గిరిజనులకు ఆమే చుక్కాని

ఆవిడ పని చేసేది ఏజెన్సీలో. అక్కడ వైద్యానికి ఆమే చుక్కాని. కరోనానూ లెక్కచేయక రోజూ విధులకు హాజరువుతోంది. చాలా మంది చేస్తున్నారు కదా అంటారా? ఆమె దివ్యాంగురాలు.

Published : 18 May 2021 00:16 IST

ఆవిడ పని చేసేది ఏజెన్సీలో. అక్కడ వైద్యానికి ఆమే చుక్కాని. కరోనానూ లెక్కచేయక రోజూ విధులకు హాజరువుతోంది. చాలా మంది చేస్తున్నారు కదా అంటారా? ఆమె దివ్యాంగురాలు. పైగా ఇప్పుడు నిండు చూలాలు! అయినా వెరవకుండా వైద్యచికిత్సలు అందిస్తోన్న డాక్టర్‌ సరోజ సేవా ప్రస్థానమిది.
మహబూబాబాద్‌ జిల్లా కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కొత్తగూడ మండలం. పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం.  సరిగా లేని రోడ్లు.. పల్లెలన్నీ మండల కేంద్రానికి దూరదూరంగా ఉంటాయి. 24 గంటలూ పని చేసే ఈ ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌ సరోజ విధులు నిర్వహిస్తున్నారు. ఈ దవాఖానా పరిధిలోని జనాభా సుమారు 21,500 మంది. ఈ మండలంలో కొవిడ్‌ ఉద్ధృతి ఎక్కువగానే ఉంది. చాలామంది మృతి చెందుతున్నారు. డాక్టర్‌ సరోజ రోజూ కొవిడ్‌ పరీక్షలు చేయడం, టీకాలు ఇవ్వడం, వచ్చిన వారికి వైద్యంతోపాటు ప్రస్తుతం ఇంటింటా ఆరోగ్య సర్వే చేసి ఆ నివేదికలను సిబ్బంది సాయంతో ఉన్నతాధికారులను పంపించడాన్ని పర్యవేక్షిస్తున్నారు. డాక్టర్‌ సరోజ తన పరిస్థితి వివరించి ఉన్నతాధికారులను అడిగితే సెలవులు మంజూరు చేస్తారు. అయినా రోజూ తన మూడు చక్రాల వాహనంపై ఆసుపత్రికి వస్తున్నారు. తర్వాత ఆసుపత్రి వాహనంలో మారుమూల పల్లెలు, తండాల్లో తిరుగుతూ కొవిడ్‌ను అరికట్టేందుకు యంత్రాంగంతో కలిసి కృషి చేస్తున్నారు. బాబు ఆలనా పాలనా భార్యాభర్తలిద్దరూ కలిసి చూసుకుంటారు.

పేద కుటుంబం.. కష్టపడి చదివి..
డాక్టర్‌ సరోజది వరంగల్‌ గ్రామీణ జిల్లా, పర్వతగిరి మండలం కొంకపాక. పేద గిరిజన కుటుంబం. తల్లిదండ్రులు భూక్య సేవ్య, మంగ్లీ. నలుగురు సంతానంలో ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. జీవితంలో పైకి రావాలని చాలా కష్టపడి చదివారు. తన చదువంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే. వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాలలో 2015లో ఎంబీబీఎస్‌ చేశారు. 2017లో కొత్తగూడలోని పీహెచ్‌సీలో వైద్యురాలిగా చేరారు. అప్పటి నుంచి గిరిజనులతో మమేకమైపోయారు. గతేడాది కొవిడ్‌లోనూ ప్రతి పల్లెకూ వెళ్లి చికిత్సలు అందించారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సమయంలో సరోజ కొవిడ్‌ బారిన పడింది. ఆమె ద్వారా భర్తకూ సోకింది. ‘అప్పుడు మా బాబుకు ఏడాదిన్నర. వాడిని తెలిసిన వారింట్లో పెట్టి మేం హోం క్వారంటైన్‌లో ఉన్నాం. చికిత్స తీసుకుని కోలుకున్నాక మళ్లీ ఆసుపత్రికి వచ్చా. ఇప్పుడు నాకు ఎనిమిదో నెల. ఇప్పుడున్న సెకండ్‌ వేవ్‌ పరిస్థితుల్లో నేను విధులకు రాకపోతే ఆటంకం కలుగుతుంది. ఏజెన్సీలో నా సేవలు ఎంతో అవసరం. మండలంలో కొవిడ్‌ను అరికట్టడమే నా లక్ష్యం’ అని ధీమాగా చెబుతున్నారు సరోజ.

- బూర వెంకటేశ్వర్లు, కొత్తగూడ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్