గుడ్డిపిల్ల ఎలా బతుకుతుందన్నారు?

పందొమ్మిదేళ్ల వయసులో యాసిడ్‌ దాడిలో చూపును పొగొట్టుకుంది. ఆ తర్వాత ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ తనకంటూ ఓ జీవితాన్ని ఏర్పరుచు కుందామె. తనలాంటి మహిళలకు వసతి కల్పిస్తోంది. దివ్యాంగ చిన్నారులకు పంతులమ్మలా మారి పాఠాలు చెబుతోంది. ఆమే ఉత్తరాఖండ్‌కు చెందిన 31 ఏళ్ల కవితా బిస్త్‌.

Published : 03 Jun 2021 01:48 IST

పందొమ్మిదేళ్ల వయసులో యాసిడ్‌ దాడిలో చూపును పొగొట్టుకుంది. ఆ తర్వాత ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ తనకంటూ ఓ జీవితాన్ని ఏర్పరుచు కుందామె. తనలాంటి మహిళలకు వసతి కల్పిస్తోంది. దివ్యాంగ చిన్నారులకు పంతులమ్మలా మారి పాఠాలు చెబుతోంది. ఆమే ఉత్తరాఖండ్‌కు చెందిన 31 ఏళ్ల కవితా బిస్త్‌.
అమ్మానాన్న, ఇద్దరు తోబుట్టువులు, తమ్ముడు.. అందమైన కుటుంబం ఆమెది. తండ్రి ఆర్టీసీలో డ్రైవర్‌. కవిత పెద్ద అక్క ఓ ప్రయివేటు సంస్థలో ఉద్యోగి. ఆమె కిడ్నీ వ్యాధితో చనిపోవడంతో తండ్రి మానసికంగా కుంగిపోయాడు. పనికి సరిగా వెళ్లకపోయేవాడు. దాంతో ఇల్లు గడవడం కష్టమైంది. పదోతరగతి పాసైన కవిత కుటుంబానికి సాయంగా ఉండాలనుకుంది. ఉపాధి కోసం యూపీలోని నోయిడా వెళ్లింది. ఓ చిన్న ఉద్యోగంలో చేరింది. అక్కడే ఆమెకు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతను పెళ్లి చేసుకోమని బలవంతపెట్టాడు. కవిత తన పరిస్థితి వివరించి అయిష్టతను వ్యక్తం చేసింది. అది ఆమె జీవితాన్ని ఓ విషాదకర మలుపుతిప్పింది. అది 2008, ఫిబ్రవరి 2. తెల్లవారు జామున కవిత బస్సు కోసం ఎదురు చూస్తోంది. ‘నాకింకా గుర్తు. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి నా ముఖంపై ఏదో చల్లి వెళ్లిపోయారు. ముఖమంతా భగ్గున మండిపోయింది. అతికష్టంమీద మా హాస్టల్‌ వాళ్ల సాయంతో ఆస్పత్రిలో చేరా’ అని గుర్తు చేసుకుంది కవిత. ఆ దాడిలో తన రెండు కళ్లూ పోయాయి. దాంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. దీనికి తోడు కవిత తండ్రి, చిన్నక్కయ్య కూడా వెంటవెంటనే చనిపోవడంతో కుటుంబ బాధ్యతలను తలకెత్తుకుంది. ‘చుట్టూ ఉన్న ప్రతికూలతల మధ్య కూడా ధైర్యంగా బతకాలనే సానుకూల ఆలోచనలను పెంపొందించుకున్నా. 2010లో అల్మొరాలోని రాష్ట్రీయ దృష్టిహీన్‌ సంఘ్‌ వాళ్ల బ్లైండ్‌ స్కూల్లో చేరాను. అక్కడి శిక్షణ ఆత్మవిశ్వాసాన్ని, జీవితంపై ఆశలను అందించింది. తర్వాత డెహ్రాడూన్‌లోని ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ విజువల్లీ హ్యాండీక్యాప్డ్‌’ సంస్థలో చేరా. అక్కడే కంప్యూటర్‌లో శిక్షణ తీసుకున్నా. షార్ట్‌ హ్యాండ్‌ చేశా. కొన్ని హస్తకళలు కూడా నేర్చుకున్నా. శిక్షణ పూర్తయ్యాక హల్ద్వానీకి వచ్చేశా’ అని చెబుతుందామె. 2014లో ఆమెకు జిల్లాలోని నిర్భయ సెల్‌లో ఉద్యోగం వచ్చింది. ప్రభుత్వ సాయంతో అనాథలు, అభాగ్యులైన మహిళలకు కుట్లు, అల్లికల్లో శిక్షణ ఇచ్చేది. కౌన్సెలింగ్‌ ఇచ్చేది. ఆమె సేవలకు గుర్తింపుగా పద్దెనిమిదికి పైగా అవార్డులు వచ్చాయి. ఆమె సామాజిక సేవలకు గుర్తింపుగా ‘ఉత్తరాఖండ్‌ రాజ్య మహిళ పురస్కారం’ కూడా వరించింది. ఆమెను 2015లో ఉత్తరాఖండ్‌ మహిళా సాధికారత అంబాసిడర్‌గా నియమించారు. గుజరాత్‌ ప్రభుత్వం నుంచి పలు అవార్డులు అందుకుంది.

కవిత 2017లో సందీప్‌ రావత్‌ను కలిశారు. ఆయన దివ్యాంగులైన చిన్నారుల కోసం ‘యూఎస్‌ఆర్‌ ఇందు సమితి స్కూల్‌’ నడుపుతున్నారు. ఈ పాఠశాల నైనిటాల్‌లో ఉంది. ఇందులో దాదాపు వంద మంది చిన్నారులకు ఆమె పాఠాలు చెబుతోంది. కొవిడ్‌ మొదలైన మొదట్లో కవిత, సందీప్‌ కలిసి మహిళల కోసం ఓ వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. దాని పేరే ‘కవిత ఉమెన్‌ సపోర్ట్‌ హోమ్‌’. ఈ హోమ్‌లోని మహిళలకు కౌన్సెలింగ్‌తోపాటు కుట్లు, టైలరింగ్‌లోనూ శిక్షణ ఇస్తోంది. ఓ వైపు తన కుటుంబాన్ని, మరోవైపు దివ్యాంగ చిన్నారులు, అనాథ మహిళలను చూసుకుంటున్న కవిత సేవలు స్ఫూర్తిదాయకం కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్