close
Published : 15/04/2021 01:25 IST

కలగన్నారు... సాధించారు!

సివిల్స్‌ తర్వాత అదే స్థాయి పరీక్ష.. ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌ (ఈఎస్‌ఈ). దీన్ని ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీస్‌ (ఐఈఎస్‌) అనీ వ్యవహరిస్తారు. ఇంజినీరింగ్‌ విద్యార్థులు సాధించగల గొప్ప కెరియర్‌గా దీన్ని చెబుతారు. యూపీఎస్‌సీ నిర్వహించే దీని ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. మన తెలుగు అమ్మాయిలు లక్ష్మీ ప్రసన్న, మేఘన 2020 పరీక్షల్లో జాతీయ స్థాయిలో 38, 41 ర్యాంకులు సాధించారు. ఒకరు చివరి నిమిషం వరకూ రాయగలుగుతానో లేదో అని కంగారు పడితే.. మరొకరు రెండుసార్లు విఫలమయ్యారు. చివరికి పట్టుదలతో సాధించారు. ఆ విజయం గురించి.. వారి మాటల్లోనే!


సంతృప్తినిచ్చిన విజయమిది!
- ఊటుకూరి వీఎస్‌ఎస్‌ లక్ష్మీప్రసన్న

మాది హైదరాబాద్‌. మధ్యతరగతి కుటుంబం. నాన్న విద్యాసాగర్‌ ప్రైవేటు ఉద్యోగి. అమ్మ నాగలక్ష్మి గృహిణి. అక్క సౌజన్య ఉద్యోగి. చిన్నప్పటి నుంచీ ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాను. ఇంజినీరింగ్‌ వరకూ ఇది కొనసాగింది. ఇంజినీరింగ్‌లో ప్రభుత్వ స్కాలర్‌షిప్‌ అందుకున్నాను. చదువు పూర్తిచేయడంలో ఇది సాయపడింది. అందుకేనేమో చిన్నప్పటి నుంచీ దేశాభివృద్ధిలో నేనూ భాగమై, సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలన్నది నా కల. ఐఏఎస్‌లు సురభి గౌతమ్‌, సృష్టి జయంత్‌లు నాకు స్ఫూర్తి. నేను ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతున్నపుడు మా అక్క ద్వారా ఐఈఎస్‌ గురించి తెలిసింది. నా కలను దీని ద్వారా నెరవేర్చుకోగలను అనిపించింది.

ఇంజినీరింగ్‌ 2019లో పూర్తవగానే ఈ పరీక్షకు సన్నద్ధమవడం ప్రారంభించాను. గేట్‌లో అనుకున్నంత స్కోరు సాధించలేకపోవడం, కొవిడ్‌ కారణంగా మెయిన్స్‌ వాయిదా పడుతుండటం నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. దీంతో నిలకడను కొనసాగించలేకపోయాను. చివరికి పరీక్ష రోజు హైదరాబాద్‌లో వరదలు వచ్చాయి. పరీక్షహాలుకు చేరుకోవడమూ కష్టమైపోయింది. పరీక్ష రాయగలుగుతానో లేదో అని చాలా కంగారు పడ్డాను. నా కష్టం ఫలించింది. జాతీయ స్థాయిలో 38వ ర్యాంకు సాధించాను. అందుకే ఈ విజయం ఆనందంతోపాటు ఎంతో సంతృప్తినీ ఇచ్చింది. ఈ ప్రయాణంలో అమ్మానాన్నా, అక్కల ప్రోద్బలమూ ప్రధానమే.


 మూడో ప్రయత్నంలో...  
- మేఘనా సోనాజి

నాన్న కిషోర్‌, హైదరాబాద్‌ అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌. అమ్మ పద్మజ గృహిణి. మాది ఉమ్మడి కుటుంబం. చిన్నప్పటి నుంచీ నేను తెలివైన విద్యార్థినినే. ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరంలో ఐఈఎస్‌ గురించి తెలుసుకున్నాను. అప్పుడే రాయాలని నిర్ణయించేసుకున్నాను. కానీ సాధించగలుగుతానా లేదా అన్న చిన్న సందేహం. మా సీనియర్‌ జాతీయ స్థాయిలో 37వ ర్యాంకు సాధించారు. అది ఈ సవాలును స్వీకరించేలా ప్రేరేపించింది. చివరికి జాతీయస్థాయిలో 41వ ర్యాంకు వచ్చేలా చేసింది.

ఫలితాలు వచ్చినపుడు షాక్‌కు గురయ్యాను. ఇది నా మూడో ప్రయత్నం. మొదటిసారి ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరంలో రాశాను. ప్రిలిమ్స్‌కు కూడా అర్హత సాధించలేదు. క్యాంపస్‌ ఇంటర్వ్యూకు వెళ్లాలా మరోసారి ప్రయత్నించాలా అనే మీమాంసలో పడ్డాను. రిస్క్‌ తీసుకుని మళ్లీ చదివి, రాశాను. రెండోసారీ అదే ఫలితం. మా కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహం, సీనియర్‌ ఇచ్చిన ప్రేరణతో ఈసారి బలంగా ప్రయత్నించాను. చిన్న చిన్న అడ్డంకులూ వచ్చాయి. చివరికి సాధించాను. అందుకే ఈ ఫలితం మాటల్లో చెప్పలేనంత ఆనందాన్నిచ్చింది.


Advertisement

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి