Updated : 21/04/2021 00:31 IST

ఆ పిలుపు కోసం రెండేళ్లు ఎదురుచూశా...

అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మాయి.. అనుకోకుండా ప్రమాదానికి గురైంది. కళ్లు తెరవడానికే ఆరు నెలలు పట్టింది. అమ్మా.. అమ్మా అంటూ సందడి చేసేది అమ్మనే మర్చిపోయింది. కానీ ఆ తల్లి ఊరుకోలేదు.  మళ్లీ మాటలు నేర్పింది. అమ్మా అని పిలిపించుకుంది. తడబడుతున్న అడుగులను నృత్య ప్రదర్శన వరకు తీసుకొచ్చింది. ఇదంతా ఓ తల్లి మూడేళ్ల శ్రమ. ఈ క్రమంలో ఆమె పడ్డ ఆవేదనెంతో.  ఇంకా ఈ పయనం పూర్తవలేదు. అమ్మాయి పూర్తిగా కోలుకోలేదు. కానీ నమ్మకాన్ని మాత్రం కోల్పోనంటోంది. ఆ వేదన ఆమె మాటల్లోనే..
నా పేరు స్వాతి అనిల్‌. ముంబయికి సమీపంలోని కుర్లా మాది. మావారు అనిల్‌ వర్గిస్‌, వ్యాపారి. మాకో పాప నిర్మోహీ. తర్వాత బాబు. తను పుట్టినప్పుడు మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందనుకున్నాం. పిల్లలిద్దర్నీ చిన్నప్పుడే వారికిష్టమైన రంగాల్లో రాణించేలా ప్రోత్సహించా లనుకున్నాం. నిర్మోహీ డ్యాన్స్‌పై మక్కువ చూపిస్తే, నాలుగో ఏటే భరత నాట్యంలో చేర్పించాం. ఓవైపు చదువు, మరోవైపు నృత్యం నేర్చుకుంటూ చాలా చురుగ్గా ఉండేది. కాలం సాఫీగా గడచిపోతోంది. అది 2015, మార్చి 12. ఆ రోజును నా జీవితంలో మర్చిపోలేను. నిర్మోహీకి డిగ్రీ రెండో ఏడాది పరీక్షలు. సాయంత్రం ఇంటికి రావడానికి ఆటో దొరికిందా? అని అడగడానికి ఫోన్‌ చేశా. ఎవరో ఫోన్‌ తీశారు. తనకు యాక్సిడెంట్‌ అయిందన్నారు. తనను చేర్చిన నర్సింగ్‌ హోంకు పరుగెత్తా.
ప్రాణాపాయం తప్పింది... కానీ!
స్పృహలో లేని నిర్మోహీని పెద్దాసుపత్రికి తీసుకెళ్లమని డాక్టర్లు చెబుతుంటే ఏమీ అర్థం కాలేదు. ఒంటిపై చిన్న దెబ్బ కూడా లేదు. కానీ తలకు బలమైన గాయమవడంతో ప్రాణాపాయమని చెప్పారు. ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించాం. అర్ధరాత్రికల్లా కోమాలోకి వెళ్లిపోయింది. వెంటిలేటర్‌ పెట్టారు. పరిస్థితి విషమిస్తుండటంతో నరాల వైద్యనిపుణుడు డాక్టర్‌ విశ్వనాథన్‌ అయ్యర్‌ వచ్చి చూశారు. తక్షణం మెదడుకు సర్జరీ చేయకపోతే బతకదన్నారు. వెంటనే ‘స్కల్‌ ఓపెన్‌ సర్జరీ’ చేశారు. ‘నా బంగారు తల్లికి ఏమీ కాకూడదు. తను బతకాలి’ తెల్లార్లూ ఇదే జపించా. సర్జరీ బాగానే జరిగింది. ప్రాణానికేం ఫర్వాలేదు... కానీ కోమా నుంచి ఎప్పుడు బయటికొస్తుందో చెప్పలేమన్నారు. రేయింబవళ్లూ తన పక్కనే ఉండేదాన్ని. ఎన్నో వేదికలపై నాట్యం చేసిన నా చిట్టితల్లి అలా ఉండటం చూసి మనసంతా ఆవేదనతో నిండిపోయేది. కళ్లెప్పుడు తెరుస్తుందా అని ఎదురుచూశా.

60 రోజులకు
రెండునెలల తర్వాత ఓ రోజు ఉదయం కళ్లు తెరిచిన నిర్మోహీని చూసి చాలా సంతోషపడ్డా. మావైపు చూస్తున్న తన కళ్లలో ఏ కదలికా లేదు. నా గుండె పగిలింది. డాక్టర్లు, నర్సులు హడావుడిగా వచ్చారు. ఏవో మందులిచ్చి, నిద్రబుచ్చారు. నిర్మోహీ శరీరం పూర్తిగా చచ్చుపడిపోయిందని, తల భాగం మాత్రమే కదపగలదని చెప్పారు. నా కూతురు తిరిగి నడవగలిగితే చాలంటూ దేవుళ్లందరినీ మొక్కా. వారం రోజులకు మాపై తన చూపు నిలిపింది. నా గొంతు విని తల తిప్పింది.. కానీ గుర్తించలేకపోయింది. జ్ఞాపకశక్తి కోల్పోయిందన్నారు వైద్యులు. మేం చెప్పేది తనకు అర్థమయ్యేది కాదు. అప్పటికే తన మెదడుకు ఆరేడు సర్జరీలు జరిగాయి. చాలా ప్రయత్నాలు, సాధన చేశాం. ఆరు నెలల తర్వాత మా మాటలను అర్థం చేసుకునే స్థాయికి వచ్చింది. నేను నవ్వితే నిర్మోహీ తిరిగి నవ్విన రోజు నాకు పండగలా అనిపించింది.
పసిపాపలా..
నిర్మోహీకి ఫిజియోథెరపీ సూచించారు వైద్యులు. ఓ పక్క మెదడుకు శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. ఇద్దరు థెరపిస్టులు వచ్చి ఫిజియో మొదలుపెట్టారు. తను డ్యాన్సర్‌ అని తెలుసుకుని తన పరిస్థితి చూసి వాళ్లూ చలించిపోయారు. తనను ఎలా అయినా బాగుచేయాలని వారొక ప్రయోగం చేశారు. భరతనాట్యం ప్రాథమిక అంశాలను, కొన్ని భంగిమలను వాళ్లు నేర్చుకుని, వాటిలాగే నిర్మోహీతో వ్యాయామాలు చేయించేవారు. ఫిజియో థెరపీ చేస్తుంటే కీళ్లు, కండరాలు, ఎముకలన్నీ విపరీతంగా నొప్పిగా ఉంటాయని, అయితే తన మెదడుకు మేజర్‌ సర్జరీలు జరుగుతుండటంతో నొప్పి తెలీదని వైద్యులు చెప్పారు. నెమ్మదిగా ముగ్గురి సాయంతో లేచి నుంచున్నా.. నిమిషానికే కూలబడి పోయేది. స్పీచ్‌థెరపీలో భాగంగా, జ్ఞాపకశక్తిని తిరిగి తేవడానికి ఏబీసీడీలు, అంకెలు, ఎక్కాలు వంటివన్నీ నేర్పడం మొదలుపెట్టాం. నా కూతురు మూడేళ్ల పసిపాపలా మారిపోయింది.
తన నోటి వెంట అమ్మా అనే పిలుపు మళ్లీ ఎప్పుడు వింటానా అని ఆశగా చూసేదాన్ని. ‘అమ్మని’ అని చెప్పినా అర్థమయ్యేది కాదు. మొత్తమ్మీద రెండేళ్లు పట్టింది. 2017లో ఓరోజు అమ్మా అని పిలవగానే నా దుఃఖాన్ని ఆపుకోలేకపోయా. ఈ పిలుపు కోసం ఎంతగా ఎదురు చూశానో. తర్వాత ఏడాదికి తన పేరు పూర్తిగా చెప్పగలిగింది.

మళ్లీ గజ్జెకట్టింది...
నిర్మోహీ పదోఏట నుంచి నృత్య ప్రదర్శనలు ప్రారంభించింది. ఈ ప్రమాదం జరిగిన మూడేళ్లకు 2018, ఏప్రిల్‌లో తిరిగి ప్రదర్శన ఇచ్చే స్థాయికి చేరింది. దీనివెనుక తన గురువు గీతా వెంకటేశ్వర్‌ కృషి ఎంతో ఉంది. ఓవైపు సర్జరీలు, ఫిజియోథెరపీ, స్పీచ్‌థెరపీ జరుగుతుండగానే, గురువు చెప్పే పాఠాలను సాధన చేసేది నిర్మోహీ. తనకు నృత్యకళపై ఉన్న విపరీతమైన ఆసక్తి మాత్రమే తనను తిరిగి వేదికపై అభినయించేలా చేయగలిగింది. డాక్టర్లూ ఇదే మాట చెప్పారు. 2019లో షిర్డీ ఆలయంలో, ముంబయిలోని పలు చోట్ల నిర్మోహీ నృత్య ప్రదర్శనలిచ్చింది. తర్వాత కొవిడ్‌ కారణంగా ఆన్‌లైన్‌లో ప్రదర్శనలిస్తోంది. ఇప్పటివరకూ 12 సర్జరీలు జరిగాయి. మెదడులో ఒకచోట చిన్న ఖాళీ ఉంది. దానివల్ల భయంకరమైన తలనొప్పితో బాధపడుతోంది. ఈ ఏడాది మరొక సర్జరీ చేసి దాన్ని సరిచేస్తారు. నా తోడ్పాటు, ప్రోత్సాహం మాత్రమే కాదు... డాక్టర్లు, థెరపిస్టుల రూపంలో మానవతామూర్తుల సాయమూ తోడయ్యింది. తను కూడా ఎంతో బాధ, నొప్పి, మతిమరుపు,    సహకరించని శరీరం... వంటి సమస్యలెన్ని ఉన్నా...  పట్టుదలతో నేర్చుకుంది. మాట ఇప్పటికీ పూర్తిగా రాలేదు. దాన్నీ అధిగమించగలదని నా నమ్మకం.    నా బంగారు తల్లి లక్ష్యసాధనలో ఎంతటి కష్టానికైనా నేను సిద్ధంగా ఉన్నా.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి