చందాలు వేసుకుని విమానమెక్కించారు

పూనం తివారీ అంటే క్రీడారంగంలో తెలియని వారుండరు. అంతర్జాతీయస్థాయిలో వెయిట్‌లిఫ్టర్‌గా అవార్డులు దక్కించుకున్నారీమె. మనసుకు నచ్చిన రంగాల్లో విరామం అంటూ ఉండదని చెప్పే ఈమె, తన గ్రామంలోని బాలికలందరినీ క్రీడాజ్యోతులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు.

Published : 25 May 2021 01:09 IST

పూనం తివారీ అంటే క్రీడారంగంలో తెలియని వారుండరు. అంతర్జాతీయస్థాయిలో వెయిట్‌లిఫ్టర్‌గా అవార్డులు దక్కించుకున్నారీమె. మనసుకు నచ్చిన రంగాల్లో విరామం అంటూ ఉండదని చెప్పే ఈమె, తన గ్రామంలోని బాలికలందరినీ క్రీడాజ్యోతులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు. వెయిట్‌లిఫ్టింగ్‌తోపాటు పలు రంగాల్లో అడుగుపెట్టేలా బాలికలను మెరికెల్లా తయారుచేస్తున్న పూనం స్ఫూర్తి కథనమిది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని హర్దోయీ జిల్లా ప్రభుత్వ కార్యాలయం దగ్గర్లోని మైదాన ప్రాంతమది. తెల్లవారే సరికే చుట్టుపక్కల గ్రామాల నుంచి పదుల సంఖ్యలో బాలికలు వచ్చి వ్యాయామాలు మొదలుపెడతారు. అంతలో అక్కడకు చేరుకుంటారు పూనం తివారీ. మధ్యాహ్నం వరకు అక్కడ వెయిట్‌లిఫ్టింగ్‌లో శిక్షణ కొనసాగుతుంది. ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన పూనం తివారీ అయిదుగురు సంతానంలో ఒకరు. తండ్రి ట్రక్కుడ్రైవరు. బాగా చదువుకోవాలని చెప్పే అమ్మ మాటలు పూనంపై ప్రభావం చూపించేవి. తొమ్మిదో తరగతి నుంచే ప్రభుత్వ ఉపకార వేతనానికి అర్హత సాధించింది. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో క్రీడల్లోనూ చురుగ్గా ఉండేది.  

నాన్నే  తొలి గురువు...
పూనం తండ్రి వెయిట్‌లిఫ్టర్‌. పూనంని తనలాగే తయారు చేయాలనుకునే వాడు. ఎనిమిదేళ్లకే ఆడపిల్లకు పెళ్లి జరిపించాలనే సంప్రదాయం ఆ ఊరివాళ్లది. కానీ అమ్మాయిలకు చదువు ఎంత ముఖ్యమో అందరికీ అవగాహన కల్పించడానికి ప్రయత్నించేవాడు ఆయన. అది తన ఇంటి నుంచే మొదలవ్వాలని భావించే వాడు. దాంతో పూనంకు వెయిట్‌ లిఫ్టింగ్‌లో ఓనమాలు దిద్దించాడు. అలా క్రీడల్లోకి అడుగుపెట్టిన ఆమె, వాటి ద్వారా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి, కుటుంబానికి ఆర్థిక చేయూత నందించాలనుకునే వారు. ఆమె ప్రతిభను గుర్తించిన శిక్షకులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించారు. అక్కడా పతకాలను సంపాదించింది. 2002లో కొరియాలో ఆసియన్‌ పవర్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు మన దేశం తరఫున పూనం హాజరయ్యింది. అదే సమయంలో తండ్రికి హార్ట్‌ఎటాక్‌ రావడంతో ఆసుపత్రిలో చేర్చారు. అప్పుడు తన తండ్రి చెప్పిన మాటలను ఎప్పటికీ మరవలేను అంటారు పూనం. ‘తొలిసారిగా అంతర్జాతీయ పోటీలకు వెళ్లడానికి మా ఊరి వాళ్లంతా చందాలు వేసుకుని నన్ను విమానం ఎక్కించారు. ఆ విషయమే నాన్న గుర్తు చేశారు. మన వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. నువ్వు విజేతగా రావాలి. ఊరి అమ్మాయిలందరికీ గర్వకారణమవ్వాలి. నాకేమీ కాదు, నువ్వు గెలిచిరా’ అన్న ఆయన మాటలు నాలో స్ఫూర్తి నింపాయి. ఆ పోటీలో వెండి పతకాన్ని దక్కించుకుని తిరిగి వచ్చా. ఆ ఛాంపియన్‌షిప్‌లో గెలుచుకున్న నగదు బహుమతితో నాన్నకు వైద్యం చేయించా. ఆ తర్వాత పలు పోటీల్లో విజేతగా నిలిచా. ఆ తర్వాత హర్దోయీ స్పోర్ట్స్‌ స్టేడియంలో రూ.1200 జీతానికి కోచ్‌గా చేరా. జాతీయ, అంతర్జాతీయ స్పోర్ట్స్‌ టోర్నమెంట్స్‌కు రిఫరీగానూ వ్యవహరిస్తున్నా. గతేడాది కొవిడ్‌ లాక్‌డౌన్‌లో స్టేడియం మూసేశారు. నాదగ్గర శిక్షణకు 70 కిలోమీటర్ల దూరం నుంచి కూడా అమ్మాయిలు వస్తారు. వారికిలా శిక్షణను మధ్యలోనే ఆపేయడం నాకు నచ్చలేదు. అందుకే ఉచితంగా కోచింగ్‌ ఇవ్వడం ప్రారంభించా. ఇందులో పెళ్లైనవారు, తల్లులు కూడా ఉన్నారు. అందరికీ ఫిట్‌నెస్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌ వంటి క్రీడల్లో శిక్షణనిస్తున్నా. గ్రామీణ బాలికలు చదువు, క్రీడల్లో ముందడుగు వేయాలనే నాన్న కలను నెరవేర్చడానికి కృషి చేస్తున్నా. నా శిష్యుల్లో పాతికమందికి పైగా జాతీయస్థాయిలో స్వర్ణ, వెండి పతకాలను దక్కించుకోవడం సంతోషంగా ఉంటుంది’ అని చెబుతారు పూనం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్