Updated : 20/05/2021 07:21 IST

మౌనమెందుకు.... మేలుకో!

శిరీష (పేరుమార్చాం) భర్త పనిచేసే సంస్థ మూతపడటంతో అతని ఉద్యోగం పోయింది. ఆమె వర్క్‌ఫ్రమ్‌ హోం చేస్తోంది. అది అతనికి చిన్నతనంగా ఉంది. భార్య విధులు నిర్వర్తించే సమయంలోనే... పనులు చెప్పేవాడు. కాస్త ఆలస్యమైతే సూటిపోటి మాటలనేవాడు. ఎంత నచ్చచెప్పాలని చూసినా అతడిలో మార్పురాలేదు. ఈ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసింది.
‘నా భర్త నన్ను తన అవసరాలను తీర్చే యంత్రంలా  మాత్రమే చూస్తాడని’ బాధపడుతోంది నలభై ఐదేళ్ల లక్ష్మి. భర్త ఇన్నాళ్లూ ఆఫీసు పనులతో తీరిక లేకుండా ఉండేవాడు. ఇప్పుడు ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నప్పటికీ... అభద్రత, ఆందోళన ఆమెను నిత్యం వెంటాడుతున్నాయి.  అతడు ఆమె చేసే ప్రతిపనిలోనూ లోపాలు వెతుకుతోంటే... కుంగిపోతోంది.
నిత్యది ప్రేమ పెళ్లి కావడంతో పుట్టింటి వాళ్లకు దూరమైంది. భర్త అరకొర జీతంతో ఇల్లు గడవడం కష్టమైంది. ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఆమె గర్భవతి.  భర్త చేయిచేసుకుంటుంటే ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితి..

181 హెల్ప్‌లైన్‌కి గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకూ తెలంగాణలో 10,338 గృహహింసకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ సంఖ్య 1103గా ఉంది.
ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే... అసలు ఇతరులతో చెప్పుకోలేని మరెన్నో సమస్యలతో కన్నీళ్లు దిగమింగుకుంటున్నారు స్త్రీలు. గతంలో కంటే... కరోనా వచ్చాక పరిస్థితులు మరింతగా దిగజారిపోయాయి.

మార్పు దిశగా అడుగేయండి...
మాట వినడం లేదంటారు ఒకరు... ఉద్యోగం పోయిందని ఒకరు, మద్యం దొరకట్లేదని మరొకరు...ఒత్తిడిని అదుపులో ఉంచుకోలేక అదుపు తప్పుతున్నారు. మాటల్ని తూటాల్లా ఒకరు విసిరితే... చేతినే ఆయుధంగా చేసుకుని దాడులు చేస్తున్నారు ఇంకొకరు. చిన్న విషయాలే...తుఫానులా మారుతున్నాయి. వెరసి మహిళలపై హింసకు కారణమవుతున్నాయి.
నిజానికి గృహహింస మనదేశానికే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య పెరిగింది. ‘కౌన్సిల్‌ ఆఫ్‌ క్రిమినల్‌ జస్టిస్‌’ జరిపిన అధ్యయనంలో తేలిందేంటంటే... ప్రపంచవ్యాప్తంగా సగటున 8.1శాతం గృహహింస పెరిగింది. మన జాతీయ మహిళా కమిషన్‌ నుంచి యునిసెఫ్‌ వరకు అందరిదీ ఇదే మాట.
కుటుంబ సమస్యల్ని అధిగమించడం అంత సులువైన పనికాదు. కానీ మన చుట్టూ ఉండే వాతావరణంలో కొన్ని మార్పులు చేసుకోగలిగితే.. నియంత్రణలో ఉంటాయి. ఆడవాళ్లకు పరిధులు గీసే ఆలోచనా ధోరణిలో మార్పు రావాలి. మహిళలు కూడా కుటుంబ పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. మార్పు కోసం ఇద్దరూ ముందడుగు వేయాలి. అనవసర ఖర్చులు అదుపులో ఉంచుకోవడం, బాధ్యతల్ని పంచుకోవడం, ఎదుటివారికి వ్యక్తిగత సమయాన్ని ఇవ్వగలగడం వంటి వాటి ద్వారా ఉపశమనం లభిస్తుంది.

