పాతిక వేల మందితో మాట్లాడా!

పిల్లలు పెద్దవాళ్లయ్యాక తనూ చదవడం మొదలుపెట్టారు... మనవలు పుట్టాక పట్టాలు సాధించారు. బడిపిల్లలకు జీవన నైపుణ్యాలు నేర్పడంతో మొదలుపెట్టి... నేడు వందలాది మంది ఆకలి తీరుస్తున్నారు. తాజాగా పేద కొవిడ్‌ రోగులకు ఉచితంగా మందులూ అందిస్తున్నారు...

Published : 31 May 2021 00:17 IST

పిల్లలు పెద్దవాళ్లయ్యాక తనూ చదవడం మొదలుపెట్టారు... మనవలు పుట్టాక పట్టాలు సాధించారు. బడిపిల్లలకు జీవన నైపుణ్యాలు నేర్పడంతో మొదలుపెట్టి... నేడు వందలాది మంది ఆకలి తీరుస్తున్నారు. తాజాగా పేద కొవిడ్‌ రోగులకు ఉచితంగా మందులూ అందిస్తున్నారు... ఆవిడే శైలజ విస్సంశెట్టి. సహజ ఫౌండేషన్‌ పేరుతో తను చేస్తున్న కార్యక్రమాల్ని వసుంధరకు వివరించారు...
వ్యాధి ఓ పక్క, కాలే కడుపులు మరోపక్క... పేదలను భయపెడుతున్నాయి. అలాంటి వారికి సహజ ఫౌండేషన్‌ తరఫున భరోసా కల్పించాలనుకున్నా. మొదట ఇంత పెద్ద ఎత్తున చేయాలనే ఆలోచన లేదు. అయితే మందులు కూడా కొనుక్కోలేక కొన్ని
కుటుంబాలు విలవిల్లాడిపోతున్న సంఘటనలు మా దృష్టికి వచ్చాయి. అలాంటి కొందరికి మొదటగా కొన్ని మందులు, నిత్యావసరాలు అందించాం. తర్వాత మరో యాభైమందిని గుర్తించి ఇచ్చాం. అలాంటివారు మరెందరో ఉన్నారని అర్థమైంది. దాంతో మా దృష్టికి వచ్చిన వారందరికీ ఈ కిట్లను ఇంటికే పంపించడం మొదలుపెట్టా. గత ఏడాదీ వలస కార్మికుల కోసం నిత్యాన్నదానం, నిత్యావసరాలు అందించేదాన్ని. జీహెచ్‌ఎంసీ కార్మికులు, మురికివాడల్లోని మహిళలకు శానిటరీ న్యాప్‌కిన్లనూ పంచిపెట్టాం. రెండో దశలో అవసరాలు మారిపోయాయి. అందుకు తగ్గట్లుగానే ఈ డ్రైవ్‌ని చేపట్టాం. ఎదుటివారికి సాయపడటంలోనే తృప్తి ఉందనేది నా నమ్మకం. అసలు సేవా సంస్థ ప్రారంభానికి కారణం వేరే ఉంది.
స్నేహితురాలి మరణంతో...
మాది హైదరాబాద్‌. పదో తరగతిలో ఉండగానే పెళ్లయ్యింది. తర్వాత ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఏళ్లు గడిచే కొద్దీ నాకు కొంత సమయం చిక్కేది. నన్ను నేను ఎడ్యుకేట్‌ చేసుకోవాలనే కోరిక బలపడింది. దానికి నా స్నేహితురాలు ఎంతో స్ఫూర్తినిచ్చింది. మా పాప ఏడోక్లాసు చదువుతున్నప్పుడు ఉస్మానియా నుంచి డిగ్రీ చేశా. నా కాళ్లమీద నేను నిలబడేందుకు ఉపయోగపడుతుందని శ్రామిక విద్యాపీఠ్‌ నుంచి బ్యూటీషియన్‌ కోర్సు చేశా. ఇంట్లోనే చిన్న పార్లర్‌ తెరిచా. తర్వాత పెయింటింగ్‌, ఎంబ్రాయిడరీ... ఇలా ఎన్నో నేర్చుకున్నా. ఆ సమయంలోనే నాపై తీవ్ర ప్రభావం చూపిన ఓ సంఘటన జరిగింది. నాకు ఎంతో స్ఫూర్తినిచ్చిన స్నేహితురాలు వైవాహిక సమస్యలతో ఆత్మహత్య చేసుకుంది. క్షణికావేశానికి అడ్డుకట్ట వేయాలన్నా, కుటుంబ కలహాలను చక్కదిద్దాలన్నా కౌన్సెలింగ్‌ అవసరం ఉందని అనిపించింది. దాంతో మా రెండో అమ్మాయి పెళ్లి సమయంలో అంటే 2007లో ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ కోర్సు చేశా. తర్వాత కౌన్సెలింగ్‌ చేయడం మొదలుపెట్టా. నా నైపుణ్యాలు సరిపోవనిపించి మనవలు పుట్టాక ఎంఎస్సీ సైకాలజీ, నల్సార్‌ నుంచి ఆల్టర్నేట్‌ డిస్ప్యూట్‌ రిజల్యూషన్‌లో పట్టాలు అందుకున్నా.

కథలు చెబుతాను...
కుటుంబ సమస్యలకు కారణం... మారిన జీవనశైలి కూడా. చిన్నప్పుడే పిల్లలకు విలువలు, నైతికతల గురించి తెలియజేయాలి. అందుకే పాఠశాలల్లో చిన్నారులకు జీవన నైపుణ్యాలు, నైతిక విలువలు నేర్పాలనుకున్నా. ఓ పాఠ్య ప్రణాళిక సిద్ధం చేసుకుని చాలా స్కూళ్లను సంప్రదించా. టైమ్‌ కేటాయించలేమన్నారు. డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నా అనుకున్నారు. కాదని చెప్పినా నమ్మలేదు. నేనే ఓ ఎన్జీవోని రిజిస్టర్‌ చేయిస్తే ఓ గుర్తింపు ఉంటుంది. దానిద్వారా కౌన్సెలింగ్‌ చేయొచ్చని భావించా. అలా సహజ ఫౌండేషన్‌ ఏర్పాటయ్యింది. అది మొదలు రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌ తదితర ప్రాంతాల్లో పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లోని చిన్నారులకు కౌమార దశలో మార్పులు, నెలసరి పరిశుభ్రత, చిన్న వయసులో ప్రేమలు, పెళ్లిళ్లు వంటి అంశాలపై పాఠాలు చెప్పా. ఇప్పటివరకూ పాతికవేల మంది అమ్మాయిలతో మాట్లాడి ఉంటా. మీ అమ్మంటే మీకు గౌరవం ఉంటే... ఇతర అమ్మాయిలనూ గౌరవించాలని అబ్బాయిలకూ చెబుతా. ఇవన్నీ చేస్తున్నప్పడే కొన్ని పాఠశాలల అభ్యర్థన మేరకు దాదాపు 15000 నోట్‌ పుస్తకాలను పంచాం. ఓ అమ్మమ్మగా పిల్లలు టీవీలు, ఫోన్‌లు మానాలంటే... కథలే సరైన మార్గమని భావిస్తా. కథలు పిల్లల్లో ఊహాశక్తిని పెంపొందిస్తాయి. అందుకే స్టోరీటెల్లర్‌ అవతారమెత్తా! ‘మన సహజ కథలు’ పేరుతో యూట్యూబ్‌లో ఛానెల్‌ నిర్వహిస్తున్నా. ‘డొనేట్‌ రీ డొనేట్‌’ నినాదంతో పాత పుస్తకాలు సేకరించి... పుస్తకపఠనంపై ఆసక్తి ఉన్నా కొనలేనివారికి పంపిస్తున్నా. సేవ చేయాలన్నా... ఏదైనా సాధించాలన్నా... సంకల్పం గట్టిగా ఉంటే చాలు. ఏదోవైపు నుంచి మనకు సాయం అందుతుంది. మా కార్యక్రమాలకు నిధులు, ఇతరత్రా సహకారాన్ని బంధువులు, మా అమ్మాయి ప్రదీప్తి, తన స్నేహితులు అందిస్తూ ఉంటారు. వారే లేకపోతే ఇవన్నీ చేయలేకపోయే దాన్ని.

- టి.నరేందర్‌, హైదరాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్