Published : 02/05/2021 00:52 IST

ఆకలిపై ఓ అన్నపూర్ణ పోరాటం

డబ్బు తీసుకుని వాళ్లు కోరింది వండిపెట్టడం... ఆమె వ్యాపారం  డబ్బులు ఇచ్చుకోలేకపోయినా ఆమె వండిన వంట తిని కళ్లతోనే వాళ్లు చెప్పే కృతజ్ఞతల్లో ఆమె సంతోషాన్ని, సంతృప్తినీ వెతుక్కుంది.  దిల్లీకి చెందిన మనికాబద్వార్‌ నడిపే ‘రసోయిఆన్‌వీల్స్‌’ రోజూ వేలమంది ఆకలి తీరుస్తోంది..  
దిల్లీకి చెందిన మనికాబద్వార్‌ సొంతంగా ఒక క్యాటరింగ్‌ సర్వీసుని నిర్వహించేది. ఐదేళ్ల క్రితం తన రెస్టరెంట్‌కి వెళ్లే దారిలో ఎదురైన ఓ సంఘటన ఆమెని కదిలించి వేసింది. ఆ సమయంలో తన ప్రతిస్పందన జీవితాన్ని మార్చేస్తుందని ఆవిడ ఊహించి ఉండదు. రోడ్డు వారగా ఓ 50 మంది పిల్లలు... వాళ్లకు పాఠాలు చెబుతూ ఓ టీచరమ్మ కనిపించారు. ఆరాతీస్తే... వాళ్లంతా దగ్గర్లోని బస్తీపిల్లలని వారిలో చాలామందికి సరైన తిండికూడా లేక అల్లాడుతున్నారని ఆ టీచరమ్మ చెప్పింది. మనికా గుండె బరువెక్కింది. తన రెస్టరెంట్‌కి వెళ్తూనే... ఆ చిన్నారులందరికీ వేడివేడి భోజనాన్ని పంపించింది. రోజులో కనీసం ఓ రొట్టె కూడా దొరకని వాళ్లెందరో ఉన్నారు. వాళ్లందరి ఆకలీ తను తీర్చలేకపోవచ్చు. కనీసం తన చుట్టుపక్కలవాళ్లకైనా సేవ చేయాలనుకుంది మనికా. ఆ ఆలోచనే ఈ రోజు వేలమందికి భోజనం అందేలా చేస్తోంది. ఆమె ప్రారంభించిన ‘రసోయీ ఆన్‌ వీల్స్‌’ సేవలు ఇప్పుడు స్థానిక అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకూ అందుతున్నాయి. మంచి భోజనంతోపాటు తాజా పండ్లు కూడా ఉండేలా చూస్తోంది. ‘పేరుకు పెట్టాం అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. పోషకవిలువలున్న ఆహారాన్ని అందించడం నా లక్ష్యం. మా సిబ్బంది వేకువజామున మూడు గంటలకు వంట మొదలుపెడతారు. ఉదయం తొమ్మిదికల్లా పూర్తిచేస్తారు. వేడివేడిగా బాక్సుల్లో నింపేస్తాం. ముందు రోజే గుర్తించిన ప్రాంతాలకు మా వాలంటీర్లు వాహనాల్లో వెళ్లి అందరికీ అందిస్తారు’ అని వివరించింది మనికా.  

మొదటిసారి యాభై మంది చిన్నారుల కడుపు నింపినప్పుడు వారి కళ్లలో కనిపించిన తృప్తి, ఆనందం... మరెంతోమందికి సేవచేయాలనే స్ఫూర్తిని నాలో నింపాయి. సగం ఆకలితో రోజులు వెళ్లదీస్తున్న వారిని వెతికి పట్టుకునేందుకు బస్తీలన్నీ తిరిగేదాన్ని. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల వివరాలను సేకరించే దాన్ని. అక్కడికి మా ‘రసోయీ ఆన్‌ వీల్స్‌’ వాహనాలు పరుగులు పెడతాయి. ఆసుపత్రుల్లో చివరి రోజులు గడుపుతున్న క్యాన్సర్‌ బాధిత చిన్నారులకూ రోజూ ఆహారాన్ని పంపుతున్నాం. ‘దీదీ.. నాలుగు రోజుల నుంచి అన్నం తినలేదని కొందరు పిల్లలు చెబుతుంటే నా కళ్లల్లో నీళ్లు తిరిగేవి. మా సేవ గురించి తెలుసుకున్న కొందరు ఆర్థికంగా చేయూతను అందిస్తున్నారు. అప్పుడప్పుడూ కార్పొరేట్‌ సంస్థలూ ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు రోజుకి 1500 లంచ్‌ బాక్సులు సిద్ధం చేస్తున్నాం. ప్రస్తుతం గుర్గాం నుంచి దిల్లీలోని కొన్ని ప్రాంతాలకు మా వాహనం ప్రయాణిస్తోంది. కొన్ని చోట్లకు కిచెన్‌ ఆన్‌ వీల్స్‌గా వెళ్లి, అక్కడ ఉన్నవారికి అప్పటికప్పుడే వండి వడ్డిస్తున్నాం’ అని చెబుతోంది మనికాబద్వార్‌.  
ఈ సంస్థలో న్యాయవాదులు, వ్యాపారవేత్తలు, సామాన్యులు వాలంటీర్లుగా ముందుకు వచ్చి తమదైన చేయూతనందిస్తున్నారు. పేద కుటుంబాలను గుర్తించి వారికి నెలకు సరిపోయే ఆహారపదార్థాలను అందిస్తున్నారు. వీళ్లలో చాలామంది అవసరమైన వారికి ప్లాస్మాదానం ఇవ్వడానికి ముందుకొచ్చారు. అలా రసోయి ఆన్‌ వీల్స్‌ సభ్యులు దిల్లీ ముఖ్యమంత్రి ప్రశంసలు సైతం అందుకున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి