కలలు చెదిరినా.. కుంగిపోలేదు!

‘చికినీ చమేలీ..’ కత్రినా కైఫ్‌ కెరియర్‌లో గుర్తుండిపోయే పాట. ఇటీవల ఆ పాటకు ఓ అమ్మాయి వేసిన డ్యాన్స్‌ వీడియో వైరల్‌ అయ్యింది. ఎవరా ఈ అమ్మాయి అని వెదికిన వారు తన పోరాట పటిమకు జేజేలు పలుకుతున్నారు.

Published : 17 Jun 2021 01:52 IST

‘చికినీ చమేలీ..’ కత్రినా కైఫ్‌ కెరియర్‌లో గుర్తుండిపోయే పాట. ఇటీవల ఆ పాటకు ఓ అమ్మాయి వేసిన డ్యాన్స్‌ వీడియో వైరల్‌ అయ్యింది. ఎవరా ఈ అమ్మాయి అని వెదికిన వారు తన పోరాట పటిమకు జేజేలు పలుకుతున్నారు.

సుబ్రీత్‌ కౌర్‌ గుమ్మన్‌.. హిందీ డ్యాన్స్‌ షోలను చూసేవారికి సుపరిచితమైన పేరు. తనది పంజాబ్‌లోని జుంధన్‌ అనే చిన్న పల్లెటూరు. 2009లో బండి మీద వెళ్తోంటే ఆక్సిడెంట్‌ అయ్యింది. వైద్య సిబ్బంది త్వరగా స్పందించకపోవడంతో కాలికి ఇన్ఫెక్షన్‌ అయ్యింది. దీంతో తొలగించక తప్పలేదు. ఏడు ఆపరేషన్లు చేస్తే కానీ ప్రాణాలు దక్కలేదు. ఒక్కసారిగా జీవితం తలకిందులైంది. ఓ ఏడాదంతా నొప్పిని భరించాల్సి వచ్చింది. నెమ్మదిగా ఒంటి కాలుతోనే నడవడం నేర్చుకుంది. ఇక ఇంతే అనుకోవడం సుబ్రీత్‌ మనస్తత్వం కాదు. జీవితంలో ఏదైనా సాధించాలనుకుంది.

తనకు డ్యాన్స్‌ అన్నా, వ్యాయామమన్నా ఇష్టం. కాలు లేనంత మాత్రాన ప్రయత్నాన్ని ఎందుకు ఆపాలనుకుంది. నెమ్మదిగా స్టెప్‌లు వేయడం ప్రారంభించింది. ఇంట్లో వాళ్లూ ప్రోత్సహించారు. కానీ నేర్పడానికి ఎవరూ ముందుకు రాలేదు. తన పట్టుదలను చూసి ఒక అకాడమీ వాళ్లు ముందుకొచ్చారు. అక్కడ నేర్చుకుని ‘ఇండియా గాట్‌ టాలెంట్‌’ షోకు వెళ్లింది. ఫైనల్స్‌కు చేరుకుంది. విజయం సాధించకపోయినా ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుంది. అది ఎన్నో అవకాశాలనూ తెచ్చిపెట్టింది. తర్వాత ప్రేమ వివాహం చేసుకుంది. కానీ అతను ఆమె సంపాదనను ప్రేమించాడు. దీంతో అతన్నుంచి కొద్ది కాలంలోనే విడిపోయింది. ‘కాలు పోయినప్పుడు కూడా కుంగిపోలేదు. కానీ మోసం మాత్రం నన్ను చాలా బాధించింది’ అంటుంది సుబ్రీత్‌. కానీ ఇవేమీ తన కలలను సాకారం చేసుకోవడంలో అడ్డు కావంటుంది.

ఈసారి డ్యాన్స్‌పైనే కాకుండా వ్యాయామంపైనా దృష్టిపెట్టింది. ఇందుకోసం రోజూ 35 కి.మీ. ప్రయాణం చేసేది. మోడలింగ్‌తోపాటు ఫిట్‌నెస్‌ పాఠాలనూ బోధిస్తోంది. వీటి ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పంచుకునేది. తాజాగా ఏడేళ్ల క్రితం తనకు పేరు తెచ్చిన ‘చికినీ చమేలీ’ పాటకే ఏడేళ్ల తర్వాత మళ్లీ డ్యాన్స్‌ వేసి, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ల్లో పోస్ట్‌ చేసింది. ఆ వీడియోని 2 కోట్ల 80 లక్షల మంది చూశారు. చిన్నచిన్న కారణాలకే కుంగిపోయి జీవితాన్నే బలి చేసుకుంటున్న వారెందరో. ఎన్నో అవరోధాలొచ్చినా.. ధైర్యంగా ముందుకుసాగుతూ తన కలల్ని సాకారం చేసుకుంటున్న సుబ్రీత్‌ ఎందరికో ఆదర్శమే కదా! ఆ విషయాన్నే నెటిజన్లూ తమ కామెంట్లలో చెబుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్