శాకాహారుల కోసమే ఈ సొన!

కోడి ముందా...గుడ్డు ముందా? అని అడిగితే చెప్పలేం కానీ... కోడి, గుడ్డూ రెండూ లేకుండా సొన మాత్రం ఉందంటోంది ముంబయికి చెందిన శ్రద్ధా భన్సాలీ. శాకాహారుల ప్రొటీన్‌ అవసరాలను తీర్చేందుకు  మొక్కల ఆధారిత ద్రవరూప సొనను తయారు చేసి ప్రత్యామ్నాయ ఆహార రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన తన విజయగాథ ఇదీ...

Published : 15 May 2021 00:57 IST

కోడి ముందా...గుడ్డు ముందా? అని అడిగితే చెప్పలేం కానీ... కోడి, గుడ్డూ రెండూ లేకుండా సొన మాత్రం ఉందంటోంది ముంబయికి చెందిన శ్రద్ధా భన్సాలీ. శాకాహారుల ప్రొటీన్‌ అవసరాలను తీర్చేందుకు  మొక్కల ఆధారిత ద్రవరూప సొనను తయారు చేసి ప్రత్యామ్నాయ ఆహార రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన తన విజయగాథ ఇదీ...
ముంబయిలో పుట్టి పెరిగింది శ్రద్ధ. తండ్రి వ్యాపారవేత్త, తల్లి గృహిణి. అమ్మ వంట చేస్తోంటే తన కొంగు పట్టుకుని వంటలన్నీ నేర్చుకుంది. పాఠశాల విద్య పూర్తయ్యాక బోస్టన్‌ విశ్వవిద్యాలయం నుంచి హాస్పిటాలిటీ, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లలో గ్రాడ్యుయేషన్‌ చేసింది. తిరిగి వచ్చి వ్యాపారానుభవం, మెలకువలు నేర్చుకోవడానికి ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్లో పనిచేసింది. తర్వాత అక్కడ మానేసి హోటల్‌ నిర్వహణ, వినియోగదారుల అభిరుచులు, కొత్త పోకడలు... వంటివన్నీ తెలుసుకోవడానికి కొన్ని నెలలు పరిశోధన చేసింది. 2016లో ప్రైడ్‌ ఆష్‌ లయన్స్‌ హాస్పిటాలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో వ్యాపార సంస్థను రిజిస్టర్‌ చేసింది. దాని కింద ఏర్పడిన వెంచర్లలో క్యాండీగ్రీన్‌ మొదటిది.  
ప్రతిదీ అక్కడే పండుతుంది...
ఓ పట్టణరైతుని కలిసినప్పుడు పుట్టిన ఆలోచనే క్యాండీగ్రీన్‌ రెస్టారెంట్‌. దీని కోసం 400 చదరపు అడుగుల బిల్డింగ్‌ని లీజుకి తీసుకుంది. ఇక్కడ అవసరమైన కాయగూరలు, ఆకుకూరలు అన్నింటినీ మిద్దెమీదే పెంచుతారు. అదే దీని ప్రత్యేకత. ఇక్కడ పిప్పర్‌మెంట్‌, థాయిలాండ్‌ గడ్డి వంటి అరుదైన రకాలెన్నో సాగు చేస్తున్నారు. ఈ హోటల్‌లో సంప్రదాయ భారతీయ రుచులతో పాటు చైనీస్‌, ఇటాలియన్‌, థాయ్‌ వంటకాలూ దొరుకుతాయి. కాలానుగుణంగా మెనూ కూడా మారుతుంది. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే తక్కువ కాలంలోనే సినీ, రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులెందరికో ఇది అడ్డా అయ్యింది.
ప్రత్యామ్నాయ ఆహారం...
మాంసాహారంతో పోల్చితే శాకాహారాన్ని రుచిగా చేయడం, అందరినీ మెప్పించగలగడం కష్టం. అందుకే నిపుణుల ఆధ్వర్యంలో ఎన్నో ప్రయత్నాలు చేశా అంటోంది శ్రద్ధ. అప్పుడే శాకాహారులకు ప్రొటీన్‌ అందించే పదార్థాలు పెద్దగా లేకపోవడాన్ని గమనించింది. అదే సమయంలో ఓ ఆహార సదస్సులో కార్తీక్‌ దీక్షిత్‌ని కలిసింది. ఇద్దరి ఆలోచనలూ కలవడంతో ఓ ఫుడ్‌టెక్‌ స్టార్టప్‌ పెట్టారు... అదే ఎవో ఫుడ్స్‌. ప్రొటీన్‌ కోసం మొక్కల ఆధారిత ద్రవరూప సొనను తయారు చేయాలనుకుందీ సంస్థ. ఇందుకోసం చాలానే కష్టపడ్డారు. ఫుడ్‌, బయో కెమిస్ట్రీ శాస్త్రవేత్తల సాయంతో ఎన్నో పరిశోధనలు చేశారు. సంప్రదాయ గుడ్డు సొనలానే... రుచి, ఆకృతి ఉండాలి. అందులో దొరికే పోషకాలన్నీ అందాలి. అప్పుడే దీనికి విలువ అనుకున్నారు.
బఠాణీలు, పెసర్లు, చిక్కుళ్లు వంటి వాటి నుంచి ప్రొటీన్లను సేకరించి ఈ ద్రవరూప సొనను ఉత్పత్తి చేశారు. ఇందులో కొవ్వు, కెలొరీలు తక్కువ. ప్రొటీన్‌, విటమిన్‌ డి, అమైనో ఆమ్లాలు వంటివి గుడ్డులో మాదిరే లభిస్తాయి. దీంతో ఇది అంతర్జాతీయ విపణిలో ప్రత్యామ్నాయ ప్రొటీన్‌ బ్రాండ్‌గానూ అవతరించింది. ప్రస్తుతం ముంబయితో పాటు దేశవ్యాప్తంగా సుమారు ఇరవైకి పైగా ప్రముఖ హోటళ్లకు వీటిని సరఫరా చేస్తోంది. ఈ వినూత్న ఆలోచనకు అంతర్జాతీయంగా పెట్టుబడులు వెల్లువెత్తాయి. ‘రాబోయే ఐదేళ్లలో ప్రతి ఖండంలోనూ, ప్రతి పల్లెలోని దుకాణాల్లోనూ ఎవో బ్రాండ్‌ని చూడటమే మా లక్ష్యం’ అంటోంది శ్రద్ధ. తను టెడెక్స్‌ స్పీకర్‌ కూడా. రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాలో సుస్థిర, సామాజికబాధ్యతా విభాగానికి అధిపతిగా పనిచేస్తుంది.

 

క్యాండీ గ్రీన్‌ పేరుతో ముంబయిలో రెస్టారెంట్‌ ఏర్పాటు చేసి... వంటకాలకు అవసరమైన రకాలన్నింటినీ ఆ భవనం పైకప్పుపైనే పండిస్తోంది. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే! సొంతంగా వ్యాపారం చేయాలన్న తన కోరికను నిలబెట్టుకోవడమే కాదు... కొత్త ఆలోచనలతో ఆతిథ్య, ఆహార విభాగాల్లో విజయవంతంగా రాణిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్