*కుటుంబంలో సమస్యలు సహజమే అయినా... అవి సర్దుబాటు చేసుకోలేని స్థితిలో ఉంటే మధ్యవర్తి సాయం తీసుకోవడానికి వెనకాడొద్దు. ఈ విషయంలో మొదట ఇరువైపుల పెద్దల సాయం తీసుకోండి. ఈ క్రమంలో బాధితురాలికి కుటుంబం, సన్నిహితుల సహకారం ఎంతో అవసరం. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే... భరోసా కేంద్రాలు, వన్‌స్టాప్‌ సెంటర్లు, ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ కేంద్రాల సాయం తీసుకోండి. నిపుణుల సలహాలతో మీ సమస్య పరిష్కారం కావొచ్చు.
మనదేశంలో గృహ హింసకి సంబంధించిన ఫిర్యాదులను జాతీయ మహిళా కమిషన్‌ వాట్సాప్‌ నెంబర్‌: 72177-35372లో లేదా ఆ సంస్థ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయొచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో బాధితులెవరైనా 181, 100 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్‌ చేస్తే తక్షణం సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు ఆ సమాచారం చేరుతుంది. వారు బాధిత మహిళలను కాపాడతారు.
షీటీమ్స్‌, భరోసా, సఖి కేంద్రాలు.. తెలంగాణలో స్త్రీల రక్షణకోసం నిరంతరం పనిచేస్తున్నాయి. హైదరాబాద్‌ పరిధిలో ఆరు పోలీస్‌ స్టేషన్లలో ఇమీడియట్‌ రెస్పాన్స్‌ టీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ మహిళా పెట్రోలింగ్‌ పోలీసు బృందాలు తక్షణం   అక్కడకు చేరుకుంటాయి. కౌన్సెలింగ్‌ చేయడం, అవసరమైతే బాధితులకు పునరావాసం కల్పించడం వంటివి చేస్తాయి.
ఆంధ్రప్రదేశ్‌లో దిశ పోలీస్‌స్టేషన్లు, వన్‌స్టాప్‌ కేంద్రాలు,  ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెంటర్లు మహిళలపై హింసను నిరోధించేందుకు సాయం చేస్తున్నాయి. ఈ కేంద్రాల్లో ఉచిత న్యాయ, వైద్య, పోలీస్‌ సేవలు అందుతాయి. ఇవి కాక రెండు రాష్ట్రాల్లోనూ భూమిక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన హెల్ప్‌ లైన్‌ 18004252908 ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్‌లో మైఛాయిస్‌, షాహీన్‌ వంటి సంస్థలు పనిచేస్తున్నాయి. ఆన్‌లైన్‌లో ‘ఇన్విజిబుల్‌ స్కార్స్‌’ వంటి వేదికల్లోనూ మీ బాధల్ని చెప్పుకోవచ్చు.


మాట్లాడితేనే బయటపడగలరు...
- అనసూయ, డీసీపీ, సైబరాబాద్‌

ఇంటి నుంచే పని చేసే సంస్కృతి, ఆర్థిక ఒత్తిళ్లు, పనిభారం వంటివి ఇప్పుడు కుటుంబాల్లో కొత్త చిచ్చుల్ని పెడుతున్నాయి. దాంతో శారీరక, లైంగిక, మానసిక వేధింపులు పెరిగాయి. గతంలో ఎప్పుడైనా అత్తింట్లో ఏదైనా సమస్య తలెత్తితే అమ్మకో, అక్కకో చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు బయటకెళ్లే పరిస్థితులు లేవు. పోనీ ఫోన్‌లో మాట్లాడదామంటే... భర్త, అత్తమామలు వింటే ఏం గొడవోననే భయం. అన్నీ కలిసి ఆమె నోరు నొక్కేస్తున్నాయి. దాంతో మహిళ కుంగుబాటుకి గురవుతుంది. సర్దుకోలేని సమస్య అయినప్పుడు, అది హింసకు దారితీస్తున్నప్పుడు మౌనంగా ఉండొద్దు. మీ బాధ పంచుకునేందుకు పోలీసు వ్యవస్థ సిద్ధంగా ఉంది.


కౌన్సెలింగ్‌కి వెళ్లండి...
- డా. సుజాత గాదె, సైకాలజిస్ట్‌

కరోనా ఉన్నా... లేకున్నా ఇందుకు మద్యం ఓ ప్రధాన కారణం. మత్తులో దాడికి పాల్పడే వారేకాదు... ప్రస్తుతం మందుకి దూరం కావడం వల్ల కూడా విపరీత మానసిక ప్రవర్తనతో ఇబ్బంది పెట్టేవారి సంఖ్యా పెరిగింది. సాధారణంగా ఒత్తిడితో మహిళలు మాటతో దురుసుగా ప్రవర్తిస్తే, మగవారు శారీరక బలాన్ని చూపిస్తుంటారు. నాలుగు దెబ్బలు కొట్టగానే... దాచుకున్న డబ్బు ఇచ్చేస్తారు. లైంగిక అవసరాల్ని తీరుస్తారు. అలా ప్రస్తుతం హింసను రెట్టింపు స్థాయిలో భరిస్తున్నారు. మీ మనోబలాన్ని దెబ్బతీసుకోవద్దు. సంకోచించకుండా ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెంటర్‌ని సంప్రదించండి.



 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి