Published : 21/04/2021 00:22 IST

మార్పే లక్ష్యం.. పరుగే మార్గం!


16 రోజుల్లో 720 కి.మీ...
87 రోజుల్లో 4000 కి.మీ...
ఏదో వాహనం ప్రయాణించిన లెక్కలు కావివి... ఒక వ్యక్తి.. అందునా ఓ మహిళ పరిగెత్తిన దూరాలివి... దీనికే ఆశ్చర్యపోతున్నారా? ఈసారి లక్ష్యం మరింత పెరిగింది... 110 రోజుల్లో 6000 కిలోమీటర్లు పూర్తిచేసి, రికార్డులను బద్దలు కొట్టింది... ఆమే అల్ట్రా రన్నర్‌.. సుఫియా ఖాన్‌. ఈ పరుగుల యంత్రం విశేషాలు....

అజ్‌మేర్‌కి చెందిన సుఫియా ఖాన్‌ దిల్లీలో స్థిరపడింది. మొదట్నుంచీ ఆటలపై ఆసక్తేమీ లేదు. బ్యాచిలర్స్‌ తర్వాత ఏవియేషన్‌లో డిప్లొమా చేసింది. న్యూదిల్లీలోని గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గ్రౌండ్‌ స్టాఫ్‌గా పదేళ్ల పాటు ఉద్యోగం చేసింది. తరచూ మారే షిఫ్టుల కారణంగా ఆరోగ్యంపై శ్రద్ధ చూపే అవకాశం లేకపోయింది. తన భర్త సలహాతో సమయం ఉన్నప్పుడల్లా పరిగెత్తడం ప్రారంభించింది. అది వ్యసనంగా మారిపోయింది. చివరికి తను ఎక్కడిదాకా వెళ్లిందంటే... మారథాన్‌లతో ప్రారంభించి, అల్ట్రా రన్నర్‌గా మారిపోయింది.
మొదటిసారి 2018లో దిల్లీ- జయపుర- ఆగ్రా-దిల్లీ గోల్డెన్‌ ట్రయాంగిల్‌లో 720 కి.మీ.ను 16 రోజుల్లో ముగించింది. మరుసటి ఏడాది కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు 4000 కి.మీ.లను 87 రోజుల 2.17 గంటల్లో పూర్తిచేసి, గిన్నిస్‌ రికార్డు సాధించింది. తాజాగా గ్రేట్‌ ఇండియా క్వాడ్రిలేట్రల్‌ రన్‌ను పూర్తిచేసింది. ఇది దేశంలోని వివిధ నగరాలను కలుపుతూ సాగే 6010 కి.మీ.ల హైవే నెట్‌వర్క్‌. గతంలో దీన్నే పుణెకు చెందిన మిషెల్‌ కకడే 190 రోజుల్లో పూర్తిచేసి, గిన్నిస్‌ రికార్డు సాధించింది. సుఫియా దీన్ని ఈ ఏడాది ఏప్రిల్‌ 6న 110 రోజుల 23 గంటల్లోనే పూర్తి చేసింది. అంటే 82 రోజుల తక్కువ సమయంలోనే గత రికార్డును బద్దలు కొట్టింది. ఇదంతా చేసినపుడు తనతో ప్రత్యేక బృందమేమీ లేదు. తన భర్త, సైక్లిస్ట్‌ వికాస్‌ మాత్రమే తోడున్నారు.  

సులువేమీ కాదు.. రోజుకు 55 కి.మీ.ను రెండు దఫాలు ఉదయం 35-40 కి.మీ. మధ్యాహ్నం విరామం తర్వాత మిగతా 15 కి.మీ. చొప్పున పూర్తిచేసేది. తెల్లవారుజామున 4.30 గం.కు తన పరుగు ప్రారంభమయ్యేది. నిజానికి గత ఏడాదే దీన్ని మొదలుపెట్టింది. దిల్లీ నుంచి మహారాష్ట్ర చేరుకునేసరికి లాక్‌డౌన్‌ రావడంతో అర్ధాంతరంగా ఆగిపోయింది. రెండు నెలలు అక్కడి సరిహద్దులో టెంట్‌లోనే ఉండిపోయింది. ఆపై ఇంటికి చేరుకుని తిరిగి 2020 డిసెంబరు 16న మళ్లీ ప్రారంభించింది. ఆ సమయంలో ఫుడ్‌ పాయిజనింగ్‌ అయినా, సెలైన్‌ ఎక్కించుకోవాల్సి వచ్చినా పరుగు మాత్రం ఆపలేదు. సానుకూలంగా ఉండటం వల్లే ఇది సాధ్యమైందంటోంది సుఫియా.
శరీరాన్ని కష్టపెడుతూ ఇన్ని దూరాలు పరుగెత్తడం ఎందుకంటే? రికార్డులకు ఎక్కడానికో, వాటిని బద్దలు కొట్టడానికో కాదంటోంది. సమాజంలో మానవత్వం, ఉమ్మడితత్వం, శాంతి, సమానత్వాలను పెంపొందించడం తన అభిమతమంటుంది. ఇందులో భాగంగానే పరుగు మధ్యలో మనుషుల చర్యలవల్ల పర్యావరణంపై పడే దుష్ప్రభావం వంటి ఇతర అంశాలపై స్థానిక ప్రజలతో మాట్లాడుతుంది. తన నమ్మకాలు, భావోద్వేగాలను పంచుకోవడానికి ఇదొక్కటే మార్గమని నమ్ముతా అని చెబుతోంది. వివిధ కఠిన పరిస్థితుల్లో తను ఎంతవరకూ ముందుకు సాగగలనో పరీక్షించుకోవడమూ మరో కారణమంటోంది. ‘ఒక లక్ష్యంతో చేసే పరుగు తప్పక ప్రభావం చూపుతుంది. సమాజంలో మనం చూడాలనుకునే అర్థవంతమైన మార్పులను మంచి మనసుతో సూచించడం, పంచుకోవడం చేస్తే తప్పక ఫలిస్తాయి. అందుకు నేను ఎంచుకున్న మార్గమిది’ అంటోంది సుఫియా ఖాన్‌.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి