Updated : 30/04/2021 02:05 IST

తీరాలకు వనహారాలను అల్లుతూ..!

పీహెచ్‌డీ చేసినా తగిన ఉద్యోగావకాశాలు రాలేదామెకు...అయినా నిరాశపడలేదు. తన నైపుణ్యాలనే ఊతంగా కొత్త ఆవిష్కరణలు చేశారు దిట్టకవి సాయిరమ్య సుజన. కాలుష్యాన్నీ, ఉప్పుగాలులనీ తట్టుకుని.. 90 రోజులు నీళ్లు లేకపోయినా బతికేలా ఆమె తయారుచేసిన మొక్కలు ప్రపంచ బ్యాంకు ప్రశంసలనే కాదు మరిన్ని అవకాశాలనూ అందించాయి. అవేంటో తెలుసుకుందాం రండి...

మాది విశాఖపట్నం. నాన్న దిట్టకవి సుభాష్‌ బ్యాంకు మేనేజర్‌.. అమ్మ టీచర్‌. వాళ్ల స్ఫూర్తితోనే పరిశోధనా రంగంలో అడుగుపెట్టాను. తమిళనాడులోని శాస్త్ర విశ్వవిద్యాలయం నుంచి బయోటెక్నాలజీలో పీజీ పూర్తిచేసిన తర్వాత గీతమ్స్‌లో ప్లాంట్‌ అండ్‌ మెడికల్‌ బయోటెక్నాలజీలో పీహెచ్‌డీ చేశాను. మొక్కల్లో కాలుష్యాన్ని అదుపు చేసే సామర్థ్యాన్ని రెట్టింపు చేయడమే నా పరిశోధనల లక్ష్యం. ఇందుకోసం ‘ఇంటిగ్రేటెడ్‌ న్యూట్రిషన్‌ మేనేజ్‌మెంట్‌’ అనే విధానాన్ని ఎంచుకున్నాను. అందులో భాగంగా పైసోనియా వంటి ఎంపిక చేసిన 20 రకాల మొక్కలకి ప్రత్యేక పోషకాలని అందించి అవి కాలుష్యాన్ని ఏమేరకు అదుపు చేస్తున్నాయో గమనించాను. ఇందుకు విశాఖ నగరాన్నే వేదికగా చేసుకున్నా. మూడేళ్లపాటు ప్రయోగాత్మకంగా నర్సరీలు, పోర్టు ఏరియాల్లో పోషకాలు అందించిన మొక్కల్ని పెంచాను. అవి సత్ఫలితాలనిచ్చాయి. ముఖ్యంగా పైసోనియా మొక్క అద్భుతమైన ఫలితాలని సాధించి పెట్టింది. ఈ ఆవిష్కరణకు నాకు మేధోసంపత్తి హక్కులు లభించడమే కాకుండా ప్రపంచబ్యాంకు ప్రశంసలూ అందాయి. విశాఖలోని ‘కైలాసగిరి పునరుద్ధరణ ప్రాజెక్టు’లో ఈ మొక్కల్ని పెంచాలని అధికారులు నిర్ణయించారు.
ఎక్కడైనా బతికేస్తాయి...
నా పరిశోధనలు ప్రజలకు చేరువ కావాలనే లక్ష్యంతో మావారు తేజతో కలిసి ఎస్‌అండ్‌టీ పేరుతో స్టార్టప్‌ ప్రారంభించాను. ఆయన సివిల్‌ ఇంజినీర్‌. విదేశాల్లోనూ ఎన్నో ప్రాజెక్టులు చేపట్టిన అనుభవం ఉంది. మేం మొదట చేపట్టిన ప్రాజెక్టు వైజాగ్‌ బీచ్‌ ప్రాంతంలో ఉప్పుగాలులని తట్టుకునేలా మొక్కలని పెంచడం. ఒకసారి అధికారులతో మాట్లాడుతున్నప్పుడు సముద్రతీర ప్రాంతాల్లో ఉండే మొక్కల్ని బతికించడం కష్టమవుతోందని తెలిసింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అవి కొన్ని నెలలకే చచ్చిపోతున్నాయని చెప్పారు. దాన్ని సవాలుగా తీసుకొని కొన్ని నెలలపాటు పరిశోధనలు చేశా. మొక్కలకి ప్రత్యేకమైన పోషకాలని అందించడం ద్వారా ఉప్పుగాలుల ప్రభావాన్ని తట్టుకుని పెరిగేలా వాటిల్లో మార్పులు తీసుకొచ్చాను. ఈ పద్ధతిలో ప్రయోగాత్మకంగా విశాఖ బీచ్‌ రోడ్డులో రెండు కిలోమీటర్ల మేర పెంచాం. మొక్కలకి రాత్రిపూట కొన్ని ట్రీట్‌మెంట్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం కొన్ని నెలల పాటు అర్ధరాత్రులే పనిచేశాను. ‘హమ్మయ్య పనయ్యింది. ఇక ఫలితాలు చూడాలి’ అనుకునేటప్పటికి లాక్‌డౌన్‌ వచ్చిపడింది. మొక్కలకు నీళ్లు పోసే వాహనాలు... శానిటైజేషన్‌ పనిలో బిజీ అవ్వడంతో వాటికి నీళ్లు లేవు. నన్ను నమ్మి ఈ ప్రాజెక్టు అప్పగిస్తే... ఇలా అయ్యిందేంటని చాలా బాధపడ్డాను. 90 రోజులు గడిచాయి. వెళ్లిచూస్తే... మేం నాటిన మొక్కలు పచ్చగా, ఆరోగ్యంగా పలకరించాయి. ఈ విషయం తెలిసిన భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ మరో పెద్ద బాధ్యతను మాకు అప్పగించింది. అది అనకాపల్లి నుంచి ఆనందపురం, రణస్థలం నుంచి నరసన్నపేట వరకూ 150 కిలోమీటర్ల మేరఉన్న ఆరు వరుసల రహదారిని నేను తయారుచేసిన మొక్కలతో సుందరీకరణ చర్యలు చేపట్టాలి. ఇదే నా ముందున్న పెద్ద బాధ్యత. దీంతోపాటు పైసోనియా మొక్కలతో పోషకాహారం తయారుచేసి గిరిజనులకు ఆహారంగా అందివ్వాలని చూస్తున్నా.
ఉపాధి కల్పిస్తూ..
నేను పీహెచ్‌డీ చేసిన తర్వాత తగిన ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేశాను. నా అర్హతకు తగినవి కాకుండా చిన్న ఉద్యోగాలు వచ్చేవి. ఈ క్రమంలో మన చదువులు తగిన నైపుణ్యాలని అందిస్తున్నాయా అని ఆలోచించాను. లేదనే అనిపించింది. అందుకే నైపుణ్యాలని అందించేలా ఏడాది పాటు శ్రమించి ఈటీఎం పేరుతో ఒక ఎడ్యూయాప్‌ని రూపొందించాను. ఆధునిక అవసరాలని దృష్టిలో పెట్టుకుని పిల్లలకు విద్యాబోధనలో సహకరించే ఈ యాప్‌ని ప్రస్తుతం పది ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా అందిస్తున్నాం. హాజరు, హోంవర్క్‌ మానిటరింగ్‌ వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి. ఉపాధి అవకాశాలు, ఇంక్యుబేషన్‌ సదుపాయాలను జోడించి త్వరలో ఈ యాప్‌ని డిగ్రీ, పీజీ విద్యార్థులకు చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఏర్పరచుకున్న లక్ష్యాలని... ఎప్పటికప్పుడు తరచి చూసుకుంటూ, పరిస్థితులకు తగ్గట్టుగా మనల్ని మనం తీర్చిదిద్దు కుంటేనే విజయాలని సాధించగలుగుతాం.

- రావివలస సురేశ్‌, విశాఖపట్నం


మహిళలు తాము కన్న కలలను సాకారం చేసుకోవడమే ఒక మహాద్భుతం.

- ఓప్రా విన్‌ఫ్రే, అమెరికన్‌ నటి, యాంకర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి