ఆశల ఊతం... స్ఫూర్తి గీతం

క్యాన్సర్‌.. రెండుసార్లు దాడిచేసినా తట్టుకుంది. ప్రాణ సఖుడైన భర్తను మృత్యువు కబళించినా దిగమింగింది. జీవనసమరంలో తాను నెగ్గి ఎందరికో స్ఫూర్తినిస్తోంది. పది బెస్ట్‌సెల్లర్‌ బుక్స్‌తో ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకొన్న నీలమ్‌కుమార్‌ జీవనయానం ఇదీ...

Published : 13 May 2021 00:32 IST

క్యాన్సర్‌.. రెండుసార్లు దాడిచేసినా తట్టుకుంది. ప్రాణ సఖుడైన భర్తను మృత్యువు కబళించినా దిగమింగింది. జీవనసమరంలో తాను నెగ్గి ఎందరికో స్ఫూర్తినిస్తోంది. పది బెస్ట్‌సెల్లర్‌ బుక్స్‌తో ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకొన్న నీలమ్‌కుమార్‌ జీవనయానం ఇదీ...
నీలంకుమార్‌ బాల్యం రష్యాలో గడిచింది. ప్రకృతి నుంచి పాఠాలు నేర్పిన మాస్కో స్కూలు ఆమెకెంతో నచ్చేది. కుటుంబం భారత్‌కు తిరిగొచ్చాక సాహిత్యంలో డిగ్రీ చేసి జర్నలిజం చదివేందుకు అమెరికా వెళ్లింది. పత్రికలకు రాస్తూ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజంలో మాస్టర్స్‌ చేసింది. పంతొమ్మిదేళ్లకే విశ్వమణికుమార్‌ను ప్రేమించి పెళ్లాడింది. వెంటనే ఇద్దరు పిల్లలు. ఆపైన స్వదేశానికి తిరిగొచ్చారు. పిల్లలతో కుదరక ఉద్యోగం జోలికెళ్లలేదు. పత్రికలకు కాలమ్స్‌ రాసేది.
పాటలా సాగుతున్న జీవితంలో రెండు అపశృతులు.. తనకు బ్రెస్ట్‌క్యాన్సరని తెలిసి కుమిలిపోతుండగానే గుండెపోటుతో భర్త మరణం. ‘శారీరకంగా దృఢంగా ఉండే భర్త నలభై దాటకుండానే వెళ్లిపోవడమేంటని దుఃఖించింది. నెమ్మదిగా నీలంకు లోకపు విశ్వరూపం తెలిసొచ్చింది. ఝార్ఖండ్‌ స్టీల్‌ కంపెనీలో పబ్లిక్‌ రిలేషన్స్‌ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తూ ఇంటాబయటా బాధ్యతలు మోయడం కంటే తమ విషయాల్లో జోక్యం చేసుకునేవాళ్లని తప్పించుకోవడం కష్టమయ్యేది. ద్వేషాలు, ద్రోహాలు, యత్రాంగంలో జాప్యాలతో తల బొప్పి కట్టేది. సింగిల్‌ పేరెంటింగ్‌లో ఉన్న కష్టాలకు తోడు ఆస్తి విషయమై అన్నలు, వదినలతో గొడవలు చికాకుపెట్టేవి. ఆరోగ్యం నానాటికీ క్షీణించేది. ‘క్యాన్సర్‌ లక్షల మందిని బలి తీసుకుంటోంది. అసలీ వ్యాధికిచ్చే మందులు, కీమోథెరపీ, రేడియేషన్‌ ఇంత ఖరీదెందుకు? ఎందుకెన్ని కుటుంబాలు శోకిస్తున్నాయి? మన విద్యావిధానం సమాజంలో ఉన్న చెడును నిర్మూలించదేం?’ అంటూ బాధపడేది. బాధల నుంచి ఉపశమనం పొందడానికి తిరిగి రచనల మీద ధ్యాస పెట్టింది. ఆ వ్యాపకం మానసిక బలాన్ని చేకూర్చింది. భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉన్న తరుణంలో ప్రఖ్యాత రచయిత, సంపాదకుడు కుష్వంత్‌ సింగ్‌ కలిసి రాద్దామనడం ఉత్సాహాన్నిచ్చింది. తన దారి స్పష్టమైంది. గూగుల్‌ లేని ఆ రోజుల్లో సమాచార సేకరణకు నాలుగేళ్లు పట్టింది. అయితేనేం 2002లో అచ్చయిన ‘అవర్‌ ఫేవరెట్‌ ఇండియన్‌ స్టోరీస్‌ బై కుష్వంత్‌ సింగ్‌ అండ్‌ నీలం కుమార్‌’ పుస్తకం బెస్ట్‌సెల్లర్‌ అయ్యింది.
జీవనం సాఫీగా సాగుతుండగా మరోసారి విఘాతం. క్యాన్సర్‌ తిరగబెట్టింది. కానీ అనుభవసారం ఆమెకెన్నో నేర్పింది. బౌద్ధం మానసిక దృఢత్వాన్ని పెంచింది. ఎలాగైనా బతకాలి, తనలా క్యాన్సర్‌తో బాధపడుతున్న వాళ్లకి అవగాహన కలిగించాలి అనుకుంది. మందులు శరీరం మీద పనిచేస్తాయి సరే.. మరి మెదడు సంగతేంటి? అనుకున్నప్పుడు రాయాలనే ఆలోచన వచ్చింది. ‘ట్యూస్‌డేస్‌ విత్‌ మోరీ’, ‘గ్రిట్‌ అండ్‌ గ్రేస్‌’, ‘ది లాస్ట్‌ లెక్చర్‌’ లాంటి క్యాన్సర్‌ కథనాలెన్నో చదివింది. క్లాసిక్‌ హిందీ చిత్రం ‘ఆనంద్‌’ చూసింది. అన్నిట్లో విషాదమే. వాటికి భిన్నంగా క్యాన్సర్‌ పేషెంట్లలో సంతోషాన్ని నింపుతూ నీలం రాసిన ‘టు క్యాన్సర్‌ విత్‌ లవ్‌ - మై జర్నీ ఆఫ్‌ జాయ్‌’ విపరీతంగా అమ్ముడుపోయింది. అది భారత్‌లో క్యాన్సర్‌ గురించి వచ్చిన తొలి హ్యాపీబుక్‌. క్యాన్సర్‌నే కాదు దేన్నయినా ఎదుర్కోడానికి ఉపయోగపడుతోందంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి. మనీషా కోయిరాలా జీవితం ఆధారంగా రాసిన ‘హీల్‌డ్‌: హౌ క్యాన్సర్‌ గేవ్‌ మీ ఎ న్యూ లైఫ్‌ మరో బ్లాక్‌బస్టర్‌ బెస్ట్‌సెల్లర్‌.
యువతే లక్ష్యంగా పదహారేళ్లుగా నీలం జీవిత రహస్యాలను బోధిస్తున్నారు. ‘అయామ్‌ ఎ సీ ఆఫ్‌ పాజిబిలిటీస్‌’ (అవకాశాలకు సముద్రాన్ని) పుస్తకానికి రతన్‌టాటా, అమితాబ్‌లు నిధులు సమకూర్చారు. ఆమె రచనల్లో ‘అయామ్‌ ఇన్విన్సిబుల్‌-13 ట్రూ టేల్స్‌ ఆఫ్‌ కరేజ్‌, గ్రిట్‌, అండ్‌ సర్వైవల్‌’ తనకెంతో ఇష్టమట. ఆశను కోల్పోయి అంధకార జీవితాలను గడుపుతోన్న ఎందరికో దారి చూపేలా, కష్టాల కడలిలో కొట్టుకుపోతున్న వాళ్లకి స్థైర్యమిచ్చేలా ఉంటాయి కనుకనే ఆమె రచనలంత    ఆదరణ పొందాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్