Published : 24/04/2021 00:54 IST

వృథా మీద ఉద్యమం!

భవిష్యత్తులో యుద్ధాలు నీటికోసం జరుగుతాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నీటి పరిరక్షణ కోసం ఉద్యమిస్తోంది గర్విత గులాటి. బెంగళూరుకు చెందిన ఈ అమ్మాయి ‘వై వేస్ట్‌’ సంస్థను స్థాపించి దేశ వ్యాప్తంగా యువతను భాగస్వాములను చేస్తోంది.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున గర్విత స్కూల్లో అవగాహన కార్యక్రమం జరిగింది. అందులో దేశంలో ఏటా రెస్టారెంట్ల నుంచే కోటీ నలభై లక్షల లీటర్ల నీరు వృథా అవుతోందని చెప్పారు. అది విన్న తను ఆశ్చర్యపోయింది. ఆమె స్నేహితురాలు పూజ స్కూల్‌ పరిసర ప్రాంతాల్లో విచ్చలవిడిగా చెత్త పారేయడం చూసి ఆందోళన చెందింది. నీటి పరిరక్షణ, పర్యావరణ పరిశుభ్రత గురించి ఏదైనా చెయ్యాలని వారిద్దరూ అనుకున్నారు. టీచర్‌తో చెబితే మీరే ఎందుకు అవగాహన కల్పించకూడదని అన్నారు. అలా 2015లో ఉద్భవించింది ‘వై వేస్ట్‌’ స్వచ్ఛంద సంస్థ.
ఛేంజ్‌ మేకర్‌
‘సగం గ్లాసు నీరు’... ఇదే ‘వై వేస్ట్‌’ సంస్థ నినాదం. సాధారణంగా రెస్టరెంట్లలో గ్లాసు నిండా నీరు పోస్తారు. చాలా మంది అందులో సగమే తాగుతారు. మిగిలింది వృథానే. దీన్ని నివారించేందుకు గర్విత బృందం బెంగళూరులోని రెస్టరెంట్లకి వెళ్లి నీటి పొదుపు మీద నిర్వాహకులు, వెయిటర్లకు అవగాహన కల్పించింది. నీటి ప్రాముఖ్యత గురించి తెలియ జెబుతూ గ్లాసుల మీద సగానికి స్టిక్కర్లు, గోడల మీద పోస్టర్లు అంటించింది. క్రమంగా ‘సగం గ్లాసు నీరు’ నినాదం దేశమంతా పాకింది. ఆమె చొరవను బయోకాన్‌ బయో టెక్నాలజీ కంపెనీ ఛైర్‌పర్సన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కిరణ్‌ మజుందార్‌ షా ట్విటర్‌లో మెచ్చుకున్నారు. బీబీసీ ఈమెను భారత గ్రెటా థెన్‌బర్గ్‌గా అభివర్ణించింది. తన కృషికిగానూ 2018లో పద్దెనిమిదేళ్ల వయసులో ‘గ్లోబల్‌ ఛేంచ్‌ మేకర్‌’ టైటిల్‌ని సాధించింది గర్విత. 42 దేశాల నుంచి 60 మందిని ఈ టైటిల్‌కు ఎంపిక చేయగా భారత్‌ నుంచి గర్విత ఒక్కతే! సామాజిక ఆవిష్కర్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సంబంధించి ప్రపంచ అతిపెద్ద నెట్‌వర్క్‌ ఆశోకా ఇనోవేటర్స్‌ నుంచి అశోకా యూత్‌ వెంచరర్‌గా కూడా నిలిచింది గర్విత. ఇటీవలే షాన్‌ మెండ్స్‌ ఫౌండేషన్‌ వండర్‌ గ్రాంట్‌ సాధించింది. 2020లో స్ఫూర్తిదాయక యువతకు అందించే డయానా పురస్కారాన్ని అందుకుంది.
‘వై వేస్ట్‌’ సంస్థ విద్యార్థి బృందంతో కలిసి పర్యావరణ పరిరక్షణ మీద పిల్లల పుస్తకాన్ని ముద్రిస్తోంది. నీటి వాడకం, సంరక్షణ చిట్కాలు తెలియజెప్పడానికి ‘వై వేస్ట్‌’ యాప్‌ని అందుబాటులోకి తెచ్చింది. స్కూళ్లు, కాలేజీలు, ఎన్‌జీవోలు, ఆఫీసుల్లో వర్క్‌షాపులు ఏర్పాటు చేస్తోంది. దేశవ్యాప్తంగా లక్ష రెస్టరెంట్లకు ‘సగం గ్లాసు నీరు’ నినాదాన్ని తీసుకెళ్లింది ‘వై వేస్ట్‌’ సంస్థ. ‘వై వేస్ట్‌’కి పెద్ద సంఖ్యలో వలంటీర్లు ఉన్నారు. ‘ప్రపంచాన్ని మార్చడంలో యువత శక్తిని మేం గ్రహించాం. అదే నమ్మకంతో ముందుకు సాగుతున్నాం. దాహంతో ఉన్న వ్యక్తికి బస్తా బంగారం కన్నా ఒక్క నీటి చుక్క చాలా అమూల్యమైంది. ప్రపంచ జనాభా పెరుగుతోంది. నీటి వనరులు తగ్గుతున్నాయి. ఎంతో మంది తాగడానికి నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ నీటి ప్రాముఖ్యతని గుర్తించి, దాని పరిరక్షణకు మాతో చేతులు కలపాలన్నదే మా ధ్యేయం’ అంటోంది గర్విత.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి