ట్రీచరమ్మ!

ఆమె ఒక శిక్షకురాలు... విద్యాబుద్ధులు చెప్పే టీచర్లకే పాఠాలు బోధిస్తారు. పాఠాలతోనే సరిపెట్టకుండా... పర్యావరణాన్ని కాపాడేందుకు నడుం కట్టారు. చిన్నప్పటి అభిరుచిని పెంచుకుంటూ...

Published : 14 May 2021 00:23 IST

ఆమె ఒక శిక్షకురాలు... విద్యాబుద్ధులు చెప్పే టీచర్లకే పాఠాలు బోధిస్తారు. పాఠాలతోనే సరిపెట్టకుండా... పర్యావరణాన్ని కాపాడేందుకు నడుం కట్టారు. చిన్నప్పటి అభిరుచిని పెంచుకుంటూ... ఒంటి చేత్తో వేల మొక్కలు నాటుతూ తనుండే ప్రాంతాలను పచ్చగా మారుస్తున్నారు అనుపమ. ఆవిడ వనప్రస్థానం ఇదీ...
55 ఏళ్ల అనుపమ జైపుర్‌లోని ‘అజీమ్‌ ప్రేమ్‌ జీ ఫౌండేషన్‌’లో హిందీ శిక్షకురాలు. ఈ ఏడాదిలో 6,964 మొక్కలను నాటారు. మొక్కలపై తనకు అంత అభిమానం ఎలా పెరిగిందో చెబుతారిలా.. ‘మా నాన్న విజయ్‌ కుమార్‌ రైల్వేలో మెయిల్‌ గార్డు. నా చిన్నతనం అంతా రైల్వే బంగ్లాలోనే గడిచింది. అక్కడి చుట్టుపక్కల ప్రాంతం మొత్తం వేప, మర్రి, వంటి చెట్లతో నిండి ఉండేది. మా ఇంటి ఆవరణలో పూల మొక్కలు, కూరగాయ మొక్కలని పెంచేవారు. తోటమాలి ఉన్నా సరే నాన్న మొక్కల సంరక్షణలోనే ఎక్కువ సమయం గడిపే వాడు’ అని చిన్ననాటి రోజులు గుర్తు తెచ్చుకుంటారు అనుపమ.
ఆమె కుటుంబం జైపుర్‌లో స్థిరపడింది. ఆమె అభిరుచి చిన్న చిన్న కుండీల్లో మొక్కల పెంపకానికే పరిమితమైంది. పెళ్లయిన తర్వాత కొన్నాళ్లకు సొంతిల్లు కట్టుకున్నారు. అక్కడ జామ, దానిమ్మ, నిమ్మ మొక్కలతో మిద్దె మీద చిన్నపాటి తోటనే సృష్టించారామె. వాటితోపాటు మిద్దె మీద వంకాయ, మొక్కజొన్న, కాకరకాయ, బెండకాయ, టొమాటోలాంటి కూరగాయ మొక్కలనూ పెంచుతున్నారు. అందుబాటులో ఉన్న సహజ పదార్థాలతో ఎరువులను తయారు చేసేవారు. చుట్టుపక్కల ఉండే వారికి కావాల్సిన మొక్కలను ఉచితంగా అందిస్తారామె. ఇంటి దగ్గరే కాదు స్టేడియమ్‌లు, బస్‌స్టాండ్‌లు, పోలీస్‌ పోస్ట్‌లు, రోడ్డు పక్కన, చెరువుల దగ్గర, కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కాలేజీలు, ఇళ్లు... ఇలా ఇప్పటిదాకా పదిహేను వేలకు పైగా మొక్కలు నాటారు.

మర్రి, రాగి, బిల్వ, సీతాఫలం, దానిమ్మ, జామ, ఉసిరి, నేరేడు.. ఇలా ఇరవైకి పైగా రకాలను నాటేవారు. మొక్క నాటిన చోట అక్కడి వారితో మాట్లాడి దాని సంరక్షణ బాధ్యతలను వారికి అప్పజెబుతారు.
‘బహిరంగ ప్రదేశాల్లో మొక్కలను సంరక్షించడం చాలా పెద్ద పనే. ఒక్కోసారి నాటిన తర్వాత కొన్ని రోజులకు వెళ్లి చూస్తే  మొక్కలు ఉండేవి కావు. దీనికి పరిష్కారంగా నేనో మార్గం ఎంచుకున్నా’ అని చెబుతారామె. మొక్క నాటిన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ మొక్క ఉపయోగాలను తెలుపుతూ పోస్టర్స్‌ అతికించేది. ఈ విషయాల్ని స్థానిక పత్రికలు ప్రచురించాయి. క్రమంగా అందరూ తనని ‘ట్రీ ఉమెన్‌’ అని పిలవడం మొదలుపెట్టారు.
అనుపమకు సేవాభావమూ ఎక్కువే. మరణించిన తర్వాత తన దేహాన్ని ‘సవాయి మాన్‌సింగ్‌ మెడికల్‌ కాలేజీ’కి ఇవ్వాలని 2010లో శరీరదానపత్రాన్ని రాసిచ్చారు. కళ్లు కూడా ఐ బ్యాంకుకు రాసిచ్చారు. ఈ వయసులోనూ మూడు, నాలుగు నెలలకోసారి రక్తదానం చేస్తుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్