. ఇందుకు అవసరమైన శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంచుకున్నా. ఏడాది తర్వాత... చిన్నచిన్న పోటీలకు హాజరవ్వడం మొదలుపెట్టా’ అంటోంది సరిత.

విజేతగా నిలిచి...
క్రమంగా సరిత మెరుగైన ఫలితాలు అందుకోవడం ప్రారంభించింది. గోరఖ్‌పుర్‌లో జరిగిన ‘6వ నేషనల్‌ బ్లైండ్‌ అండ్‌ పారా జూడో ఛాంపియన్‌షిప్‌’ పోటీలో పాల్గొని జూనియర్‌ కేటగిరీలో రజత పతకం అందుకుంది. ఈ గెలుపు ఆమెను అంతర్జాతీయ స్థాయికి చేర్చింది. 2019లో లండన్‌లోని బర్మింగ్‌హాంలో ఏడో జాతీయ కామన్‌వెల్త్‌ జూడో ఛాంపియన్‌షిప్‌లో రజతం అందుకుంది. ‘అప్పటివరకూ కనీసం రైలు కూడా ఎక్కని నేను, విమానంలో లండన్‌కు వెళ్లడం మరవలేని జ్ఞాపకం’ అంటుంది సరిత. అదే ఏడాది హైదరాబాద్‌లో 8వ నేషనల్‌ బ్లైండ్‌ జూడో ఛాంపియన్‌షిప్‌లో, ఈ ఏడాది లఖ్‌నవూలో తొమ్మిదో నేషనల్‌ బ్లైండ్‌ జూడో ఛాంపియన్‌షిప్‌లోనూ వెండి పతకాల్ని అందుకుంది. ఇదంతా చదువును కొనసాగిస్తూనే. ప్రస్తుతం తను పీజీ చేస్తోంది. తనలాంటివారికి జూడోలో ఉచిత శిక్షణనూ అందిస్తోంది. అంధులైన తన ఇద్దరు తోబుట్టువులకూ ఈ విద్యను నేర్పుతోంది. మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుని కుటుంబాన్ని ఆదుకోవడం, 2024లో పారాలింపిక్స్‌లో బంగారు పతకాన్ని సాధించడమే లక్ష్యం అని చెబుతోంది సరిత.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి