ఆ అమ్మదే అసలైన విజయం

అనారోగ్యాలను అధిగమించి విజయం సాధించడం పెద్ద విశేషం కాదనిపిస్తుంది, ప్రణవ్‌ బక్షీ గురించి విన్నప్పుడు. అతను తన చెప్పుచేతల్లో ఉండని ఆటిజాన్నే ఎదిరించాడు మరి. అలాంటి వైకల్యం ఉన్నా సూపర్‌

Updated : 26 Oct 2022 15:19 IST

అనారోగ్యాలను అధిగమించి విజయం సాధించడం పెద్ద విశేషం కాదనిపిస్తుంది, ప్రణవ్‌ బక్షీ గురించి విన్నప్పుడు. అతను తన చెప్పుచేతల్లో ఉండని ఆటిజాన్నే ఎదిరించాడు మరి. అలాంటి వైకల్యం ఉన్నా సూపర్‌ మోడల్‌గా ఎదిగి ఆశ్చర్యపరిచాడు. ఇది నమ్మశక్యం కాని నిజం. దీని వెనుక అతని తల్లి అనుపమా బక్షి ఎనలేని శ్రమ, నిరంతర కృషి ఉన్నాయి...
21 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే నెలలో ఒక అందమైన పిల్లాడికి జన్మనిచ్చింది అనుపమ. ప్రణవ్‌ పుట్టింది మొదలు ఆరోగ్య సమస్యలే. ప్రతి నిత్యం వైద్యులను సంప్రదిస్తూ చికిత్స చేయించేది. స్పష్టంగా మాట్లాడలేడు. తిన్నగా చూడలేడు. మనుషుల్నీ వస్తువుల్నీ గుర్తించలేడు. అకారణ విషయాలకు విపరీతంగా స్పందిస్తాడు. ఇతరుల మాటలను బిగ్గరగా పదేపదే వల్లిస్తుంటాడు. రెండేళ్ల వయసులో బుద్ధిమాంద్యతగా (ఆటిజం) తేలింది. అది విని అనుపమ విషాదంలో కూరుకుపోలేదు. ఆటిజం గురించి క్షుణ్ణంగా చదివి తెలుసుకుంది. దాన్నుంచి ఎలా బయటకు తేవచ్చో ఆలోచించింది. ‘కొడుకు సంతోషంగా ఉండాలి, ఎక్కడా భంగపడకూడదు’ అనుకుంది. ఐదేళ్ల వయసులో ప్రణవ్‌ ప్రవర్తనలో సమస్యలు తలెత్తాయి. ‘ఉన్న పరిస్థితికి బాధపడకూడదు, డీల్‌ చేయడం నేర్చుకోవాలి’ అంటూ పదేపదే చెప్పేది. స్పీచ్‌ థెరపీ ఇప్పిస్తూ, అవసరమైన చికిత్సలన్నీ చేయిస్తూ, నిరంతరం ధైర్యం చెప్పేది. ప్రోత్సహించేది. కొడుకు కోసం తల్లి, సోదరి, సోదరులతో ఒక సమాంతర ప్రపంచాన్ని సృష్టించింది. ఘోరమైన సమస్యలతో వాళ్లు అనుభవించే వేదన, సందర్భానికి తగిన నిర్ణయాలు తీసుకోవడం లాంటివన్నీ విడమర్చి చెప్పేది. అర్థమయ్యేలా ఓర్పుగా బోధపరిచేది. ఇలాంటి సామాజిక ఇతివృత్తాలు, భావోద్వేగాల విన్యాసాలూ వ్యాయామాలూ ప్రణవ్‌ మీద బాగానే పనిచేశాయి.

అతను ఎదిగే క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాడు. కానీ తల్లి తర్ఫీదులో, ఆమె కల్పించిన ఆరోగ్యకరమైన వాతావరణంలో తన సమస్యలను అధిగమించగలిగాడు. ఇప్పుడతన్ని ఏవీ, ఎప్పుడూ ఇబ్బందిపెట్టడంలేదు. సుఖంగా, సౌఖ్యంగా జీవించే శక్తియుక్తులను అలవరచుకోగలిగాడు. బుద్ధిమాంద్యత ఉన్నప్పటికీ ప్రణవ్‌లో చిన్నతనం నుంచీ సృజనాత్మకత కనిపించేది. సంగీతమంటే ఇష్టం, బొమ్మలంటే మక్కువ. వక్తగా వేదిక ఎక్కుతాడు. గోల్ఫ్‌ ఆడతాడు. ఫొటోలు తీస్తాడు. ప్రయాణాలిష్టం. ఈ సరదాలన్నీ ఒక ఎత్తయితే తొలిసారి బెంగళూరు సిటీ మాల్‌లో 500 మందితో పోటీలో నెగ్గి ర్యాంప్‌ వాక్‌ చేశాడు. అలా మోడలింగ్‌ ప్రారంభించాడు. ఇక ఇప్పుడు సూపర్‌ మోడల్‌గా ఎదిగి కితాబులందుకుంటున్నాడు. ఆ విజయమంతా తెర వెనుకనున్న అతని తల్లిదే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్